కరిస్తే అంతే సంగతులు (ప్రకాశం)

Date;27/02/2020

కరిస్తే అంతే సంగతులు (ప్రకాశం)

ఒంగోలుముచ్చట్లు:

: గ్రామాల్లో, పట్టణాల్లో వీధి కుక్కల బెడద అధికమైంది. గతంలో మున్సిపాలిటీలు, పంచాయతీల ద్వారా వీటి నియంత్రణకు పటిష్ఠ చర్యలు
తీసుకునేవారు. అవసరమైతే పట్టి దూర ప్రాంతాల్లో వదిలేవారు. ఇప్పుడు మాత్రం జంతు ప్రేమికుల ఆందోళన.. వారు కోర్టులో వేసిన పిటీషన్‌కు వచ్చిన తీర్పును బూచిగా చూపుతూ చేతులు  కట్టేసుకుంటున్నారు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసి.. వాటి సంతతిని తగ్గించాలన్న న్యాయస్థానం సూచనను మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో నిత్యం 20 నుంచి 40  మంది వరకు కుక్కకాటు బారిన పడుతున్నట్లు అంచనా. వైద్యశాఖలో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కుక్కకాటు బాధితులకు తిప్పలు తెస్తోంది. గత రెండేళ్లుగా జిల్లాలో రేబిస్‌  వ్యాక్సిన్‌ తరచూ కొరత ఏర్పడుతోంది. ఏ రోజు మందు అందుబాటులో ఉంటుందో తెలియక బాధితులు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సివస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ వ్యయప్రయాసలకు గురవుతున్నా… సమస్య పరిష్కారం దిశగా పడుతున్న అడుగులు శూన్యమే. జిల్లాలో 90 పీహెచ్‌సీలు, ఏడు ఏరియా ఆసుపత్రులు, 14
సీహెచ్‌సీలు, మార్కాపురం జిల్లా ఆసుపత్రి, ఒంగోలు రిమ్స్‌కు జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి రేబిస్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేస్తారు. ఆసుపత్రి అవసరాలను అంచనా వేసి ఈ-ఔషధి
యాప్‌లో ఇండెంట్‌ పెడితే, వారికి ఉన్న బడ్జెట్‌ను బట్టి కేటాయిస్తారు. గతంలో మూడు కంపెనీల నుంచి ఈ మందు రాష్ట్రానికి సరఫరా జరిగేది. ఇప్పుడు ఒక కంపెనీ ద్వారానే సరఫరా  అవుతోంది. గత ఏడాదిగా రాష్ట్ర స్థాయిలో సరఫరా సరిగా లేదు. వచ్చిన మందును జిల్లా మొత్తానికి సర్దుబాటు చేస్తున్నారు. గిద్దలూరు ఆసుపత్రి నుంచి జనవరిలో 250 వైల్స్‌ కోరుతూ  ఇండెంట్‌ పెడితే 25 అందజేశారు. దోర్నాల నుంచి 200 వైల్స్‌ కోరితే.. 20 కేటాయించారు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రులకు ఎక్కువ మంది బాధితులు వస్తే 15 రోజుల్లోనే మందు  నిండుకొంటోంది. ప్రస్తుతం జిల్లాలో సగం ఆసుపత్రుల్లో రేబిస్‌ వ్యాక్సిన్‌ లేదు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో 3000 వైల్స్‌ ఉన్నట్లు చెబుతున్నా… ఆసుపత్రులకు ఇవ్వడం లేదు. అదనంగా కోరితే  ఇవ్వడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు వైద్యశాఖకు మధ్య ఉన్న ఈ లోపాన్ని సరిచేయడానికి ఎవరూ పూనుకోవడం లేదు. డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌ ,  ఏపీఐఎండీసీ అధికారులు ఉన్నా… పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో బాధితులకు అవస్థలు, కుక్కకాటు వైద్యం భారంగా మారింది

Tags;All the same

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *