కడప జిల్లాలోని అగస్తేశ్వరాలయాలు

కడప ముచ్చట్లు :

 

భారతదేశంలో మొదటి శివలింగం రూపంగా చిత్తూరు జిల్లా గుడిమల్లం ఆలయంలోని శివలింగం అని చరిత్రకారులు చెప్తు ఉంటారు. ఈ శివలింగం పై భాగం మనిషి పురుషాంగం రూపంలో ఉండి, కింద భాగంలో వేటగాడి రూపంలో శివుడి రూపం చెక్కబడి ఉంటుంది.కడప జిల్లాలో కూడా గుడిమల్లం ఆలయంలోని శివలింగం ఆకారం పైభాగం లాగా ఉన్న అరుదైన శివలింగాలు ఉన్నాయి. వీటిని అగస్త్యేశ్వర శివలింగాలు అంటారు. కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈఅగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు.చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం) నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రలో, తాను బస చేసిన ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించారు అని కథనం. తర్వాత కాలంలో శివలింగాల చుట్టూ పుట్టలు ఏర్పడి ఉంటే, రేనాటి చోళ రాజులు, పుట్టలు తవ్వించి ప్రాథమిక గుడి నిర్మాణం చేసినట్లు, గ్రామ కైఫియత్తులు చెప్తున్నాయి. తర్వాతి కాలంలో చాలా మంది రాజులు, ఈ గుడులని పుర్నర్మించడం, అభివృద్ది చేయడం జరిగింది.అగస్త్య ప్రతిష్టితమైన ఈ శివలింగాలు భారీలింగ రూపంలో, స్థంభము లగా, తలపైన శిగతో, ప్రత్యేక ఆకారంలో ఉంటున్నాయి. గుడిమల్లం శివలింగం పోలికలు కలిగి ఉంటాయి.

 

 

కింద చెప్పిన ఊర్లళ్ళో ఈ ఆలయాలు ఉన్నాయి.

1) పెద్దశెట్టిపల్లె/నరసింహాపురం శివాలయం (ప్రొద్దుటూరు మండలం), చరిత్ర సంబంధించిన శాసనాలు ఇక్కడ దొరకలేదు. పాత శివాలయం 2020వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేశారు. గ్రామ కైఫియత్ ప్రకారం, పూర్వం అగస్త్యాశ్రమంలో ఉన్న శివలింగానికి పుట్టలు తవ్వించి, చోళ రాజులు గుడి నిర్మాణం చేసారని తెలుస్తోంది.

2) ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయం, 8వ శతాబ్దంలో నందిచోళుడు నిర్మించారు. ప్రొద్దుటూరు శివాలయంగా చాలా ప్రసిద్ది పొందిన గుడి ఇది. పార్వతీ దేవి ఆలయము, ఇంకా చాలా ఉపాలయాలతో ఉన్న పెద్ద ఆలయ సముదాయము.

3) పోట్లదుర్తి (నడిగడ్డ శివాలయం), రేనాటి చోళుల కాలం నాటి గుడి. దగ్గర్లోని మాలెపాడు ఊర్లో రేనాటి చోళుల శాసనాలు లభించాయి. రేనాటి చోళుల కాలం నాటి గుడి. దగ్గర్లోని మాలెపాడు ఊర్లో రేనాటి చోళుల శాసనాలు లభించాయి. రేనాటి చోళ రాజు పుణ్యకుమారుని రాగి రేకుల శాసనం, మాలెపాడులోనే లభించింది. పోట్లదుర్తి పక్కన పారే వంక, పెన్నానదిలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన గడ్డ మీద ఉన్న గుడి కాబట్టీ, ఈ గుడిని నడిగడ్డ శివాలయం అని అంటారు. పార్వతీ దేవి, వీరభద్ర స్వామికి ఒకే ప్రాంగణంలో ఆలయాలు ఉన్నాయి. గుడి బయట, రహదారి అటువైపు, 400 సంవత్సరాల చౌడమ్మ గుడి ఉంది.

4) చిలమకూరు అగస్తేశ్వరాలయం, (యఱ్ఱగుంట్ల మండలం)
8వ శతాబ్దంలో రెండవ విక్రమాదిత్యుని మహారాణి, గుడి పూజకి తోట దానం ఇచ్చినట్లు శాసనం ఉంది. ఒకే ప్రాంగణంలో, వినాయక, వీరభద్రాలయాలు ఉన్నాయి. వినాయక, శివాలయాల గర్భగుడి అరుదైన గజపృష్టాకారంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం, కేంద్ర పురాతత్వ శాఖ సంరక్షణలో ఉంది. గుడి ఆవరణలో చాలా శాసనాలు లభించాయి.

5) పెద్దనపాడు శివాలయం( యఱ్ఱగుంట్ల మండలం)
ఇక్కడ శివాలయం అగస్త్యేశ్వరాలయం అని శాసనలలో చెప్పబడినా, శివలింగం అగస్త్యలింగాకార పోలికలు లేవు. ఆలయం గర్భగుడి పైభాగం గజపృష్టాకారంలో ఉంటుంది. ఇటీవల ఈ ఆలయాన్ని పునర్మించినట్లు తెలిసింది. ఇక్కడ మనకి 11వ శతాబ్దపు, కాయస్థ రాజుల శాసనంలో, అగస్త్యేశ్వరస్వామి పూజలకి, భూమి దానం చేసినట్లు శాసనం ఉంది. ఇక్కడ వీరభద్రాలయము, ఆంజనేయస్వామి ఆలయయు, మదనగోపాల స్వామి ఆలయము ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీరభద్రస్వామిని 14వ శతాబ్దంలో ప్రతిష్ట చేసినట్లు శాసనం ఉంది.

6) ఉరుటూరు శివాలయం (యఱ్ఱగుంట్ల మండలం),
ఇక్కడి శివలింగం నిధుల వేటగాళ్ళ వల్ల విరిగిపోతే, ప్రస్తుతం మైలవరం మ్యూజియం లో భద్రపరిచారు.

7) పెద్దచెప్పలి అగస్తేశ్వరాలయం (కమలాపురం మండలం)
6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని శాసనాలు లభ్యమవుతున్నాయి. గుడి, గజపృష్టాకారంలో ఉంటుంది. ఒకే ప్రాంగణంలో చెన్నకేశవాలయం కూడా ఉంది. ఇక్కడి చెన్నకేశవస్వామిని అన్నమయ్య దర్శించి కీర్తన రచించారు. ఈ పెద్దచెప్పలి గ్రామము, ఒక నాటి, రేనాటి చోళుల రాజధాని అని చరిత్రకారులు నిర్ధారించారు.

8) చదిపిరాళ్ళ అగస్తేశ్వరాలయం (కమలాపురం మండలం)
రేనాటి చోళుల కాలం నాటిది. ఈ ఆలయం గర్భగుడి కూడా గజపృష్టాకారంలో ఉంటుంది. ఇక్కడ విజయనగర రాజుల కాలం నాటి చాలా శాసనాలు లభించాయి. గుడికి దగ్గర్లో పురాతన్ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది.

9) కల్లూరు (ప్రొద్దుటూరు మండలం),
ఇక్కడ అగస్త్యేశ్వరాలయం కూడా రేనాటి చోళుల కాలం నాటిది. ఒకే ప్రాంగణంలో చెన్నకేశవాలయం ఇక్కడ ఉంది. చాలా పురాతన ఈ గుడిలో, విజయనగర రాజుల కాలం నాటి శాసనాలు లభిస్తున్నాయి. చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో, అనంతపద్మనాభస్వామి దేవాలయము, శివాలయల్ ప్రాంగణంలో, వీరభద్రాలయము ఉన్నాయు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Agastheshwara temples in Kadapa district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *