సౌకర్యాలతో తక్కువ ధరకే ప్లాట్లు.

అనంతపురం ముచ్చట్లు:

మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్‌  టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది.  జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ.  మౌలిక    వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి.  జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లేఅవుట్లన్నీ ఏపీ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్‌ అయి ఉంటాయి. లేఅవుట్‌లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్డు, ఫుట్‌పాత్‌లు, ఈఎల్‌ఎస్‌ఆర్‌లతో నీటి సరఫరా, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు.  ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

 

 

 

ఆధార్‌ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్‌ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్‌ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్‌ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16  సమర్పించాల్సి ఉంటుంది.

 

 

 

హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్‌ టౌన్‌  షిప్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్‌లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్‌లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ టెండర్లు ఆహ్వానించారు.
ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్‌ 21న రూ.106.00 కోట్లతో  పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్‌లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

 

Tags: Affordable plots with amenities.

Leave A Reply

Your email address will not be published.