శ్రీ‌వారి భ‌క్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాట్లు

– ముంబ‌యిలో రూ.70 కోట్ల వ్య‌యంతో ఆల‌య నిర్మాణానికి ముందుకొచ్చిన దాత

– చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి రూ.130 కోట్ల‌ విరాళాలు

– త్వ‌ర‌లో గరుడపురాణం ప్ర‌వ‌చ‌నాలు

– టిటిడి ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

 

వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామ‌ని టిటిడి ఈవోఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో ముందుగా భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.- ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ ప్రముఖులకు పరిమితం చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తున్నాం. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు వేశాం. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశాం. భక్తుల సౌకర్యార్థం తిరుమల పిఏసి-2లో అన్నప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు దాదాపు ప్ర‌తిరోజూ 2,500 మందికి పైగా శ్రీవారి సేవకులు స్వ‌చ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు :

– వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఏప్రిల్‌ 24వతేదీ నుండి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించాం. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా నిర్దేశిత స్లాట్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం.

మే 25న శ్రీ హనుమజ్జయంతి :

– తిరుమలలో ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాం.

– హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలోని ఆకాశగంగ వద్ద, జాపాలీ తీర్థం, నాదనీరాజనం వేదిక, ఎస్వీ వేద పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

– మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. దాదాపు 200 మంది వేద‌పండితులు 18 గంట‌ల పాటు 2800 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తారు.

– శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలానికి సంబంధించి ఆధారాలతో సమగ్ర గ్రంథాన్ని తెలుగు, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ముద్రించడం జరిగింది. త్వరలో ఈ గ్రంథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. టిటిడి వెబ్‌సైట్‌లో కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతాం.

కల్యాణమస్తు :

– పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తాం.

శ్రీవారి మెట్టు

– గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని యుద్ధప్రాతిపాదికన పునరుద్ధరించాం. రూ.3.60 కోట్ల వ్యయంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలో పూర్తిచేసి మే 5 నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం.

మే 21 నుండి భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయం మహాకుంభాభిషేకం :

– మే 21 నుండి 26వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయం మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహిస్తాం. ఇటీవల వైజాగ్‌లో శ్రీవారి ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించాం. అదేవిధంగా, జమ్మూ, సీతంపేట, అమరావతి ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కొనసాగుతోంది.

– మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన 10 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే ఇటీవ‌ల టిటిడి ఛైర్మ‌న్‌కు అందజేశారు. అక్క‌డ దాదాపు రూ.70 కోట్ల వ్య‌యంతో ఆల‌య నిర్మాణానికి ఒక దాత ముందుకొచ్చారు. త్వరలో అక్కడ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తాం.

చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన :

– తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు టిటిడి అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతోపాటు విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులోభాగంగా..

– అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఏడు అంతస్తుల్లో 350 పడకలతో నిర్మించనున్న చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, బర్డ్‌ ఆసుపత్రిలో గ్రహణ మొర్రి బాధితుల కోసం, వినికిడి లోపంతో బాధపడే చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక చికిత్సా కేంద్రాలను వారు ప్రారంభించారు.

– రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టిటిడి స‌హ‌కారంతో చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రిని ఏర్పాటుచేయాల‌ని గౌ.ముఖ్య‌మంత్రివ‌ర్యులు సూచించారు. ఈ మేరకు చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రిని ప్రారంభించాం. నూత‌నంగా నిర్మించ‌నున్న చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు రూ.130 కోట్లు విరాళాలు అందాయి. ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టుకు దాత‌లు విరాళాలు అందించాల‌ని కోరుతున్నాం. వీరికి ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. సిఎస్ఆర్ కింద కూడా విరాళాలు అందించవ‌చ్చు. బోర్డు తీర్మానం మేర‌కు దాత‌ల‌కు ఉద‌యాస్త‌మాన సేవా టికెట్లు అందిస్తున్నాం.

టిటిడి విద్యాసంస్థలకు నాక్‌ ఎ ప్లస్‌ గ్రేడ్‌ :

– టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి. కళాశాలకు, ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలకు ఇటీవల నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ గుర్తింపు లభించింది. ఇందుకు కృషి చేసిన అధికారులను, అధ్యాపక సిబ్బందిని అభినందిస్తున్నాను.

తరిగొండ వెంగమాంబ ధ్యానమందిరం :

– తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావంలో దాత సహకారంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ధ్యానమందిరం నిర్మిస్తున్నాం.

నూతన పరకామణి భవనం :

– ఆధునిక సదుపాయాలతో దాత సహకారంతో రూ.18 కోట్ల ఖర్చుతో పరకామణి నూతన భవనం నిర్మిస్తున్నాం. మూడు నెలల్లో ఈ భవనం అందుబాటులోకి తీసుకొస్తాం.

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు :

– మే 15 నుండి 17వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఎస్వీబీసీ ధార్మిక కార్యక్రమాలు :

– ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం గత రెండేళ్లుగా టిటిడి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిని కోట్లాది మంది భక్తుల ముంగిటికి తీసుకెళ్లడానికి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తోంది. వీటిలో …

– వైశాఖ మాసోత్సవంలో భాగంగా మే 1 నుండి 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై హరివంశ పురాణ ప్రవచనం జరుగుతోంది.

– ఏప్రిల్‌ 10వ తేదీ నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు యోగదర్శనం పేరిట ప్రవచన కార్యక్రమం కొనసాగుతోంది. కోట్లాది మంది భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాల‌ను వీక్షిస్తున్నారు.

– రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరుగుతున్న ఆదిపర్వం పారాయణం ఈనెల 24వ తేదీన ముగియనుంది. మే 25వ తేదీ నుండి సభాపర్వం మొదలుకానుంది. ఇదేవిధంగా, 18 ప‌ర్వాల్లోని ల‌క్ష శ్లోకాలను ప‌ఠింప‌చేస్తాం.

– భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న గరుడపురాణాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తాం. పండితులు ప్రతి శ్లోకాన్ని ఉచ్ఛరించి అర్థాన్ని విశదీకరించడం జరుగుతుంది.

– మే 14న నృసింహ జయంతి సందర్భంగా తిరుమల వసంత మండపంలో నృసింహ స్వామివారిపూజ నిర్వహిస్తాం.

 

Tags:Extensive arrangements in the summer for the devotees of Srivastava