అవినీతికి చిరునామా నీరు-చెట్టు పనులు

Water-tree works.

Water-tree works.

Date:24/11/2018
ఆళ్లగడ్డ ముచ్చట్లు:
నీరు-చెట్టు పనులు కేసీ కెనాల్‌ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయకట్టు రోడ్లు, పూడికతీత, గట్టుబలోపేతం పనులు చేపట్టకుండానే బిల్లులు బొక్కేశారు. ఫలితం రూ.కోట్లు కేటాయించిన పనులు తూతూమంత్రంగా జరగడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఆళ్లగడ్డ డివిజన్‌లో  అధికారులు ఫిక్స్‌ చేసిన పర్సంటేజీతోపాటు ఆయకట్టు రోడ్లకు మట్టి తోలే సమయంలో ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున వసూలు చేసి ఓ అధికారి వ్యక్తిగతంగా జేబులో వేసుకున్నారు. దీనిపైనా అధికారుల్లో కీచులాట జరిగినట్లు సమాచారం. జిల్లాలో కేసీ కెనాల్‌ పరిధిలో ఈ ఏడాది రెండోవిడతలో భాగంగా సుమారు 2,680 వరకు పనులు మంజూరు చేశారు. వీటిలో ఎక్కువ భాగం ఆయకట్టు రోడ్లు, పంటకాల్వలు వెడల్పు చేయడం, కట్టను బలోపేతం చేయడం, పూడికతీత వంటి పనులు చేపట్టారు. చేసే ఏ పనికీ కొలతల్లేవు. అగ్రిమెంట్‌కు, క్షేత్రస్థాయిలో జరిగిన పనికి పొంతనే లేదు. ఆయకట్టు రోడ్లలో అయితే రెండు, మూడు కి.మీ. పనిచేయాల్సి ఉండగా.. కేవలం ఒక కి.మీ. మట్టి తోలి మమ అనిపించి బిల్లులు చేసేశారు.
కుందూ నదిలో సైతం నంద్యాల నుంచి ఉయ్యాలవాడ, చాగలమర్రి వరకు పూడికతీత వంటి పనులు అరకొరగా చేసి బిల్లులు చేసుకున్నారు. కట్ట బలోపేతం పనులు సైతం యంత్రంతో పైపైన పాత మట్టిని తవ్వి చదును చేసి అదే కొత్తగా వేసినట్లు కళ్లకు గంతలు కట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు నంద్యాల కేసీ కెనాల్‌ పరిధిలో 717 పనులకు రూ.63.99 కోట్ల వరకు చెల్లింపు జరిపారు. 1270 పనులకు సంబంధించి రూ.110.60 కోట్లు పీఏవో లాగిన్‌లో ఉన్నాయి. సీఎఫ్‌ఎం ద్వారా ఆన్‌లైన్‌లో ఫైనాన్స్‌ ఏడీకి వెళ్లి అక్కడి నుంచి నిధుల వెసులుబాటును బట్టి ముందు పంపిన బిల్లుల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. ఇవిగాక కార్యాలయాల్లో ఈఈ స్థాయిలో 114 పనులకు సంబంధించి రూ.9.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నీరు-చెట్టు కింద భారీగా జిల్లాకు నిధులు మంజూరు చేశారు. ఈ సమయంలో కేసీ కెనాల్‌ పరిధిలో 0-30 కి.మీ. వరకు కాల్వ పూర్తిగా దెబ్బతింది. ఆళ్లగడ్డ పరిధిలోని కేసీ కెనాల్‌లో 27వ లాక్‌ నుంచి 26వ లాక్‌ మధ్య పీజీ బంగ్లా కాల్వ తూముకు షట్టరు లేక చాలాకాలం అవుతోంది. నీరంతా ఇక్కడ వృథాగా పోతోంది.
అధికారులు తూముపై సిమెంట్‌ దిమ్మె నిర్మించారే తప్ప ఇప్పటివరకు షట్టరు ఏర్పాటు చేయలేదు. 27వ లాక్‌ నుంచి దొర్నిపాడుకు వెళ్లే కాల్వ లైనింగ్‌ ధ్వంసమైంది. దెబ్బతిన్న చోట్ల అధికారులు లైనింగ్‌ను తొలగించేశారు. సుమారు ఆరు మాసాలు కావస్తున్నా ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. నీరు-చెట్టు కింద ఇంత నిధులు వెచ్చిస్తున్నా సమస్యలు కనిపించవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఉపయోగకరమైన పనులు పక్కన పడేశారనే చెప్పాలి. కాంక్రీట్‌ పనుల్లో మిగులు తక్కువ కనుక ఆ పనులవైపే కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ఎక్కడబడితే అక్కడ పూడికతీత, ఆయకట్టు రోడ్లు, వంకల్లో పనులు చేసినట్లు చూపిస్తూ నిధులు జుర్రేస్తున్నారు. మూడోవిడతలో మరో వంద పనులు ప్రతిపాదించి రాజకీయ ఒత్తిడి తెచ్చి మంజూరు చేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు
అసలు నిబంధనల ప్రకారం వాగులు, వంకలు ఎప్పుడైనా మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ పరిధిలోనే ఉంటాయి. ఇందులో పూడిక తీత పనులు చేయాల్సిన బాధ్యత మైనర్‌ ఇరిగేషన్‌దే.
అయితే ఆ పనులు సైతం డబ్బుల కోసం ‘కేసీ కెనాల్‌ నీరు-చెట్టు’ పనుల్లో ప్రతిపాదనలు పెట్టి పనులు చేస్తున్నారు. విచిత్రమేమంటే గడివేముల, గోస్పాడు పరిధిలో సూక్ష్మ నీటిపారుదల శాఖ నీరు-చెట్టు కింద చేపట్టి బిల్లులు పూర్తయిన సుమారు 70 పనులనే కేసీ కెనాల్‌ పరిధిలో ప్రతిపాదనలు పెట్టి పనులు చేసి బిల్లుల చేయడం గమనార్హం. వీటి విలువ సుమారు రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం వర్షాల్లేకపోవడం, కాల్వల్లో నీళ్లు తక్కువగా ఉండటంతో ఈ నెలాఖరు నుంచి విజిలెన్స్‌ అధికారులు నంద్యాల కేసీ కెనాల్‌ నీరు-చెట్టు పనులను తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే 2 వేల పనులకు సంబంధించిన దస్త్రాలు విజిలెన్స్‌ చేతుల్లో ఉన్నాయి.
Tags:Address water-tree works for corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *