ఆత్మకూరులో మెజార్టీపై గురి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ- బీజేపీల నేతలు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఉప ఎన్నిక కోసం సీఎం జగన్ పలువురు రాష్ట్ర మంత్రులను గుంపులు గుంపులుగా ఆత్మకూరుకు దించేశారు. బీజేపీ కూడా తానేమీ తక్కువ కాదని వారానికి మూడుసార్లు సోము వీర్రాజును ప్రచారానికి పంపుతోంది. ఈ రెండు పార్టీల హడావుడి చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు.మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. మేకపాటి కుటుంబం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా.. అధికార వైసీపీ తన బలాన్ని ప్రదర్శించుకునేందుకు మండలానికి ఇద్దరు మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించింది. అంతేకాదు నెల్లూరు జిల్లాలోని ఒకరిద్దరు నేతలు తప్పిస్తే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆత్మకూరులోనే మకాం వేసి, గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు. మంత్రుల హడావుడి చూసి ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం ‘ఇదేందబ్బా సరైన పోటీ లేకపోయినా.. ఇంత హడావుడి చేస్తున్నారు?’ అంటూ నొసలు చిట్లిస్తున్నారు.

 

 

లక్ష ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంటూ ఆత్మకూరు వచ్చిన మంత్రులు పొలికేకలు పెడుతుండడం గమనార్హం. అసలు పోటీలోనే లేని టీడీపీపై వారు సవాళ్లు విసురుతుండడం విచిత్రంగా ఉందంటున్నారు జనం. అయినా ఉప ఎన్నికల్లో ఎలాగూ మరణించిన సిటింగ్ ఎమ్మెల్యే కుటుంబంపై సింపతి ఉంటుంది. పైగా అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ మంత్రులు ఇలా పొలికేకలు పెట్టడం ఏంటనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే.. అధికార పార్టీది బలుపు కాదు వాపు అని స్థానిక జనం వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్కన వైసీపీ బ్యాచ్ చేస్తున్న వింతలతోనే విసిగెత్తిపోతున్న జనం భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న హడావుడిని చూసి మరింతగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆత్మకూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసే దిక్కు లేదు. ఎక్కడి నుంచో అభ్యర్దిని తీసుకొచ్చి నామ్ కె వాస్తే పోటీ పెట్టింది. అయినా సరే.. బీజేపీ సత్తా చాటుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆత్మకూరు వీధుల్లో కోతలు కోస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వుకుంటున్నారు జనం. ‘మింగ మెతుకు లేకపోయినా.. మీసాలకు సంపంగి నూనె’ అన్నట్టు.. వీర్రాజు వీరంగం భలే గమ్మత్తుగా ఉందంటున్నారు ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు. బీజేపీ చేస్తున్న డూపు ప్రచారంపై తెగ సెటైర్లు కూడా వేస్తున్నారు మెట్ట ప్రాంత ప్రజలు.ఎవరిపై ఎవరు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారు? ఎవరిపై ఎవరు సత్తా చాటుతారో.. అర్ధం కాక తల పట్టుకొని మరీ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటుండడం కొసమెరుపు.

 

Post Midle

Tags: Aim for the majority in Atmakur

Post Midle
Natyam ad