ఇక ఒక్క క్లిక్ తో అంబులెన్స్ సేవలు

Ambulance services with one click

Ambulance services with one click

Date:26/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ అంబులెన్సుల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 108 పేరుతో యాప్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించనుంది. రాష్ట్రంలో ప్రతి 60వేల మందికి ఒక అంబులెన్స్ ఉండాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిధిలో 108, తదితర అంబులెన్సుల సేవలు ఉన్నప్పటికీ అవి ప్రజావసరాలకు చాలటం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీసుల తరహాలో ప్రైవేట్ అంబులెన్సులను డిజిటల్ పూలింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఓలా తరహాలో ఒక యాప్‌ను అభివృద్ధి చేయనుంది.అంబులెన్సుగా సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలు, వాహనం వివరాలు ఈ యాప్‌లో నమోదు చేస్తారు.
అంబులెన్సుగా సేవలందించే వాహనాలు 5 సంవత్సరాల కంటే ముందు కొన్నవి అయి ఉండకూడదు. ఆసక్తి వ్యక్తీకరించిన వారి వివరాలు, వాహనం వివరాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తారు. ప్రైవేట్ అంబులెన్సుల్లో కనీసంగా ఆక్సిజన్, డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు కిలోమీటరుకు 25 రూపాయల చొప్పున చెల్లిస్తారు. వాహనాన్ని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. అంబులెన్సుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌కు, 108 కాల్‌సెంటర్‌కు ప్రైవేట్ అంబులెన్సుల వివరాలను అనుసంధానిస్తారు.ఎవరైనా ఈ అంబులెన్సుల సేవలను వినియోగించుకోవాలంటే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. జీపీఎస్, తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వాహనం తిరిగిన దూరాన్ని లెక్కించి వాహన యజమానులకు ప్రభుత్వం రుసుము చెల్లిస్తుంది. నెలకు ఒకసారి నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారా చెల్లిస్తారు. యాప్ లేదా కాల్ సెంటర్ ద్వారా అంబులెన్సు సేవల అభ్యర్థన లేని సమయంలో ఆ వాహనాలు వేరే పనులు చేసుకునే వీలు కల్పించారు. ఈ విధానం వల్ల చాలావరకూ రాష్ట్రంలో అంబులెన్సు సేవల కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Tags:Ambulance services with one click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *