ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలన్నీ డబ్బు జపం

Date:11/02/2019
విజయవాడ ముచ్చట్లు:
మనీ మేక్స్ మెనీ థింగ్స్ సామెత ఉండనే ఉంది. రెండు నెలల్లో ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ లో బరిలో నిలిచే ప్రధాన పార్టీలన్నీ డబ్బు జపం చేస్తున్నాయి. అభ్యర్థులు మొదలు అగ్రనాయకత్వం వరకూ ఎవరిని కదిపినా అదే మంత్రం. డబ్బు ఎలా సమకూర్చుకోవాలి? దానిని ఏ రూపంలో దాచిపెట్టాలి? ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలనే తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఎన్నికల సమయానికి ఏదో రకంగా సన్నిహితుల నుంచి సమకూర్చుకోవచ్చనే అలసత్వాన్ని చూపే అవకాశం లేదు. అధిష్ఠానమే అందుకు సంబంధించి ఆరాలు తీస్తోంది. లెక్కలు చెప్పండంటూ నిలదీస్తోంది. దీంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. దానికితోడు మరో సమస్య కూడా వారిని వెన్నాడుతోంది. తెలంగాణ ఎన్నికల అనుభవంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి వ్యూహాత్మకంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలను చాలా చాకచక్యంగా చక్కబెట్టుకుంది. యంత్రాంగం ఆసరాతో ప్రత్యర్థుల మనీ కదలికలపై కన్నేసి పట్టించేసింది. ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఇక్కడ సైతం అధికార తెలుగుదేశం అదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తుందేమోనన్న భయం విపక్షాలను వెన్నాడుతోంది.అధికారం కోసం పోటీపడుతున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఈసారి ఎన్నికలను ధన ప్రభావం బలంగా శాసిస్తుందని విశ్వసిస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గం ఇన్ ఛార్జులను సైతం మార్చేస్తోంది. నాలుగైదేళ్లుగా నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వం వహించిన వారిని పక్కనపెడుతోంది. ’అధికార పార్టీ కోట్లు కుమ్మరిస్తోంది.
మీరు దీటుగా ఎదుర్కోవాలి. అందుకు కనీసం 20నుంచి 25 కోట్లు అవసరమవుతాయి. మీ వద్ద ఉంటే పోటీకి సిద్ధపడండి. లేదంటే వేరొకరికి అవకాశమివ్వండి.‘ అంటూ తేల్చి చెప్పేస్తోంది. ఎంతో కొంత ప్రజాదరణ కలిగి ఉండి, దీర్ఘకాలం పార్టీకి సేవలందించిన వారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారుతోంది. తాము పది కోట్ల వరకూ సర్దుకోగలం. అయిదు కోట్ల రూపాయలు పార్టీ సర్దుబాటు చేయాలి. మరో అయిదు కోట్లు ఎంపీ అభ్యర్థి నుంచి ఇప్పించాలని కోరుతున్నారు కొందరు. దీనికి అధిష్ఠానం ససేమిరా అంటోంది. ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాలకు మాత్రమే పార్టీ నిధులను సర్దుబాటు చేస్తుందని చెప్పేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి నిధులిచ్చే సంగతిని కూడా పక్కనపెట్టి , తాము సొంతంగా ఖర్చు చేసే మొత్తాన్ని బ్యాంకు అకౌంట్ రూపంలో చూపించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ టిక్కెట్టుకు టిక్కు పెట్టాలంటే లెక్క చూపాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు.డబ్బుతో రాజకీయం చేయమంటూ ఘనంగా ప్రకటించిన జనసేనకూ మనీ కష్టాలు తప్పడం లేదు. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే జనసేనకు ఒకే ఒక వెసులుబాటు ఉంది. ప్రజలను తరలించడానికి పైసలు పోయాల్సిన అవసరం లేదు. మిగిలిన పార్టీలు ఒక మోస్తరు బహిరంగసభ పెట్టి ఒక పాతికవేల మందిని కూర్చెబెట్టాలంటే రెండుకోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సివస్తోంది. ఇందులో ప్రజల తరలింపు ఖర్చూ మూడోవంతువరకూ ఉంటోంది. జనసేనకు మాత్రం ఒక యాభై లక్షల రూపాయలతో బహరంగసభ పూర్తవుతోంది. ప్రజల తరలింపునకు వాహనాలు, హాజరవుతున్న వారికి కూలి, కిరాయి చెల్లింపు వంటి వాటిని జనసేన దూరంగా పెట్టింది.
అయినప్పటికీ సభలకు ఎవరు ఖర్చు పెట్టాలి? నాయకులకు రవాణా సౌకర్యాల సంగతేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం స్థానిక నాయకులు స్పాన్సర్ షిప్ చేయాల్సి వస్తోంది. వారు కూడా డబ్బులకు కటకట లాడుతున్నారు. పవన్ కల్యాణ్ డబ్బు సంగతి మాట్టాడరు. కానీ టిక్కెట్టు ఇస్తామన్న గ్యారంటీని సైతం ఇవ్వరు అంటూ జనసేన నాయకులు వాపోతున్నారు.తెలుగుదేశం పార్టీని చూసి మిగిలిన రెండు పార్టీలు భయపడుతున్నది మనీ విషయంలోనే. చంద్రబాబు నాయుడు పక్కా లెక్కలతో ఓట్లు కొట్టేస్తారనే ఆందోళన వైసీపీ, జనసేనలను వెంటాడుతోంది. ఇప్పటికే నియోజకవర్గాలకు డబ్బులను తరలించేశారనే ప్రచారాన్ని విపక్షాలు చేపట్టాయి. అయితే కమిటీలతో బూత్ స్థాయి పక్కా ప్రణాళికను అమల్లోకి తేవడంలో చంద్రబాబు దిట్ట అన్న సంగతి అందరికీ తెలుసు.
తెలంగాణ రాష్ట్రసమితి అన్నిపార్టీల కంటే తెలంగాణలో ముందుగానే సిద్ధమైంది. ఘనవిజయం సాధించింది. తగినంత వ్యవధిని తానే స్రుష్టించుకోగలిగింది. విపక్షాలు టిక్కెట్ల వ్యవహారం కొలిక్కి వచ్చేటప్పటికీ మొత్తం తతంగం పూర్తయిపోయింది. మహాకూటమి నేతలు కొందరు డబ్బులు తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయిపోయారు. ఎక్కడికక్కడ పోలీసు వర్గాలు, ఎన్నికల సంఘం పట్టేసింది. తమకున్న వెసులుబాటును వినియోగించుకుని అధికారపార్టీ వ్యూహాత్మకంగా విపక్షాల పంపిణీని అదుపు చేయించిందనే విమర్శలున్నాయి. అదే సమయంలో గ్రామగ్రామాన టీఆర్ఎస్ మాత్రం స్వేచ్చగా తన పనులు చక్కబెట్టుకోగలిగింది. అదే తంత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అనుసరించవచ్చని భావిస్తున్నారు. మొత్తమ్మీద ప్రజాస్వామ్యంలో మనీ మాయాజాలం గుర్తింపు పొందడమే కాదు, గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.
Tags:All the major parties in Andhra Pradesh have money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *