అన్నీ అవరోధాలే (నిజామాబాద్)

 Date:11/10/2018
నిజామాబాద్  ముచ్చట్లు:
ఏటా ఎర్రజొన్నల సాగులో రైతులకు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. గత ఏడాది ఎదురైన అనుభవాలు వారిని మరింత అయోమయంలోకి నెడుతున్నాయి. దీంతో ఈ ఏడాది జొన్న పంట సాగు చేయాలా వద్దా అనే దానిపై కర్షకులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ధైర్యం చేసి పంట వేస్తే మొదటికే మోసం వస్తుందా.. వేయకపోతే డిమాండు పెరిగి నష్టపోతామేమో.. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పంట వేయాలనే దానిపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది.జొన్న సులువైన ఆరు తడి పంట. ఇతర వాటితో పోల్చితే సాగు వ్యయం, నీరు, ఎరువుల వాడకం తక్కువగా ఉంటుంది. లాభం ఎక్కువగా ఉంటుంది. దీంతో రైతులు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే విత్తనాల కొనుగోలు నుంచి పంట పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా సరకును అమ్ముకునే విషయంలో మాత్రం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించకపోవడంతో బయట మార్కెట్‌ వలలో చిక్కుకొని తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారి చెప్పిన ధరకే విక్రయించాలి. రైతుకు గిట్టుబాటు కాదనుకుంటే ధాన్యం అమ్మకానికి మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. దీంతో వ్యాపారి నిర్ణయించిన ధరకు ఒప్పుకోక తప్పడం లేదు. ఇలా ప్రతీ ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది రైతుల నుంచి ఉద్యమం రావడంతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. క్వింటాకు రూ.2300 నిర్ణయించి కొనుగోలు చేసింది. అయితే ఈ ధాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలు కాకపోవడంతో వారి దగ్గరే నిల్వ ఉంది. ఈ పరిస్థితుల్లో రానున్న సీజన్‌లో సర్కారు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందా అనే దానిపై రైతుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఈ సారి జొన్న పంట వేయాలనుకునే రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఖరీఫ్‌లో సోయాబీన్‌ పూర్తి కాగానే ఈ పంటను వేస్తారు. అనంతరం వచ్చే ఖరీఫ్‌లో ఈ భూమిలో పసుపు సాగు చేస్తారు. ఎక్కువ మంది ఈ పద్ధతినే అనుసరిస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జొన్నకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను సాగు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది జిల్లాలో 41,340 ఎకరాల్లో ఎర్రజొన్నలు, సుమారు 288ఎకరాల్లో తెల్ల జొన్నలను సాగు చేశారు. ఈ సారి రైతులకు సరైన హామీ లభించకపోతే ఈ సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గుతుందని పలువురు అంటున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.1700 నిర్ణయించడంతో ఈ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రతీ సీజన్‌లో వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి రైతులతో మాట్లాడి ఒప్పందాలు చేసుకునే వారు. విత్తనాల సరఫరా సమయంలో ధాన్యానికి ధరను నిర్ణయించి సదరు వ్యాపారి సరకును కొనుగోలు చేసేలా అవగాహన కుదుర్చుకునే వారు. అయితే కొన్ని ప్రాంతాల్లో దానికి కట్టుబడి ఉండే వారు మరి కొన్ని గ్రామాల్లో ఉల్లంఘనలు జరిగేవి. ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి రైతులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. విత్తనాలు సరఫరా చేసిన వారే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇటీవల అధికారులు ప్రకటనలు చేశారు. దీంతో మున్ముందు ఇబ్బందులు ఎదురవుతాయని తొందరపడటం లేదు. మరో వారం రోజుల్లో పంట సాగు మొదలవుతుంది. కానీ ప్రభుత్వం, వ్యాపారుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
Tags:All Avadhadale (Nizamabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *