– వెంగమాంబ సంకీర్తనల ఆడియో సిడి ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మూడురోజుల పాటు నిర్వహించిన అదివో అల్లదివో కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ రచనలతో స్వరపరచిన సంకీర్తనల ఆడియో సిడిని శ్వేత డైరెక్టర్ భూమన్, ఎస్వీబీసీ ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర ఆవిష్కరించారు.అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని తన రచనలతో సేవించి తరించిన పరమభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈ భక్తాగ్రేసరుదాలి భక్తిప్రపత్తులకు చిహ్నంగా తిరుమల శ్రీవారికి ముత్యాల హారతిని సమర్పించే కార్యక్రమాన్ని టీటీడీ విశేషంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తరిగొండ వెంగమాంబ రచించిన కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ఆధ్వర్యంలో అదివో అల్లదివో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన అదివో అల్లదివో కార్యక్రమానికి ఎస్వీబీసీ ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర, ప్రముఖ గాయకులు సాయిచరణ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మూడురోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 17మంది గాయనీ గాయకులు పాల్గొని తరిగొండ వెంగమాంబ కీర్తనలను ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు.అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన శ్రీమద్భాగవతంలోని ద్వితీయ, తృతీయ, దశమ స్కంధాల నుండి సేకరించిన ఎనిమిది సంకీర్తనల ఆడియో సిడిని ఆవిష్కరించారు. వీటిని ఇందుకోసం ఆర్థిక సహకారం అందించిన గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త శ్రీ రాముకు సిడిలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ రచనలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రాచుర్యం కల్పించడానికి డా. సాయికృష్ణ యాచేంద్ర విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.అనంతరం డా. సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని తన రచనల ద్వారా కీర్తించిన తరిగొండ వెంగమాంబ రచనలలోని సారాంశాన్ని భక్తులకు అందించడమే తన కర్తవ్యమని తెలిపారు.ఈ సందర్భంగా మూడురోజుల పాటు తరిగొండ వెంగమాంబ సంకీర్తనలను ఆలపించిన గాయనీ గాయకులు పవన్ చరణ్, సాయిచరణ్, లోకేశ్వర్, హరిణితో పాటు ఆర్థిక సహకారం అందించిన శ్రీ రామును ఎస్వీబీసీ ఛైర్మన్ ఘనంగా సత్కరించి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన సాహితీవేత్త శోభారాజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:”Adivo Alladivo” which ended in Mahati.