పరిటాల శ్రీరామ్ మొదటిసారి పోటీ

  Date:26/03/2019
అనంతపురం ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని హాట్ సీట్లలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ మొదటిసారి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ ను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన పరిటాల కుటుంబంపై పోటీలో ఉండటం ఇది మూడోసారి. గత రెండు ఎన్నికల్లో ఆయన పరిటాల సునీతపై పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఇక, పరిటాల రవి వారసుడు శ్రీరామ్ మొదటిసారి పోటీ చేస్తుండటంతో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పరిటాల సునీతతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. జనసేన సహా మిగతా పార్టీల ఉనికి ఇక్కడ పెద్దగా లేకపోవడంతో ఈ ఇద్దరు మధ్యే పోటీ హోరాహోరీగా ఉండనుంది.పెనుగొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు పరిటాల రవి, సునీత విజయం సాధించారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వారికి స్వంత మండలం రామగిరితో పాటు వారికి ఎక్కువ పట్టున్న ప్రాంతాలు రాప్తాడు నియోజకవర్గంలో చేరడంతో పరిటాల సునీత ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2009లో ఆమె అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డిపై 1,707 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయగా ఆయనపై సునీత 7,774 ఓట్లతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఇక్కడ పరిటాల కుటుంబంతో పాటు తోపుదుర్తి కుటుంబం కూడా బలంగా కనిపిస్తోంది. దీంతో మరోసారి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండనుంది. పరిటాల సునీత మంత్రిగా ఈ ఐదేళ్ల కాలం నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేయగలిగారు. నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు కలిసొస్తాయని భావిస్తున్నారు. పరిటాల వారసుడిగా శ్రీరామ్ మొదటిసారి పోటీ చేస్తున్నందున రవిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు శ్రీరామ్ పైన చూపుతారని భావిస్తున్నారు. కుటుంబ పాలన చేస్తున్నారని, సునీత సోదరుల ఆధిపత్యం ఎక్కువైందనే ఆరోపణలు పరిటాల శ్రీరామ్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది.
పలువురు నేతలు వీరి కుటుంబ ఆధిపత్యాన్ని నిరసిస్తూ బయటకు వచ్చేసి వైసీపీలో చేరిపోయారు. ప్రచారంలో టీడీపీ నేతల వైఖరి కూడా ఇటీవల వివాదాస్పదమైంది. పలువురు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ ను గెలిపించకపోతే ఇబ్బందులు ఎదుర్కుంటారని ప్రజలను బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. ఇవి కూడా శ్రీరామ్ కు నష్టం చేసే అవకాశం ఉంది. ఇక, వైసీపీ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డికి రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఉంది. ఆయన అధికారంలో లేకున్న ఫౌండేషన్ స్థాపించిన సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజల్లో గుర్తింపు పొందారు. బోర్లు వేయించడం, మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం ఆయనకు మేలు చేయవచ్చు. పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి రావడం కలిసొచ్చే అవకావం ఉంది.పరిటాల కుటుంబంతో ఢీ అంటే ఢీ అనే తోపుదుర్తి సోదరుల వ్యవహారశైలి పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. ఇక, నియోజకవర్గంలో కమ్మ సామాజకవర్గం ఎక్కువగా ఒకరి వైపు, రెడ్డి సామాజకవర్గం ఎక్కువగా మరొక అభ్యర్థి వైపు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. కురబ, ఇతర బీసీ సామాజకవర్గాలు ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. ఎప్పుడూ టీడీపీ వైపే ఎక్కువగా ఉండే బీసీల్లో వైసీపీకి కొంత ఆధరణ పెరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి మొదటి ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు.
Tags:Shriram is the first to contest

జిల్లాలో ఈసారి అంతా ఉరవకొండపైనే దృష్టి

 Date:09/03/2019
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో ఈసారి అంతా ఉరవకొండపైనే దృష్టి ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడం ఒక సెంటిమెంట్ గా మారింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ విజయం సాధించారంటే టీడీపీ అధికారంలోకి రానట్లేనన్న లెక్కలు ఇక్కడ బలంగా విన్పిస్తున్నాయి. పయ్యావుల కేశవ్ గెలిచి.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి అయ్చే ఛాన్సుంది. కానీ పయ్యావులకు ఆ లక్కు ఇప్పటీకీ చిక్కడం లేదు. పయ్యావులకు ఉరవ కొండ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.దాదాపు రెండు దశాబ్దాలుగా పయ్యావుల ఉరకొండ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. పయ్యావుల కేశవ్ 2004లో వైఎస్ బలమైన గాలులు వీచిన సందర్భంలోనూ గెలిచారు. అయినా పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగే 2009లోనూ పయ్యావుల ఉరవకొండ నుంచి విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై కేవలం 229 ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు. అదే 2014 ఎన్నికలకు వచ్చే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో 2,275 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.
పయ్యావులకే ఉరవకొంద టిక్కెట్ ఖాయం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన గెలిస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. బీసీలే ఇక్కడ గెలుపోటములు నిర్ణయిస్తూ వస్తుండటంతో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈసారి కూడా పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశం కన్పిస్తుంది. పయ్యావుల పై నియోజకవర్గంలో ఒక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఓటమి పాలయినా ఎమ్మెల్సీగా ఉండి పయ్యావుల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు. మనోడికి ఫేట్ తక్కువ కావడంతో ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి తెలుగుదేశం పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాలుగు సార్లు గెలిచిన పయ్యావుల ఈసారి గెలిచే అవకాశాలున్నాయా? అంటే అదీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి బలంగా ఉన్నారు. పార్టీ కూడా ఉరవకొండ నియోజకవర్గంలో బలంగా ఉంది. మొత్తం పయ్యావుల ఫేట్ మీదనే టీడీపీలో పెద్దయెత్తున డిస్కషన్ జరుగుతుంది. ఈసారైనా పయ్యావుల గెలుస్తారా? గెలిస్తే మంత్రి అవుతారా? అన్నది ఆసక్తికరమే.
Tags:This time in the district is the focus of Uriyongonda

 ర్యాంకుల ఆధారంగానే ఎమ్మెల్యేలకు సీట్లు

   Date:07/03/2019

   అనంతపురం ముచ్చట్లు:
సిట్టింగ్‌లతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తాయా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుకు వచ్చిన ర్యాంకులు, ఇటీవల ప్రత్యేకంగా చేయించిన సర్వేలు, వ్యతిరేక వర్గాలు, అసమ్మతి నేతల నుంచి అందిన ప్రతికూల అంశాలను బేరీజు వేసి అభ్యర్థుల పేర్లను అధినేత ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ.దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ.పవన్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈసారి సుముఖంగా లేకపోవడంతో పాటు పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి కూడా అయిష్టంగానే ఉండగా, హిందూపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. అయితే అంబికాకు అహుడా చైర్మన్ పదవి దాదాపు ఖరారైంది. నేడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తిప్పేస్వామి పేరు ప్రకటిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించి భేటీలను అధినేత నిర్వహించి పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లకు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని తెచ్చి పార్టీకి బలాన్ని చేకూర్చారు.
ఇపుడు అనంతపురం వంతు రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీని బలోపేతం చేసి వైకాపాకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాలన్న లక్ష్యంతో అధినేత ఉండటం, గెలుపు గుర్రాలను అనే్వషిస్తుండటంతో కొత్త ముఖాలు వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గత కొన్ని రోజుల నుంచి అసమ్మతి వర్గం సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వరాదంటూ తమ గళాన్ని పెంచింది. దీంతో తొలి జాబితాలో టికెట్లు ఎవరికి దక్కుతాయో, ఎవరి గల్లంతవుతాయోనన్న ఆందోళన కొందరు సిట్టింగ్‌లతో నెలకొంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కార్యకర్తలు, అటు ప్రజల్లోనూ టీడీపీ అధినేత ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగం వరకూ సిట్టింగ్‌లకే అవకాశాలు ఉన్నాయని, మిగతా ఏడింటిలో కొన్నింటిలోనైనా కొత్త వారికి అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల సమీకరణలను బట్టి వేరే పార్టీ నుంచి కూడా టీడీపీలోకి తెచ్చే వ్యూహమేదైనా ‘బాబు’ వద్ద ఉందా? అన్న దానిపైనా చర్చసాగుతోంది. ఇప్పటికే రాయదుర్గంలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని వ్యూహాత్మకంగా టీడీపీలోకి తీసుకోవడం తెలిసిందే. మరోవైపు వైకాపా నుంచి కూడా చేరికలు ఉంటున్నాయి.
కాగా అనంతపురం, కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రగిలాయి. తమ అనుకూల నాయకులు, వర్గీయులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి టికెట్ల తమ సామాజిక వర్గానికే ఇవ్వాలని కొందరు, సిట్టింగ్‌లకు తప్ప ఎవరికిచ్చినా మద్దతిస్తామని, లేకుంటే ఎన్నికల్లో సహకరించేది లేదంటూ తెగేసి చెప్పడం తెలిసిందే. కదిరిలో తొలి నుంచి కందికుంట వెంకటప్రసాద్, వైకాపా నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు మధ్య టికెట్ విషయంలో పోటీ నెలకొంది. శింగనమలలో విప్ యామినీ బాలపైనా తీవ్ర వ్యతిరేకత సొంత పార్టీలో రగిలింది. పుట్టపర్తిలో పల్లెకు వ్యతిరేకంగా అసమ్మతి రోడ్డెక్కింది. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు కాకుండా ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరికైనా ఇవ్వాలని సుమారు 10 మంది దాకా ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. గుంతకల్లులో ఆశావహులు మాజీ జెడ్పీటీసీ కేసీ.నారాయణ, గుత్తికి చెందిన వెంకటశివుడు యాదవ్, పత్తి హిమబిందు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈసారి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే కావాలని, అలాగే మంత్రి వర్గంలో బెర్త్ సంపాదించుకోవాలని ఆశిస్తున్న సిట్టింగ్‌లు అధినేత ప్రకటనపై ఆందోళనలో ఉన్నారు.
Tags:Seats for MLAs based on ranks

