ఫ్యాక్ట్ చెకింగ్ కోసం ఏజెన్సీ
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎన్నో సమావేశాలు, చర్చల తరవాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం 2021లో సవరణలు చేసింది. వదంతులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే విధంగా మార్పులు చేర్పులు చేసినట్టు వెల్లడించింది. ఇకపై తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించనుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి సమాచారాన్నీ ఫ్యాక్ట్ చెక్ చేసే విధంగా మార్పులు చేసినట్టు వివరించారు. “ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన కంటెంట్‌ను ఫ్యాక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశాం. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రక్రియ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన సమాచారానికి మాత్రమే అమలవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఏజెన్సీ పని చేయనుంది.”ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక ఏజెన్సీ ఫ్యాక్ట్ చెక్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించి ఇష్టమొచ్చినట్టు షేర్ చేయడానికి వీల్లేకుండా కట్టడి చేయనున్నారు. ఇకపై సోషల్ మీడియాపై పూర్తి స్థాయి నిఘా ఉండనుంది.
వదంతులు, తప్పుడు సమాచారాలు వ్యాప్తి చేయడాన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. సాధారణ సమాచారం కన్నా వదంతులు 20రెట్ల వేగంతో అందరికీ చేరువవుతాయని అన్నారు. ఇలా చేయడం ఇంటర్నెట్ క్రిమినాలిటీ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ కొత్త ఐటీ రూల్స్‌తో ఇకపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా మెటా, ట్విటర్, షేర్ చాట్‌పై దృష్టి సారించింది కేంద్రం. ఈ విషయంలో తప్పులు జరిగితే తమను తాము డిఫెండ్ చేసుకోడానికి వీల్లేకుండా చాలా కచ్చితంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. దాదాపు దశాబ్ద కాలంగా ఇలాంటి తప్పుడు సమాచారాలు వ్యాప్తి చెందుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే…ఈ విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇంకా క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తమను కట్టడి చేసేందుకు చూస్తోందని గతంలోనే అసహనం వ్యక్తం చేశాయి పలు సంస్థలు. ఇప్పుడు రూల్స్ కూడా మార్చేయడం వల్ల కేంద్రానికి ఆ ప్లాట్‌ఫామ్స్‌పై పూర్తి పట్టు దొరికినట్టే అవుతుంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన పోటీదారుగా ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి.

భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అతిపెద్ద పోటీదారు అని అస్లే టోజే మాట్లాడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై అస్లే టోజే క్లారిటీ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతిపెద్ద పోటీదారు అని తాను అనలేదని స్పష్టంచేశారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధాన్ని నిలువరించడానికి మోదీ కృషి చేశారని, దీనికోసం ఆయన ఆ రెండు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీతో పలుమార్లు ఫోన్ లో సంభాషించారంటూ వార్తలొచ్చాయి. ఈ కృషిని నోబెల్ కమిటీ గుర్తించిందని, ఇక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి అందుతుందంటూ అటు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపించాయి. అయితే.. నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును నోబెల్ కమిటీ పరిశీలిస్తోందన్న వార్తలు పూర్తిగా అసత్యమని, నిరాధారమని ఆస్లే టోజే స్పష్టం చేశారు.
Tags:Agency for Fact Checking
