నేడో రేపో తేలనున్న సీట్ల కేటాయింపు

Date:08/11/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో ప్రజాకూటమి అభ్యర్ధుల ఖరారుపై దృష్టిపెట్టింది. సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించేసి.. ఎన్నికలకు సీరియస్ గా రెడీ కావాలని ప్లాన్ చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుండడంతోనే సీట్ల పంపిణీని త్వరితగతిన ముగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు కూటమి క్యాండిడేట్లను దాదాపు ఖరారు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో కాంగ్రెస్‌ తరపున ఎనిమిది మంది పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. భాగస్వామ్య పార్టీలైన టీజేఎస్ ఆసిఫాబాద్‌ సీటు కోసం డిమాండ్‌ చేస్తోంది. సీపీఐ బెల్లంపల్లి నుంచి బరిలో నిలవనుంది. బెల్లంపల్లి సీటు సీపీఐకి ఇవ్వడానికి ముందునుంచే కాంగ్రెస్‌ సుముఖంగా ఉంది. ఇక టీజేఎస్ ఆసిఫాబాద్‌ సీట్ అడుగుతుండడం కాంగ్రెస్‌ నేతలకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్‌ టికెట్లు అధికారికంగా ప్రకటించకపోయినా.. అభ్యర్థుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చినట్లే అని స్థానిక నేతలు అంటున్నారు.
మరోవైపు టికెట్ దక్కనివారు రెబల్స్ గా మారకుండా.. పార్టీకి నష్టం చేకూర్చకుండా ఉండేలా అధిష్టానం చర్యలు ప్రారంభించింది. అసంతృప్తులను ఢీల్లీకి పిలిపించి బుజ్జగించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీకి నష్టం చేయకుండా కూటమి అభ్యర్థుల గెలపుకోసం కష్టపడి పనిచేయాలని సూచించాలనుకుంటున్నారు. అంతేకాక భవిష్యత్తులో ఎమ్మెల్సీ, కార్పోరేషన్‌ పదవులు దక్కుతాయని సముదాయిస్తున్నారు.
ఇదిలాఉంటే ఆసిఫాబాద్ ను వదులుకోవడం కష్టమే అయినా.. ఆ సీటున్ టీజేఎస్ కే ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో స్నేహపూర్వక పోటీ చేద్దామనే ప్రతిపాదనలు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు చేశారు. అయితే టీజేఎస్ అధినేత కోదండరాం ససేమిరా అనడంతో ఎట్టకేలకు ఆ స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి స్థానాలను వదులుకోవాల్సి రావచ్చేమో.
నిర్మల్‌ జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో నిలవనున్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు స్థానాల్లో బెల్లంపల్లి సీపీఐ అడుగుతోంది. మిగిలిన రెండింటిలో కాంగ్రెస్‌ పోటీచేసే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Tags: Allotment of the seat of the nomination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *