అన్నీ ఉన్నా.. అసౌకర్యాలే గతి 

Date:17/04/2018
మెదక్ ముచ్చట్లు:
మెదక్‌ జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణమైన నర్సాపూర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని 30 పడకల నుంచి వంద పడకలకు విస్తరించారు. ఇందుకు పెద్దభవనం నిర్మించి.. అధునాతన వైద్యపరికరాలు సమకూర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించలేదు. దీంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రి స్థాయి పెంచినా గతంలో ఉన్న వైద్యులు, సిబ్బందితోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్నారు. ఏడు నెలల క్రితం రూ.7కోట్లతో విశాలమైన భవనం, రూ.4 కోట్లతో పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగానే అత్యవసర సేవల విభాగం (ఐసీయూ) కూడా ఏర్పాటు చేశారు.నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రికి నిత్యం 700 నుంచి 800 మంది రోగులు వస్తున్నారు. సంత రోజైన శుక్రవారం వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక 70 నుంచి 80 మంది వరకు ఇన్‌పేషంట్లుగా ఉంటున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు, పక్కనున్న గుమ్మడిదల, తూప్రాన్‌ మండలాల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. వారి అవసరాలకు తగ్గట్లుగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తగిన రీతిలో సేవలు అందడం లేదు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు శాశ్వత వైద్యులు, ఇద్దరు ఒప్పంద, జాతీయ ఆరోగ్యమిషన్‌ నుంచి నియమించిన నలుగురు వైద్యులు ఉన్నారు.అత్యవసర సేవల విభాగం ఎప్పుడు చూసినా మూసే ఉంటోంది.ఏడు నెలలుగా ఇదే పరిస్థితి. ఈ విభాగంలో పరికరాలతోపాటు పది వరకు పడకలను సమకూర్చారు. ప్రస్తుతం అవి దుమ్ముపట్టి పోతున్నాయి. పాముకాటుకు గురవడం, విషం తాగడం, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడడం వంటి ఘటనల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసర చికిత్సలు అందించే సదుపాయం ఉన్నా వినియోగంలోకి రాకపోవడం పెద్దలోటుగా మారింది. కాగా ఈ విభాగంలో సేవలందించడానికి ఒక జనరల్‌ ఫిజిషియన్‌, సర్జన్‌, న్యూరో, కార్డియాలజిస్టు, మత్తు వైద్యుడితోపాటు రేడియాలజిస్టు ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.ప్రస్తుతం అత్యవసర వైద్యసేవల కోసం రోగులను నర్సాపూర్‌ సమీపంలోని సంగారెడ్డి ఆసుపత్రి, హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాలకు తరలిస్తున్నారు. నెలలో సుమారు 25 నుంచి 50 కేసులను ఆయా ఆసుపత్రుల ఐసీయూకి తరలించాల్సి వస్తోంది.
Tags: All in all

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *