అమెరికా డాలర్ల డ్రీమ్ కరుగుతోంది

Date:14/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ దేశానికి ఉన్నత చదువులకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా భారత్, చైనా విద్యార్థులు శాతం బాగా పడిపోయింది. అమెరికా విడుదల చేసిన గణాంకాల ప్రకారం… 2016తో పోలిస్తే 2017 సెప్టెంబరు 30 నాటికి విదేశీ విద్యార్థుల సంఖ్య 16 శాతం తగ్గిపోయినట్టు వెల్లడయ్యింది. 2016లో 5.02 లక్షల మంది విద్యార్థులు వీసాలు పొందితే, 2017లో ఈ సంఖ్య 4.21 లక్షలకు పడిపోయిందని అమెరికా నివేదిక స్పష్టం చేసింది. ఇక భారతీయ విద్యార్థుల సంఖ్య 27 శాతం తగ్గింది. సెప్టెంబరు 30, 2016తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65, 257 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వీసాలు దక్కించుకుంటే, 2017లో మాత్రం 47, 302 మంది మాత్రమే పొందారుఇదే సమయంలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా కెనడా, ఆస్ట్రేలియాలను ఎంపిక చేసుకుంటున్నట్టు తేలింది. హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పు, అంతర్జాతీయ విద్యార్థులకు ఐచ్ఛిక ఆచరణాత్మక శిక్షణా కార్యక్రమాల్లో అనిశ్చితి లాంటి కారణాల వల్ల అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశీయులు ముఖ్యంగా భారతీయులు విముఖత చూపుతున్నారు. గతేడాది సెప్టెంబరు 30 నాటికి అంతర్జాతీయ విద్యార్థులకు 3.93 లక్షల ఎఫ్1 కేటగిరీ, ఎఫ్‌2 కేటగిరీ కింద విదేశీ ఉద్యోగుల భార్య, పిల్లలకు మొత్తం 27, 435 వీసాలను మంజూరు చేశారు. అయితే వీటిలో ఏ ఏ దేశాలకు చెందిన విద్యార్థులు ఎంతమంది అనే గణాంకాలు మాత్రం అందుబాటులో లేవు.ఇందులో ఆసియా నుంచి మొత్తం విద్యార్థుల శాతాన్ని మాత్రమే తెలిపారు. వీరిలో భారత్, చైనాలకు చెందిన వారు 40 శాతంగా పేర్కొన్నారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 2.86 లక్షల మంది ఆసియా విద్యార్థులకు ఎఫ్ కేటగిరీ వీసాలను మంజూరు చేశారు. ఇది అమెరికా మంజూరు చేసిన ఎఫ్ కేటగిరీ వీసాల్లో 68 శాతం. కానీ 2016తో పోలిస్తే 20 శాతం తగ్గింది. గత కొన్నేళ్లుగా అమెరికా స్టూడెంట్ వీసాలు పొందే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2015లో గరిష్ఠంగా ఇది 6.50 లక్షలకు చేరింది. అయితే నాటి నుంచి క్రమంగా తగ్గిపోయింది. 2016 నాటికి 26 శాతం క్షీణించగా, 2017లో మరో 16 శాతం పడిపోయింది.
Tags: American dollars dream is melting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *