Natyam ad

 ఉగాది తర్వాత

రఘువీరా సెకండ్ ఇన్నింగ్స్…

అనంతపురం ముచ్చట్లు:

Post Midle

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించింది. ఆ ప్రయాణంలో ఎంతోమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. వారిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీడర్స్‌లో ఎన్‌. రఘువీరారెడ్డి కూడా ఒకరు. పీసీసీ మాజీ చీఫ్‌. రాష్ట్ర విభజన సమయంలో సీఎం పదవికి ఆయన పేరును కూడా కాంగ్రెస్‌ హైకమాండ్ పరిశీలించింది. మంత్రిగానూ సుదీర్ఘకాలం పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రఘువీరారెడ్డి రాజకీయ ప్రయాణం సాఫీగా సాగలేదు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన కూడా సైలెంట్‌ అయ్యారు. ప్రతికూల రాజకీయ వాతావరణంలోనూ కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు మోసినా.. 2019 ఎన్నికల తర్వాత పొలిటికల్‌ స్క్రీన్‌ నుంచి ఆయన తప్పుకొన్నారు. రాజకీయాలకు దూరం అయ్యారు. పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసి తన సొంతూరు మడకశిర మండలంలోని నీలకంఠాపురానికే పరిమితం అయ్యారు.నిత్యం ఖద్దర్ బట్టలు వేసుకొని.. రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన రఘువీరారెడ్డి తన స్వగ్రామంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి పరిమితమయ్యారు. గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రజల కోసం ఒక కంటి ఆసుపత్రిని కూడా తీసుకొచ్చారు. ఇక ఈ నాలుగేళ్లలో ఊర్లో ఎప్పుడు తన పాత మిత్రులతో కలిసి తిరగడం.. రచ్చబండ మీద చర్చలు చేయడం.. పిల్లలతో ఆటలు.. పాటలు.. ఈతకొట్టడం ఇలా జీవనం సాగుతోంది. పొలాల్లో కలుపు తీశారు.. నెత్తిన గడ్డిమోపు మోశారు. ఎలాంటి భద్రత లేకుండా మోపెడ్‌పై భార్యను కూర్చోబెట్టుకుని

 

 

బయటకెళ్లేవారు. రాజకీయల గురించి రఘువీరారెడ్డి మాట్లాడి నాలుగేళ్లు అయ్యింది. పాలిటిక్స్‌పై ఎవరు ఏం ప్రశ్నించినా ఆయన నుంచి మౌనమే సమాధానంగా ఉండేది.రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో రఘువీరారెడ్డి వెళ్లి.. పార్టీ అగ్రనేతను కలిసి వచ్చారు. తన ప్రాంతం నుంచి జనాన్ని కూడా తీసుకెళ్లి రాహుల్‌గాంధీకి స్వాగతం పలికారు. అప్పుడే రఘువీరారెడ్డి మళ్లీ రాజకీయంగా యాక్టివేట్‌ అవుతున్నారనే చర్చ సాగింది. ఆయన మాత్రం తనకు గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే పాదయాత్రకు వెళ్లానని స్పష్టంగా చెప్పారు. ఇంతలో రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తళుక్కుమన్నారు రఘువీరారెడ్డి. వ్యవసాయంతోపాటు ఇరిగేషన్‌ అంశాలపై వేసిన ప్లీనరీ కమిటీ పగ్గాలు ఆయన చేపట్టారు. ప్లీనరీకి వెళ్లేం వచ్చాం అన్నట్టు కాకుండా… అక్కడ కీలక పాత్ర పోషించడంతో.. రఘువీరారెడ్డి వనవాసం వీడినట్టేనని చర్చ మొదలైంది.ఇక రాజకీయాలపై స్పందించాల్సింది రఘువీరారెడ్డే. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మరి.. రఘువీరారెడ్డి ఏం చేస్తారు అన్నది ప్రశ్న. ఏ నిర్ణయమైనా ఆయన ఉగాది తర్వాతే ప్రకటిస్తారని తాజా చర్చ.

 

 

దాంతో ఉగాది తర్వాత ఆయన ఏం చెబుతారు? ఇన్నాళ్లూ మెరిసిన గడ్డంతో.. ఫక్తు రైతుగా మారిన రఘువీరారెడ్డి.. ఇకపై మళ్లీ పాత కాంగ్రెస్‌ నేతలా ప్రజలకు కనిపిస్తారా? యాక్టివ్‌ పాలిటిక్స్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆయనకు ఏదైనా సలహా ఇచ్చిందా? దానికి ఈ మాజీ మంత్రి ఏం సమాధానం చెప్పారు? రాజకీయాల్లో తిరిగి చురుకైన పాత్ర పోషిస్తే.. వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో దేనికి పోటీ చేస్తారు అనేది ఉత్కంఠే..! ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.

Tags;After Ugadi

Post Midle