Natyam ad

అంబేద్కర్ పట్టుదల ఆచరణీయం- టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి

– మహతిలో ఘనంగా డా.బిఆర్.అంబేద్కర్ 132వ జయంతి

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

ప్రతికూల పరిస్థితులకు భయపడి వెనుకడుగు వేయకుండా వాటిని తనకు అనుకూలంగా మార్చుకుని అనుకున్నది సాధించిన డాక్టర్ అంబేద్కర్ పట్టుదల అందరికీ ఆచరణీయమని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి కొనియాడారు. టీటీడీ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో శుక్రవారం డాక్టర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈవో  ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆర్థిక సమస్యలు, అడుగడుగునా అంటరానితనం, కుల వివక్ష ఎదుర్కొన్న అంబేద్కర్ వీటికి భయపడి లక్ష్య సాధన నుండి పారిపోలేదని చెప్పారు. విదేశాలకు వెళ్లి సంపాదించిన జ్ఞానంతో దేశ గమనాన్నే మార్చిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, ఆర్థిక నిపుణుడు, పోరాట యోధుడని కొనియాడారు. టీటీడీ ఉద్యోగులు అంబేద్కర్  చూపిన మార్గంలో మరింత కష్టపడి పనిచేసి సంస్థకు మంచి పేరు తేవాలని ఈవో పిలుపునిచ్చారు. జేఈవో   వీరబ్రహ్మం ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో నేడు అన్ని వ్యవస్థలు క్రమ పద్ధతిలో నడుస్తున్నాయంటే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. గత నాలుగేళ్ళుగా టీటీడీ లో గతంలో ఎన్నడూ లేని విధంగా చైర్మన్, ఈవో ఉద్యోగుల సమస్యలను మానవతా హృదయంతో పరిష్కరిస్తున్నారని అన్నారు.

 

 

టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ మాట్లాడుతూ భారతదేశ భావావేశాన్ని ప్రపంచానికి చాటిన అతి కొద్దిమందిలో అంబేద్కర్ ఒకరని తెలిపారు. ఐక్యరాజ్యసమితితో పాటు 132 దేశాల్లో అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారని, దీన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవచ్చని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విశ్వ మానవుడిగా భారతీయతను చాటాలని కోరారు. భారత ఆధార్ ప్రాజెక్టు మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్  పిఎస్ఎన్.మూర్తి మాట్లాడుతూ భారత ప్రజలను ఛాందసవాదులుగా , మూర్ఖులుగా, బానిసలుగా బతకవద్దని అంబేద్కర్ సూచించారని తెలిపారు. చదువు ద్వారానే జ్ఞానం లభిస్తుందని, తద్వారా హక్కులు  సాధించుకోవచ్చని ఆయన బలంగా నమ్మారన్నారు. ఈ కారణంగానే పలు అంశాల్లో ఆయన పీ.హెచ్.డిలు చేశారని చెప్పారు. వీరు మూడేళ్ల వ్యవధిలోనే అర్థశాస్త్రం, న్యాయ శాస్త్రంలో పిహెచ్.డిలు పొందడం గొప్ప విషయం అన్నారు. కొలంబియా వర్సిటీలో ఉన్న సమయంలో “ప్రాచీన భారత వాణిజ్యం”,  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్న సమయంలో “ద ప్రాబ్లం ఆఫ్ రూపీ ఇట్ ఆరిజిన్  ఇన్ అండ్ సొల్యూషన్ అనే గ్రంథాలు రచించారని తెలియజేశారు.

 

ఎస్వీయు మాజీ ఉపకులపతి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సూచించిన విధంగా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావన కోసం పాటుపడాలని, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అంబేద్కర్ మొత్తం 21 వాల్యూమ్ ల పుస్తకాలు రచించారని, వీటన్నిటినీ తెలుగులోకి తీసుకురావడానికి తాను ఎంతగానో కృషి చేశానని చెప్పారు. అన్ని పుస్తకాలు చదివే అవకాశం తనకు లభించిందని, ఈ గ్రంథాల పైన మూడు సంవత్సరాలు పరిశోధన చేసి మూడు పుస్తకాలు రచించానని చెప్పారు.

 

యోగి వేమన వర్సిటీ ప్రొఫెసర్ వినోదిని మాట్లాడుతూ అంబేద్కర్ ఆచరణవాది అని, ఆయన నమ్మినదాన్ని తూచ తప్పకుండా పాటించారని చెప్పారు. విభిన్న వర్గాలకు సంబంధించిన అస్తిత్వ దృక్పథం నుంచి సమస్యను చూస్తే లోతు పాతులు తెలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అపోహల నుంచి నిన్ను నువ్వు విముక్తి చేసుకోవాలని, రాజ్యాధికారం సాధించాలని అంబేద్కర్ బోధించారన్నారు.

 

విజయవాడకు చెందిన సుప్రసిద్ధ విమర్శకులు శ్రీ జి.లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ సాంఘిక ప్రజాస్వామ్యంతోనే రాజకీయ ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాతినిథ్యం కల్పించారని చెప్పారు. ఆచరణాత్మకంగా కృషిచేసి, స్వేచ్ఛ, సమానత్వం కోసం పాటుపడినప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం అవుతుందన్నారు.

 

ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ప్రజాకవి డా. జై భీమ్ బాలకృష్ణ, ఉదయ్ బృందం అంబేద్కర్ పై ఆలపించిన గీతం సభను ఉర్రూతలూగించింది. టిటిడి ఉద్యోగి  సునీత కుమార్తె డింపుల్ ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. అదేవిధంగా టీటీడీ ఉద్యోగి  ఆనందరావు అంబేద్కర్ వేషధారణలో అలరించారు.

 

45 మందికి కమ్యూనల్ అవార్డుల ప్రదానం

 

ఈ సందర్భంగా టీటీడీలో విధులు నిర్వహిస్తున్న 45 మంది ఉద్యోగులకు కమ్యూనల్ అవార్డులు అందజేశారు. వీరికి 5 గ్రాముల వెండి డాలర్, అంబేద్కర్ చిత్రపటం అందించారు. వీరిలో డెప్యూటీ ఈవోలు  వెంకటయ్య,  దేవేంద్ర బాబు,  సుబ్రహ్మణ్యం, ఏఈవోలు  ఎస్.మణి,  నిర్మల,   సత్రే నాయక్,   మునిరత్నం తదితరులు ఉన్నారు. అనంతరం క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిఈవో   భాస్కర్ రెడ్డి, పిఆర్ఓ డా. టి.రవి, డెప్యూటీ ఈవోలు  గోవిందరాజన్,  ఆనంద రాజు, స్నేహలత, నాగరత్న, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags:Ambedkar’s persistence is viable- TTD EO AV. Dharma Reddy

Post Midle