పెన్షన్లకే డబ్బులంతా….ఇక రోడ్డు ఎక్కడ

అనంతపురం ముచ్చట్లు:

గ్రామాల్లో రోడ్లు బాగోలేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన పథకాలు ఆపేస్తే రోడ్లు వేయవచ్చని సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చిన్నరామన్నగారి పల్లి వాసులు తీసుకెళ్లారు. అయితే ఆయన చెప్పిన సమాధానానికి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గంలో ప్రతి నెల రూ.15 కోట్లు ఫించన్లకే సరిపోతున్నాయని, రోడ్డు మరమ్మతులు చేయాలంటే వాటిని రద్దు చేయాలని చెప్పారు. అలా చేస్తే రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చెప్పిన సమాధానంపై మాత్రం గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కూడా పింఛన్లు ఇచ్చాయని, ఇప్పుడు మాత్రమే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిన్నరామన్న గారిపల్లిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని, తమ గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన సమాధానం బోడిగుండుకి, మోకాలికి ముడి వేసినట్లుందని గ్రామస్తులు విమర్శలు కురిపిస్తున్నారు.

 

 

 

ఇప్పటికైనా తమ గ్రామానికి వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు కచ్చితంగా బుద్ది చెబుతామని చిన్నరామన్నగారి పల్లి వాసులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దస్థితిపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం రోడ్లపై పెద్దగా నిధులు వెచ్చించడం లేదు. నిర్వహణకు కూడా పెద్దగా ఖర్చు పెట్టకపోతూండంతో  అధ్వాన్నంగా  మారాయి. గ్రామాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని విమర్శలు వస్తున్నాయి. చాలా గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిదుల వద్దకు వెళ్తే ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి. రోడ్లు వేయాలంటే సంక్షేమ పథకాలు ఆపేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ల వల్ల ఉపయోగపగేమేమిటని..  రోడ్లేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల స్పందనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నా అదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సార్లు రోడ్డెక్కి నిరసన తెలిపాయి.  ఇటీవలే రెండు రోజుల పాటు టీడీపీ, జనసేన కూటమి నేతలు రోడ్ల పరిస్థితిపై నిరసన వ్యక్తం చేసారు. జనసేన పార్టీ ఓ సారి సొంతంగా మరమ్మతులు కూడా చేసింది. అయినా ప్రభుత్వ పెద్దగా పట్టించుకోలేదు.

 

Post Midle

Tags: All the money for pensions…where is the road?

Post Midle