అన్నీ అడ్డంకులే.. (గుంటూరు)

All the obstacles .. (Guntur)

All the obstacles .. (Guntur)

 Date:08/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
కొండవీడులో నిర్మించతలపెట్టిన స్వర్ణహంస మందిరం నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. మొదట్లో స్థలం కేటాయింపు విషయమై ఎన్నో అవాంతరాలు  ఎదురయ్యాయి.. ఎట్టకేలకు నిర్మాణ పనులు మొదలైతే గ్రావెల్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయి.  యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలో ఇస్కాన్‌ రూ.వందల కోట్ల వ్యయంతో స్వర్ణహంస మందిరం నిర్మాణానికి 2015లో శంకుస్థాపన చేశారు. తొలుత భూ కేటాయింపులు జరగకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఎట్టకేలకు గత ఏడాది పనులు ఊపందుకున్నాయి.
నిర్మాణ పనుల్లో గ్రావెల్‌ కొరత వేధిస్తోంది. పునాది నిర్మాణ పనుల అనంతరం ఆలయ ప్రాంగణం ఎత్తు పెంచడానికి అవసరమైన గ్రావెల్‌ను అందించాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమకూర్చలేదు. ఆలయ నిర్మాణానికి కేటాయించిన భూమి పల్లంగా ఉండటంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆలయాన్ని 13 అడుగుల ఎత్తులో నిర్మించాలని ఇస్కాన్‌ ప్రణాళికలు రూపొందించింది. ఆమేరకు గతేడాది ఆలయ నిర్మాణానికి పునాదులు తవ్వి పనులను మొదలు పెట్టారు.
తవ్విన పునాదులు పూడ్చడానికి గ్రావెల్‌ అవసరమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గతంలో ఆలయ నిర్మాణ పనులు సందర్శించిన సమయంలో విన్నవించుకున్నారు. మంత్రి సిఫార్సుతో అధికారులు చెంఘీజ్‌ఖాన్‌పేట, కొత్తపాలెం గ్రామాల్లో గ్రావెల్‌ తవ్వకానికి అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఇస్కాన్‌ ప్రతినిధులు గ్రావెల్‌ తరలింపునకు సొంత నిధులు వెచ్చించి టిప్పర్లు, యంత్రాలు సమకూర్చారు. ప్రాంగణం మధ్యలో నిర్మిస్తున్న రెండు ప్రధాన మందిరాల పునాదులను గ్రావెల్‌తో పూడ్చారు. వర్షాల కారణంగా గ్రావెల్‌ తరలింపు అంతటితో ఆగింది. అనంతరం గ్రావెల్‌ తరలింపునకు అధికారులు అనుమతులు నిలిపివేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలోనే భారీ గుంతను తవ్వి కొంతమేర మెరక చేయడానికి గ్రావెల్‌ సమకూర్చుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో నిర్మించే ఆడియో, వీడియో విజువల్‌ థియేటర్స్‌, చుట్టూ ఉన్న 108 మండపాలను ప్రధాన ఆలయాల ఎత్తుకు సమాంతరంగా ఉండాలంటే మరో ఆరు అడుగుల మెరక తోలాల్సి ఉంది. అందుకు వందల టిప్పర్ల గ్రావెల్‌ అవసరమవుతుందని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చెరువులు లేదా క్వారీల్లో గ్రావెల్‌ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ఏడాది కాలంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా, వారి నుంచి స్పందన లేదని నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న 108 మండపాలు, ఆడియో, వీడియో విజువల్‌ థియేటర్స్‌ నిర్మాణ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రావెల్‌ పూర్తిస్థాయిలో అందితే ప్రధాన ఆలయం నిర్మాణం వెనువెంటనే పూర్తిచేస్తామని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.
Tags:All the obstacles .. (Guntur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed