అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Date:11/01/2019
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. అయితే అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు ఆగడానికి వీలులేదు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి వీల్లేదు. దీంతో మరింత అప్పులు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతుండటంతో రావాల్సిన నిధులు కూడా రాకుండా పోయాయి. దీంతో అప్పులు చేసైనా ఎన్నికలను దాటాలన్నది నారా చంద్రబాబునాయుడి ఆలోచనగా కన్పిస్తోంది.ఎన్నికలకు ధైర్యంగా వెళ్లాలంటే కొన్ని పనులను సత్వరమే పూర్తి చేయాల్సి ఉంటుంది చంద్రబాబునాయుడికి. అలా పూర్తి చేయకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి ఎన్నికల నాటికి ఒక రూపుతేవాలి. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రజలకు కన్పించేలా చేయగలగాలి. మరోవైపు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ చేయాలి.
ఐదు విడతలుగా రుణమాఫీ చేస్తానని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం మూడు విడతలుగా రుణ మాఫీ జరిగింది. అయితే ఎన్నికల ఏడాది కావడంతో ఒకే దఫా నాలుగు, ఐదు విడతల రుణమాఫీ నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. పనులన్నీ వేగవంతం కావాలంటే 18 వేల కోట్ల రూపాయల నిధులు అవసరం. ఇప్పటికే కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కు వెళుతుంది. రిజర్వ్ బ్యాంకు సయితం తప్పుపట్టింది. ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయాల మేరకు వివిధ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు పౌరసరఫరాల శాఖతో పాటు ట్రాన్స్ కోకు కూడా రాయితీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇవే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.
దీంతో ఇంత పెద్దమొత్తంలో నిధులు అవసరమవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టింది.పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అయితే డీపీఆర్ -2 ఆమోదం పొందిన తర్వాతనే నిధులు విడుదలవుతాయి. కేంద్రం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ పనులు ఆగిపోతాయి. దీంతో జలవనరుల కార్పొరేషన్ ద్వారా పదివేల కోట్లరూపాయలు అప్పుగా తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దీనికి ఇటీవల మంత్రి మండలి సయితం ఆమోదించింది.
ఇప్పటికే జలవనరుల శాఖకు నాలుగువేలకోట్లు బాకీ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు నాలుగువేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా ఎటు చూసినా అప్పులు పేరుకుపోతుండటంతో మరోసారి అప్పు తెచ్చుకునేందుకు బాబు సర్కార్ సిద్ధమయింది. ప్రస్తుతం నాలుగో త్రైమాసికంలో ఉన్నందున రాబోయే మూడు నెలల్లో ఏడువేల కోట్ల రూపాయలను రుణం తెచ్చుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనికి రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి తీసుకోనుంది. అప్పు చేసైనా సంక్షేమ పథకాలను, నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. మోదీతో యుద్ధం తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిందంటున్నారు విశ్లేషకులు.
Tags:Andhra Pradesh government in debt relief

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *