ఆనం అన్నంత పనిచేస్తున్నారు

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు టిడిపిలో మరో వివాదం. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరకముందే.. జిల్లాలో టిడిపి తనదేనన్నట్టు వ్యవహరిస్తున్నారు. అది పాత టిడిపి నాయకులకు మింగుడు పడడం లేదు. ఎప్పటినుంచో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్న తమను కాదని.. ఆనం రామ నారాయణ రెడ్డి కి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో మాజీ మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్లు ఉండగా.. ఇంకా పార్టీలో చేరిన ఆనం హవా చలాయించడం ఏమిటని టిడిపి నేతలు లోలోపల రగిలిపోతున్నారు.ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నాయకుడు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను సైతం నిర్వర్తించారు. కానీ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ తో అంత సన్నిహిత సంబంధాలు తక్కువ. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. అప్పటినుంచి పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో సస్పెన్షన్కు గురయ్యారు.తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. లోకేష్ పాదయాత్రలో సైతం అన్నీ తానై వ్యవహరించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జరిగిన ఆందోళనలో సైతం పాల్గొన్నారు. త్వరలో చంద్రబాబు సమక్షంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

 

 

అయితే ఇప్పుడు జిల్లా టిడిపిలో కీలకం తానే నన్న రేంజ్ లో వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి మరో మారు తాను బరిలో ఉంటానని తనకు తానుగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గ టిడిపి బాధ్యులు ఆనం తీరును తప్పుపడుతున్నారు. హై కమాండ్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేకురుగొండ్ల రామకృష్ణ, డాక్టర్ మస్తాన్ యాదవ్ పెద్దదిక్కుగా ఉన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి టిడిపిలోనే చిన్న నాయకుడిని మొదలుకొని.. పెద్ద స్థాయి నేత వరకు అందరికీ ఫోన్ చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని.. సహకరించాలని కోరడం వివాదంగా మారుతోంది. ఈ విధంగా తనకు తాను అభ్యర్థిగా ప్రకటించుకోవడం ఏమిటని ఆ ఇద్దరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లకు ఒకసారి పార్టీ మారే ఆనం రామనారాయణరెడ్డి విషయంలో హై కమాండ్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పార్టీలోకి ఎంట్రీ ముందే ఆనం రామనారాయణరెడ్డి టిడిపికి తలనొప్పిగా మారడం విశేషం.

 

Tags: Anam is working like that

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *