ప్రకటనలకే ఆర్టీసీ సేఫ్టీ

Advertising RTC Safety

Advertising RTC Safety

Date:15/09/2018
కరీంనగర్ ముచ్చట్లు :
ఆర్టీసీలో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యానికి చేరుకోండి.. అనేది రాతలకే సరిపోతోంది. ఆచరణలో మాత్రం కానరావడం లేదని అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది.ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పదిలమేనా అనే అనుమానాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. 2017–18 సంవత్సరంలో 36 ప్రమాదాలు జరిగాయి. 14 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 2018–19 సంవత్సరంలో ఆగస్టు మాసం వరకు 16 ప్రమాదాలు జరగగా 20 మంది మృత్యువాత పడ్డారు.
మే 26న మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు రాజధాని గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. 14 మంది ప్రయాణికులు చనిపోయారు.వందల కిలోమీటర్లు బస్సులు నడిపే డ్రైవర్ల పని ఒత్తిడి సైతం ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవచ్చు.
రోజు విధులు నిర్వహిస్తుండడం, ఓవర్‌ డ్యూటీ పేరుతో కొంతమంది డ్రైవర్లు నిద్ర లేని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను పట్టించుకోకుండా బస్సు నడిపించే సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఉండడం, మార్గమధ్యలో కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు మద్యం సేవిస్తుండడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది.
కాగా ఆర్టీసీ అధికారులు గతేడాది 0.01 శాతం ప్రమాదాలు రేటుగా లెక్కించారు. ఈయేడాది ప్రమాదాల రేటు 0.08 ఉందని పేర్కొంటున్నారు. గతం కంటే ప్రస్తుతం ప్రమాదాల రేటు తగ్గిందని వారు చెబుతున్నారు. ఈ ప్రమాదాల రేటును లక్ష కిలోమీటర్లకు ఎన్ని ప్రమాదాలు జరిగాయనే దానిపై లెక్కించనున్నట్లు తెలిపారు.
మేలో మంచిర్యాల డిపో బస్సు ప్రమాదానికి గురికావడంతో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌లో 14 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌కు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కానీ ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో బతికి బయటపడ్డారు. గతంలో నేరడిగొండ వద్ద జరిగిన ప్రమాదంలో కూడా పది మంది వరకు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో    కలిసిపోయాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జిల్లాలో సైతం చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది.ఆర్టీసీ బస్సులు చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఇందులో ప్రయాణాలు సాగించడం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వెళ్లడమేనని చెబుతున్నారు.
ప్రైవేట్‌ వాహనాలపై నమ్మకం లేకనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది డ్రైవర్ల అలసత్వం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాలం చెల్లిన బస్సులకు సైతం ఫిట్‌నెస్‌ కల్పించడం, మద్యం సేవించి కొంతమంది డ్రైవర్లు విధులు నిర్వహించడం, ఓవర్‌ డ్యూటీలు చేయడం, తదితరవి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతున్నాయి. ప్రతిరోజు డ్రైవర్లను అధికారులు పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అవగాహన కార్యక్రమాలు నామ్‌కే వాస్తేగా నిర్వహించడం, సంవత్సరంలో ఒకటో రెండో కార్యక్రమాలను చేపట్టి చేతులు దులుపుకోవడంతో ఈ దుస్థితి తలెత్తుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:Advertising RTC Safety

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *