తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితుల అరెస్టు

ఖమ్మం ముచ్చట్లు:


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 8 మందని అరెస్టు చేసి ఖమ్మం సెషన్స్ కోర్టులో జడ్జి ఎదుట హాజరు పర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు. వ్యక్తిగత కక్షలతో పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు కృష్ణయ్యను హతమార్చినట్లు చెబుతున్నారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగష్టు 15వ తేదీన కృష్ణయ్యను దారుణంగా చంపి పారిపోయినట్లు తెలిపారు.ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి మూడు బైకులు, ఆటో, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. అయితే కోర్టుకు సమర్పించిన నిందితుల జాబితాలో పేర్లు తారుమావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. బాధితుల ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఏ1గా తమ్మినేని కోటేశ్వరరావు పేరు ఉండగా..

 

 

కోర్టుకు సమర్పించిన నివేదకలో మాత్రం ఏ1గా బోడపట్ల శ్రీనివాసరావు పేరు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు గోప్యత పాటించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో ఏ1గా బోడపట్ల శ్రీను, ఏ2గా గజ్జి కృష్ణస్వామి, ఏ3గా నూకల లింగయ్య, ఏ4గా బండారు నాగేశ్వరరావు, ఏ5గా కన్నెగంటి నవీన్, ఏ6గా జక్కంపూడి కృష్ణ ఏ7గా మల్లారపు లక్ష్మయ్య, ఏ8గా షేక్ రంజాన్ పేర్లను చేర్చారు పోలీసులు. నిందితులు వ్యక్తిగత కక్షతోనే కృష్ణయ్యను హత్య చేసినట్లు ఒప్పకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 15న సెలవు దినం కావడం.. జనసంచారం తక్కువగా ఉండడంతో అదేరోజున హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పారు పోలీసులు. హత్య తర్వాత నిందితులు రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు పారిపోయినట్లు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

Tags: Accused arrested in Tammineni Krishnaiah murder case

Leave A Reply

Your email address will not be published.