ఇంటర్ తో ముగిసిపోతున్న ఏజెన్సీ చదువులు

Date:15/11/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

ఏజెన్సీలో ఐటిడిఎ పరిధిలో బాలురు, బాలికలకు వేర్వేరుగా గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని గిరిజన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అందుబాటులో ఉన్న జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ వరకు చదువును పూర్తి చేసుకున్న గిరిజన యువత, తర్వాత అందుబాటులో డిగ్రీకాలేజీ లేక, ఇతర ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు వెళ్లి చదువుకునే ఆర్థికస్థోమత లేక ఉన్నత విద్యకు దూరమౌతున్నారు. దీంతో కొంతమంది యువకులు వ్యవసాయం, కూలి పనుల్లో నిమగమవుతుండగా, ఇంకొందరు ఉన్న విద్యార్హతల మేరకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రయివేటు ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మరికొందరు మిడిమిడి జ్ఞానంతో అటు పనులు చేసుకోలేక, ఇటు చదివేందుకు సౌకర్యాలు అందుబాటులో లేక పెడదోవ పడుతున్నారనే ఆందోళన వ్యక్తమౌతోంది. అసాంఘిక కార్యకలాపాలకు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోవడంతోపాటు, కేసుల పాలై జైళ్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ఏదోఒక చోట రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, గిరిజన యువత భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని మన్యవాసులు అభిప్రాయపడుతున్నారు.రాష్ట్రంలో పాడేరు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, కె.ఆర్‌.పురం, చింతూరుల్లో ఐటిడిఎలు ఉన్నాయి. వీటి పరిధిలో 43 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలున్నాయి. ఒక్కొక్క పాఠశాలలో సగటున 200 మంది విద్యార్థులు ఏటా ఇంటర్‌ విద్యను పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో దాదాపు 9 వేల మంది గిరిజన విద్యార్థులు ఇంటర్‌ విద్యను పూర్తిచేసుకుని, ఉన్నత విద్య కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది. అయితే వీరికి అవసరమైన డిగ్రీ కాలేజీలు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది అర్థాంతరంగా చదువులు మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. అనధికారిక లెక్కల ప్రకారం ఇంటర్‌ పూర్తయిన తర్వాత దాదాపు 40 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యకు వెళుతున్నారని, మిగిలిన 60శాతం మంది అర్థాంతరంగా చదువులు ఆపేస్తున్నారని అంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

అదే డిగ్రీ కాలేజీ అందుబాటులో ఉంటే వీరంతా వాటిల్లో చేరి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఛాన్స్‌ ఉండేది. డిగ్రీ కాలేజీ ఉంటే అక్కడ విద్యార్థులకు భోజన, వసతి, విద్య, లైబ్రరీ అందుబాటులో ఉండడం వల్ల ఉన్నత విద్య అభ్యసించే అవకాశంతోపాటు, ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుండేది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో టీనేజీలో జూనియర్‌ కాలేజీల నుంచి బయట పడుతున్న గిరిజన యువకులు తర్వాత ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో పడుతున్నారు.కాగా పాడేరు ఐటిడిఎ పరిధిలోని జికె.వీధిలో రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న హయాంలో గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీ మంజూరైందని అధికారులు అంటున్నారు. కారణాలేమిటో తెలియదుగానీ, అది కార్యరూపం దాల్చలేదని మన్యవాసులు అంటున్నారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఐదెకరాల స్థలంతోపాటు, భవనాలు సమకూర్చాల్సి ఉంది. కాలేజీ నిర్వహణకు ఏటా రూ.5 కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్‌ విడుదల చేయాల్సి ఉందని అంటున్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి వీటిని సమకూర్చే వెసులుబాటు ఉందని అంటున్నారు. గిరిజన వర్సిటీగా అనుబంధంగా డిగ్రీ కాలేజీల నిర్వహణ సాగుతుందని, యుజిసి స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తుందని అంటున్నారు. వీటిలో ఏ విషయంలో బెడిసికొట్టిందో తెలియదుగానీ, జికె.వీధిలో ప్రతిపాదిత (మంజూరైందని చెబుతున్న) డిగ్రీకాలేజీ మాత్రం ఏర్పాటు కాలేదని అంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవసరమైనన్ని డిగ్రీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రంలో ఆ పరిస్థితి కల్పించాలని కోరుతున్నారు. దీనిపై పూర్తి వివరాలను సంబంధిత శాఖల అధికారులుగానీ, నేతలుగానీ వెల్లడించాల్సిన అవసరం ఉంది.

 

మన బడి కింద నెల్లూరులో 1061 పాఠశాలలు

 

Tags:Agency readings ending with Inter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *