ఉత్తరాంధ్రలో గాడిన పడుతుందా….?

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22: ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా. ఇక్కడ బీసీ, కాపు సామాజికవర్గాలు ఎవరికి కొమ్ముకాస్తే వాళ్లే విజేతలు. గత ఎన్నికల్లో ఈ ఫార్ములాను గట్టిగా పట్టుకోవడమే కాకుండా పక్కాగా వర్కవుట్ చేసింది వైసీపీ. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకుగాను టీడీపీ గెలిచింది ఆరు చోట్లే. విజయనగరం జిల్లాను వైసీపీ క్లీన్‌స్వీప్ చేయగా.. శ్రీకాకుళంలో రెండు, విశాఖ సిటీలో నాలుగుచోట్ల సైకిల్ పార్టీ గెలిచింది. ఈ రెండున్నరేళ్లలో ఫ్యాన్ పార్టీ జోష్ తగ్గలేదు. అయితే అంతర్గతంగా మాత్రం నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోంది. గ్రూప్ రాజకీయాల వేడిలో కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చలి కాచుకోవడం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.వైసీపీ ద్వితీయశ్రేణికి, కేడర్‌కు అండగా నిలవడం ద్వారా పార్టీ పటిష్టత కోసం పని చేయాల్సిన ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ప్రమాదకర సంకేతాలు పంపించాయి. మూడు జిల్లాల్లోనూ అసంతృప్తులు ఉండగా.. ఇటీవల పాయకరావుపేట, టెక్కలిలో విభేదాలు రోడ్డెక్కాయి. చాలా నియోజకవర్గాలలో ఆధిపత్య రాజకీయం శ్రుతిమించుతోంది.

ఇందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాలిటిక్స్. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్ జడ్పీటీసీగా ఓడిపోయారు. ఇదే జిల్లాలో మిగతా అన్నిచోట్ల వైసీపీ గెలిచింది. ఇవన్నీ కొన్ని లెక్కలు మాత్రమే. అందుకే వైసీపీ హైకమాండ్ కీలక చర్యలకు ఉపక్రమించింది.నేతల మధ్య ఆధిపత్య పోరును కట్టడి చేయడం.. పార్టీ గెలుపుకోసం పోరాటం చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేలా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధ అవుతోంది వైసీపీ. ఆ పని ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టనుండగా ఆ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల్లో పెట్టింది హైకమాండ్. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు రాజకీయ సమీక్షలకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ కేంద్రాలకు వెళ్లినప్పుడు మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశనిర్ధేశం జరిగినట్టు వినికిడి. అలాగే ఆధిపత్య పోరుపైనా ఫోకస్‌ పెడతారట.ఈ నెల 22 నుంచి సమీక్షలు ప్రారంభమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం.

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయడం వంటి కంప్లీట్ టాస్క్ సాయిరెడ్డి చేతుల్లో పెట్టినట్టు పార్టీవర్గాల అంతర్గత చర్చ. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ నేరుగా అధిష్ఠానానికి చెప్పుకునే వెసులుబాటు లేదు. ఉత్తరాంధ్రలో పార్టీకి బాధ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి.. పార్లమెంట్ సమావేశాలు.. ఇతర పనులు కారణంగా బిజీగా ఉంటున్నారు. కొద్దికాలంగా ఆయన రాజకీయ దూకుడు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఫోకస్ ఉంచారు. ఆయన నిర్వహిస్తోన్న ప్రజాదర్భార్‌కు విశేష స్పందన వస్తోందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. సాయిరెడ్డి యాక్షన్‌ ప్లాన్‌ తెలిసినప్పటి నుంచీ కొందరు ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారట. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని బహిరంగంగా చెబుతూనే సయోధ్యకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

future of political partiesmp vijayasai reddytdp vs ysrcp partyTPD in Uttarandhravijayasai reddyysrcp in Uttarandhraysrcp vs tdp in vzag
Comments (0)
Add Comment