భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యా కాండ అఖండ పారాయణం
తిరుమల ముచ్చట్లు:
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు రెండవ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది.అయోధ్యా కాండలోని 4 నుండి 8వ సర్గల వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాలు కలిపి మొత్తం 199 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.

ధర్మగిరికి చెందిన ప్రఖ్యాత పండితులు శ్రీ రామానుజాచార్యులు ప్రతి శ్లోకం యొక్క ప్రాముఖ్యతను, శ్రీ అనంత వేణుగోపాల్ శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ శ్రీనివాస్ బృందం ” రాముని భజన సేయవే వో మనసా …. ” సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, ” రామ రామ శ్రీరామ దశరధ రామ ……”నామ సంకీర్తనను చివరిలో ఆలపించారు.ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags: Akhanda Parayanam of Ayodhya Kanda drowned in Bhaktisagaram
