Natyam ad

కార్తీక మాసంలో అలిపిరి సప్తగోప్రదక్షిణ మండపమందు

శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభం

– టీటీడీ ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి

 

తిరుప‌తి ముచ్చట్లు:

 

Post Midle

తిరుప‌తి అలిపిరి నందు గ‌ల‌ సప్తగోప్రదక్షిణ మండపమందు కార్తీక మాసం(న‌వంబ‌రు)లో శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించ‌నున్న‌ట్లు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వ‌ర్యంలో సప్తగోప్రదక్షిణ మండపమందు ప్రతినిత్యం శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో వైఖానస శాస్త్రానుసారమే శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహవిశేష హోమం నిర్వహింపబడుతుంద‌ని చెప్పారు. ఈ హోమమందు శ్రీవారి పరిపూర్ణ తత్వాన్ని ఆవిష్కరించే ఉపనిషత్తులు అయిన శ్రీపారమాత్మిక ఉపనిషత్తు నందు గల 108 మూల మంత్రాలతో హోమం జరుగుతుంద‌న్నారు. ఈ పారమాత్మిక ఉపనిషత్తు వేద మంత్రములలోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన ఉపనిషత్తుగా చెప్పబడినద‌న్నారు.అనంత‌రం ఎస్వీ వేద విశ్వ విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి మాట్లాడుతూ, ఈ విశేష హోమంలో భాగంగా ప్రతి రోజు భక్త సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, సద్యోన్కురార్పణము, రక్షాబంధనము, అగ్ని ప్రతిష్టాపనము, కుంభార్చనలు విశేష పారమాత్మిక మూలమంత్ర హోమము, పూర్ణాహుతి, కుంభ సమర్పణము, నైవేద్యము, నీరాజనం, భక్తులకు ఆశీర్వచనం, హోమ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే గృహ‌స్తులు ధోవతి, ఉత్తరీయం, చీర ధరించి హోమంలో పాల్గొనాల‌న్నారు.శ్రీ‌వారిని ఆరాధించు పద్ధతులలో అతి ముఖ్యమైనది హోమం, శ్రీ‌ వేంకటేశ్వర స్వామివారికి ప్రధానంగా హోమం నిర్వ‌హిస్తార‌ని చెప్పారు.

 

 

ఈ హోమంలో ద్రవ్య త్యాగము వ‌ల‌న మానవునికి ఇలోకమందు ధన ధాన్య భోగభాగ్యాలు, పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు, సమస్త శుభాలు, నవగ్రహ దోషాలు, వివిధ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయ‌ని తెలిపారు. కావున భక్తులు హోమం నందు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలన్నారు.హోమం పూర్తి అయిన తరువాత‌ హోమ శక్తిని కుంభమునందు సమారోపన గావించి ఆ కుంభ జలము, హోమ భస్మం హోమంలో పాల్గొన్న గృహస్థులకు అందిస్తార‌న్నారు.ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులలో ఒకరైన  వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదా భార్గవి,  వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో  ష‌ణ్ముఖ‌ కుమార్, సిఈ  నాగేశ్వరరావు, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags: Alipiri Saptagopradakshina Mandapam in the month of Kartika

Post Midle