Natyam ad

కౌంటింగ్ కు సర్వం సిద్ధం

నల్గోండ ముచ్చట్లు:


దేశంలోనే అత్యధిక ఖరీదైన ఉపఎన్నిక అయిన మునుగోడు నియోజకవర్గ ఫలితాలు ఈనెల 6వ తేదీ ఆదివారం వెల్లడికానున్నాయి. ఆరోజు మధ్యాహ్నం వరకూ వేచి చూస్తే కొత్త ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావిలోని గోడన్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు, ఆరోపణలు, డ్రామాలు, దాడులు, మద్యం, డబ్బు మధ్య కొనసాగిన బై పోల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆత్రుతగా ఎదురు చూస్తోంది.6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీని కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేసి, 15 రౌండ్లలో, 298 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను పూర్తి చేస్తారు. ప్రతి రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్ల ఓట్లను లెక్కిస్తారు. మొదట పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమును ఓపెన్ చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు.ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదలవుతుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంటకు వెల్లడికానుంది. ఇలా15 రౌండ్లలో 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన అన్ని ఓట్లు లెక్కిస్తారు.మొదటగా చౌటుప్పల్ మండలం, నారాయణపురం,

 

 

 

మునుగోడు, చండూర్, మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్ సింగ్, సెంట్రల్ నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది.స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్ఫీఎఫ్ బలగాలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటలపాటు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారు.అత్యధిక ఖరీదైన ఉప ఎన్నిక జరిగిన మునుగోడు రేపు నల్లగొండ జిల్లా కేంద్రం వైపు చూడనుంది. అందరూ టీవీలకు అతుక్కుపోనున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో దేశం మొత్తం నల్లగొండ వైపు చూడనుంది. ఎందుకంటే రూ. కోట్లలో బెట్టింగులు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతి తక్కువగా రూ. 10 వేల నుంచి లక్షల రూపాయాలతో బెట్టింగ్ పాల్పడుతున్నారు. కొంతమంది భూములు పెట్టి పందెం కాస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Post Midle

Tags: All ready for counting

Post Midle