గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం

Alcohol in the villages
Date:26/04/2019
విజయవాడ ముచ్చట్లు:
నేల తడవడానికి నీరు అందడం లేదు కానీ, బీరు పొంగిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. పంట పొలాలు తడవడానికి నీరు ఎలాగూ పారడం లేదు… బీరుతో పునీతం చేద్దామనుకున్నారో ఏమో వారు. గన్నవరం ప్రాంతంలోని ఎటువంటి పైర్లు లేని పొలాలను ఎంచుకుని కొంతమంది మందు పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. దీనికి వెంకటనరసింహాపురం కాలనీ ప్రాంతం వేదికగా మారింది.. కేసరపల్లి శివారు వెంకటనరసింహాపురం కాలనీకి దక్షిణంగా ఉన్న పంట పొలాల్లో వారు బీరు పొంగిస్తున్నారు. చీకటి పడిందంటే చాలు ఈ పంటపొలాలు మందుబాబుల కేకలు, అరుపులతో దద్దరిల్లుతున్నాయ. జట్లు, జట్లుగా మద్యం బాటిళ్ళు, చికెన్ బిర్యాని ప్యాకెట్లతో వచ్చి కేరింతలు కొడుతూ పార్టీలు చేసుకుంటున్నారు. మత్తెక్కువైన మందుబాబులు ఖాళీ చేసిన బీరు బాటిళ్ళను పగులగొట్టి టబీభత్సం సృష్టిస్తున్నారు. తెల్లారి చూస్తే పంట పొలాల్లో బీరు బాటిళ్ళు గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయి. అంటే పార్టీలు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. దీంతో భూస్వాములు తమ పంట పొలాలు మందుబాబుల ఆగడాలకు అడ్డగా మారడంతో బెంబేలెత్తుతున్నారు. బిర్యానీ తినేసిన వ్యర్థాలతో పొలాలు కాలుష్య కాసారాలవుతున్నాయ. అంతేకాకుండా మత్తు ఎక్కువై సీసాలు పగలగొడుతుండడంతో గాజు పెంకులు కాళ్లల్లో దిగుతాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. రేపు పైర్లు వేసినప్పుడు ఇటువంటి గాజుపెంకుల వల్ల పడరాని పాట్లు పడాల్సి వస్తుందని రైతులు బెంబేలెత్తుతున్నారు. అలాగే కాలనీ వాసులు కూడా మందుబాబుల విన్యాసాలకు భయభ్రాంతులు అవుతున్నారు. ఇంత జరుగుతున్నా శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన రక్షక భటులు పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసులు నైట్ బీట్ నిర్వహించి మందుబాబుల మత్తు వదిలించాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Tags:Alcohol in the villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *