రిమ్స్ లో మళ్లీ కీచక లెక్చరర్

Date:10/11/2018
కడప ముచ్చట్లు:
ఆ కామాంధుని ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. తోటివారికి సహాయపడుతూ విధుల్లో సహకారం అందించి అండగా నిలవాల్సిన తను విచక్షణను మరిచి పశువులా ప్రవర్తించాడు. కామవాంచలతో కళ్లుమూసుకుని పోయి మదమెక్కిన మృగంలా వ్యవహరించాడు. చివరికి విషయం బయటికి పొక్కడంతో ఆపై బెదిరింపులకూ దిగాడు.
కాలం కలసిరాక ఉన్న ఉద్యోగాన్ని ఊడబీకేసున్న ఆ మృగం మళ్లీ దొడ్డిదారిలో ప్రవేశించాలని చూస్తోంది. రిమ్స్‌ శానిటేషన్‌ పనులను నిర్వర్తించే విభాగంలో పర్యవేక్షక విధులను నిర్వర్తిస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. సామాజికంగా ఎక్కడ తమ పరువు పోతుందోనన్న భయంతో మహిళలకు జరిగిన అన్యాయాన్ని మనసులోనే దాచుకుని కృంగిపోయారు. అతగాడు చేసే పశువు ప్రవర్తనను భరిస్తూనే వచ్చారు.
వారి ఆర్థిక పరిస్థితి, పేదరికాన్ని అడ్డం పెట్టుకుని మృగంలా ప్రవర్తించాడు. బయటకు తెలిసి కుటుంబాల్లో, సంసారాల్లో ఎక్కడ కలహాలు రేగుతాయోనని మౌనంగానే ఆ కీచకుని ఆగడాలను మనసు చంపుకుని భరించారు. చివరికి ఆగడాలు శృతిమించడంతో చెప్పకనే కీచకుని పాపం బయటపడింది. ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు అండగా నిలవడంతో వారు పడ్డ కష్టాలు ఒక్కొక్కటిగా బయటకు వెల్లబెట్టారు. ఆ కీచకునిపై కార్మికులంతా కలిసి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు.
ఉన్నతాధికారులు సైతం సమస్య పట్ల స్పందించి ఆ కీచకుని విధుల నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత కూడా కార్మికులపై పలు మార్లు ఆ వ్యక్తి బెదిరింపులకు పూనుకున్నట్లు తెలిసింది.ఇది తెలిసిన అక్కడి ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. అదే జరిగితే మాకు రక్షణ శూన్యమంటూ తమ ఆవేదనను తిరిగి అధికారులకు వెల్లబోసుకుంటున్నారు. స్పందించిన అధికారులు అడ్డదారికి కంచెకట్టే ప్రయత్నం రిమ్స్‌లో చేస్తున్నారు.తొలగించిన తర్వాత కూడా తిరిగి దొడ్డిదారిలో ప్రవేశించడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడు.
ఇటీవల రిమ్స్‌ కళాశాల యుజి, పీజీ మహిళా, పీజీ విద్యార్థుల వసతి గృహాల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు సంబందించిన టెండర్లు నిర్వహించగా హైదరాబాదుకు సంబంధించిన ఓ ఏజెన్సీ తరుపున అధికార ప్రతినిధిగా టెండర్లలో పాల్గొన్నాడు. ఇదే ఏజెన్సీ టెండర్లు దక్కించుకోవడంతో ఆపనులు ఆ కీచకుని ద్వారా నిర్వర్తించేందుకు అవకాశం కల్పించినట్లైంది.
ఈనేపథ్యంలో బెంబేలెత్తిన పారిశుధ్య కార్మికులు గురువారం కళాశాల ప్రిన్సిపల్‌కు అతని రాకను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేశారు.రిమ్స్‌ అధికారులు  సదరు వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ అలాంటి వ్యక్తికి ఇక్కడి పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ఇవ్వవద్దంటూ లేఖను పంపింది. దీనిపై ఏజెన్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags: Again the key lecturer in the rims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *