సుతిలి కొనుగోలు కుంభకోణం పై విచారణ జరిపించాలి
-ప్రభుత్వమే సుతిలి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి
మంథని ముచ్చట్లు:
మంథని సింగిల్ విండో తో సహా ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత మూడు ఏండ్లుగా సుతిలి కొనుగోలు పేరిట జరుగుతున్న కోట్లాది రూపాయల కుంభకోణం పై విచారణ జరిపించాలని, ప్రస్తుత సీజన్ నుండి జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలోని సివిల్ సప్లై శాఖ చేస్తున్న గన్నీ సంచుల తరహాలోనే సుతిలి కూడా పంపిణీ చేయాలని సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ కు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి,మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ వినతిపత్రాన్ని అందజేశారు.వివరాల్లోకి వెళితే…పెద్దపల్లి జిల్లాలో సివిల్ సప్లై,సహకార శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ సంచులను ప్రభుత్వం ఆధ్వర్యంలోని సివిల్ సప్లై శాఖ సరఫరా చేస్తుండగా వాటిని కుట్టడానికి అవసరమైన సుతిలి దారాలు మాత్రం ఆయా కొనుగోలు కేంద్రాల వారే కొనుగోలు చేస్తున్నారు.

అయితే ప్రతి ఖరీఫ్ మరియు రబీ సీజన్లో సహకార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొన్ని సింగిల్ విండో సొసైటీల్లో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం సుతిలి దారాల ఖర్చు లక్షల్లో రాస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు.మంథని లాంటి సింగిల్ విండో సొసైటీలో ఏకంగా ప్రతి సీజన్లో 15 నుండి 20 లక్షల ఖర్చు కేవలం సుతిలి దారాల పేరిట రాస్తున్నారంటే ప్రభుత్వ నిధులు ఏవిధంగా పక్కదారి పడుతున్నాయో అర్తం అవుతుంది. జిల్లాలో గత మూడు ఏండ్లుగా సుతిలి కొనుగోలు పేరిట కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.కావున పెద్దపల్లి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన సుతిలి కొనుగోలు కుంభకోణం పై విచారణ జరిపించాలని,ఈ సీజన్లో గన్నీ సంచుల తరహాలోనే సుతిలి కూడా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో సరఫరా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని, ఎవరూ కూడా బయట మార్కెట్లో సుతిలి కొనుగోలు చేయకుండా తగు ఆదేశాలు జారీ చేయాలని వినతిపత్రం లో సతీష్ కలెక్టర్ ను కోరారు.
Tags; An inquiry should be conducted on the hammer purchase scam
