సింగరేణిపై ఆదానీ కన్ను

మెదక్  ముచ్చట్లు:

విదేశీ బొగ్గు దిగుమతిలో అదానీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదంటూ టీఆర్ఎస్ ఫైర్ అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో అతి తక్కువ ధరతో అదానీ ఎల్-1 గా నిలిచారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌లలో మైనింగ్ ప్రక్రియతో పాటు ఆపరేషన్ల కోసం ఆహ్వానించిన టెండర్లలో ఈ – రివర్స్ పద్ధతిలో రూ.1,090 కోట్లతో అదానీ కంపెనీ మొదటి స్థానంలో ఉన్నది. నిబంధనల ప్రకారమే ప్రక్రియను నిర్వహించినట్లు సింగరేణి సంస్థ పేర్కొన్నది. కంపెనీ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఈ-పోర్టల్ ద్వారా ఎల్-1 సంస్థను ఎంపిక చేయడానికి ఓపెన్ ఎంక్వయిరీ కూడా నిర్వహిస్తున్నట్లు సింగరేణి స్పష్టం చేసింది. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నట్లు మోడీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు నిప్పులు చెరుగుతున్న సమయంలో సింగరేణి ఆధ్వర్యంలోని నైని కోల్ బ్లాక్ టెండర్‌లలో అదానీ ఎల్-1 గా నిలవడం గమనార్హం.ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ 2015 ఆగస్టు 13న సింగరేణి సంస్థకు కేటాయించబడింది. మరే సంస్థతో భాగస్వామ్యం లేకుండా పూర్తి షేర్లు సింగరేణికే ఉన్నాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ తరఫున నామినేటెడ్ అథారిటీ అధికారికంగా వెల్లడించింది. మైనింగ్ కోసం ఇంకా అనుమతి ఇవ్వనందున తవ్వకాలు మొదలుకాలేదని తెలిపింది. ఈ బ్లాక్‌ను దక్కించుకున్న సింగరేణి సంస్థ 2015 ఏప్రిల్ 13న రూ. 25 కోట్లు, గతేడాది జూలై 7న మరో రూ. 1.25 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి సంస్థ దాఖలు చేసిన దరఖాస్తులకు అనుగుణంగా 2019 ఏప్రిల్ 18న మైనింగ్ ప్లాన్‌కు అనుమతి లభించగా,

 

 

 

 

గతేడాది జూలై 28న స్టేజ్-1 ఫారెస్టు క్లియరెన్సు లభించింది. గతేడాది డిసెంబరు 1న ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్సు వచ్చింది. అప్పటికే 2020 జూన్ 18న మైనింగ్ లీజు మంజూరైంది. ఏటా 10 మిలియన్ టన్నుల మేర బొగ్గు తవ్వకాలు, ఆపరేషన్ కోసం సింగరేణి సంస్థ టెండర్లను ఆహ్వానించగా ఐదు కంపెనీలు ఆసక్తి చూపాయి. ఎల్-1గా అదానీ సంస్థ ఉన్నా జిందాల్ (రూ. 1,127 కోట్లు), కోల్‌కతాకు చెందిన ఆంబే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 1,095 కోట్లు) కూడా ఈ-రివర్స్ ఆక్షన్ ద్వారా టెండరు ప్రక్రియలో పాల్గొన్నాయి. మొత్తం మూడు సంస్థల నుంచి క్వాలిపైడ్ బిడ్‌లు దాఖలైనట్లు సింగరేణి సంస్థ ధ్రువీకరించింది. నైని కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని పార్లమెంటు వేదికగా కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి బదులిస్తూ, ఢిల్లీకి చెందిన కరంజీత్ సింగ్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్‌కు చెందిన దుర్గా ఇన్‌ఫ్రా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా టెండర్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం ఐదు సంస్థల్లో దేనికి కాంట్రాక్టు ఇవ్వాలన్నది సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

 

 

 

 

అవసరమైతే టెండర్ దక్కించుకున్న సంస్థ తన వాటాగా 51% ఉంచుకుని మిగిలిన 49 శాతాన్ని ఇతర సంస్థలతో కలిపి జాయింట్ వెంచర్‌గా కూడా మైనింగ్, ఆపరేషన్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చని మంత్రి వివరించారు.ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, స్వరాష్ట్రానికి చెందిన బడా వ్యాపారవేత్తలు అదానీ, అంబానీలకు సేల్స్ మన్ తరహా పాత్రను పోషిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 2న ఆరోపించారు. విదేశీ బొగ్గుకు అదానీ సంస్థ మన దేశంలో ఏకైక ఇంపోర్టర్‌గా ఉన్నదని, ఆ సంస్థకు లాభాలు చేకూర్చి పెట్టడానికే థర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ తప్పనిసరిగా విదేశీ బొగ్గును బ్లెండింగ్ చేసేలా దిగుమతి చేసుకోవాలన్న నిబంధన తీసుకొచ్చారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ఉన్న సింగరేణిలో ఇప్పుడు అదానీ కూడా ఎంటర్ కావడం గమనార్హం.

 

 

 

నైని కోల్ బ్లాక్‌లో మైనింగ్ కోసం తక్కువ ధరతో ఎల్-1గా నిలవడంతో ఖరారు చేయక తప్పడంలేదు. అదానీపై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో సింగరేణి టెండర్లలో ఆ సంస్థను విధిగా ఖరారు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. బీజేపీని రాజకీయంగా ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో అదానీకి లాభం చేకూర్చడాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు సింగరేణి విషయంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, విపక్షాల కామెంట్లకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం అదానీ టెండర్‌ను ఖరారు చేయడమా? లేక వివిధ కారణాలతో తిరస్కరిస్తే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులను తట్టుకోవడం సాధ్యమేనా? విపక్షాలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఇక ఏం చేయనున్నది? ఇవీ ఇప్పుడు కీలకంగా మారాయి.

 

Tags: Adani’s eye on Singareni

Leave A Reply

Your email address will not be published.