Natyam ad

ముందస్తు ఖాయం-ప్రతిపక్షాలు కిం కర్తవ్యం

హైదరాబాద్ ముచ్చట్లు :


తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శరవేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు ..  వేగంగా అమలు చేస్తున్న పథకాలు  అన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలేనని భావిస్తున్నారు. అయితే  ఎన్నికల ఏడాది కాబట్టి కేసీఆర్ ఇలా పాలన పరుగులు పెట్టిస్తున్నారని సాధారణ సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ముందస్తు ఎన్నికలు అంటూ వస్తే..బీఆర్ఎస్ ను ఓడిస్తామంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడీగా ఉన్నాయా ?  వెంటనే అభ్యర్థులను ఖరారు చేసుకోగలవా ? తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది కేసీఆర్ నిర్ణయం. అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే ఆ తర్వాత  రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ రద్దు చేయకపోయినా నవంబర్ డిసెంబర్‌లో జరుగుతాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి మరోసారి ముందే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఒక వేళ అదే నిజమైతే కేసీఆర్ అన్ని రకాలుగా సిద్ధమయి ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా పూర్తి కసరత్తు చేశారు. అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని రంగంలోకి దిగారు. ఎక్కడా వెనుతిరిగి చూడకుండా ..మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఈ సారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. అంతే ప్రణాళిక ప్రకారం వెళ్తారు. అందులో ఎలాంటి సందేహాలు ఉండవు. అంటే.. కేసీఆర్ ప్రిపరేషన్స్ విషయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఎన్నికల వార్ లో గ్రౌండ్ రెడీ చేసుకుని కేసీఆర్ యుద్ధానికి సిద్ధమైపోయి ఉంటారు కానీ.

 

 

విపక్షాలు మాత్రం సిద్ధంగా ఉంటాయా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయమే. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న రెండు పార్టీలు జాతీయ పార్టీలే. వాటి నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచే తీసుకోవాలి. అందుకే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తీసుకున్నంత వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇంకా చెప్పాలంటే.. ముందస్తుగా కసరత్తు కూడా చేసుకోలేరు. అందుకే రెండు విపక్ష పార్టీల్లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభించలేని నిస్సహాయత కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా… సమయానికే ఎన్నికలు జరిగినా సిద్దమవడం అనే కసరత్తే ఉండదు. ఎన్నికల తేదీలు వచ్చాక.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అబ్యర్థుల కసరత్తు జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ ఈ పంచాయతీ జరుగుతుంది. ఇలాంటి రాజకీయ కసరత్తు ఉండే కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా పెద్దగా మార్పేమీ ఉండవు.

 

 

Post Midle

అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ఆయన చెబుతున్నారు.. కానీ సీనియర్ల సహాయ నిరాకరణతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతూనే ఉన్నారు. ఆయన రెండు, మూడు రోజుల కిందటే పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే రేవంత్ కిందా మీదా పడాల్సిందే. ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో తప్ప ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. చేరికల కోసం వేసిన మాస్టర్ ప్లాన్స్ అన్నీ విపలమయ్యాయి. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్లు రాని నేతలకు .. బీ ఫారాలు ఇచ్చి పోటీ చేయించడం మినహా ఆ పార్టీకి మరో దారి ఉండదన్న వాదన ఉంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు … ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. కానీ అసలు గ్రౌండ్‌లో మాత్రం అలా ఉండదు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే.. సన్నాహాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అని చెప్పక తప్పదు.

 

Tags: Advance determination- duty of the opposition

Post Midle