జేసీ దివాకర్ రెడ్డి జోస్యం నిజమవుతుందా?

Date:06/03/2019
అనంతపురం  ముచ్చట్లు:
జేసీ దివాకర్ రెడ్డి జోస్యం నిజమవుతుందా? నలభై శాతం ఎమ్మెల్యేలను మార్చకుంటే చంద్రబాబు ప్రభుత్వం రావడం కష్టమేనా? జేసీ కామెంట్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నలభై శాతం సిట్టింగ్ లను మార్చాలంటే దాదాపు యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే. కానీ చంద్రబాబు ఆ సాహసం చేయగలరా? సిట్టింగ్ లకు టిక్కెట్లు దక్కకుంటే వారు రెబల్స్ గా మారరా? ప్రస్తుతం చంద్రబాబు నివాసానికి వచ్చిన నియోజకవర్గం నేతలు చర్చించుకుంటున్న మాటలివి.చంద్రబాబునాయుడు నిజానికి గత సంక్రాంతి పండగ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. కానీ నెలన్నర గడుస్తున్నా ఇంకా అధికారికంగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. నిజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్వహించుకున్న సర్వేల్లోనూ వెల్లడయింది. వివిధ రూపాల్లో తెప్పించుకున్న సర్వే నివేదికలు చంద్రబాబును సయితం ఆశ్చర్యంలో ముంచెత్తాయంటున్నారు. తాను ఖచ్చితంగా గెలుస్తారనుకున్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ఒకరిపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలడంతో ఆయన అవాక్కయ్యారని చెబుతున్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం సమీక్ష సందర్భంగా చంద్రబాబు దీనిని నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.మొదటి నుంచి టీడీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిపై ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉంది. చంద్రబాబు అంటే నమ్మకముంది.
ఆయన వల్లనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఇప్పటీకీ అనేకమంది నమ్ముతున్నారు. అంతేకాదు రాజధాని నిర్మాణం పూర్తికావాలన్నా, ఏపీ ఇతర రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో ముందుండాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నది మేధావులు సయితం అంగీకరిస్తున్న విషయం. అయితే గత నాలుగున్నరేళ్లుగా ఆయన వేసిన పిల్లిమొగ్గలతో కొంత వ్యతిరేకత చంద్రబాబుపైన కూడా వచ్చిందంటున్నారు. చేసే పనికీ, చెప్పే దానికి పొంతన లేకపోవడం, రాజధాని నిర్మాణాన్ని నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసి ఇప్పుడు హడావిడి చేయడం కూడా బాబుకు ఇబ్బందిగా మారింది. అయినా ఇప్పటికీ ప్రజల్లో అత్యధిక శాతం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంగా ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. ల్యాండ్, శ్యాండ్ మాఫియాలతో గత నాలుగున్నరేళ్లుగా కొందరు ఎమ్మెల్యేలు భ్రష్టుపట్టి పోయారు. ప్రజల్లో చులకన ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటి బాపతు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం సిట్టింగ్ లను తొలగించేందుకు సిద్ధంగా లేరు. మరీ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న వారిని మాత్రం పిలిపించి వారి కుటుంబంలో మరొకరికి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నంలో బాబు ఉన్నారు. అంతేకాదు వ్యతిరేకత ఉన్న వారికి దాన్నుంచి ఎలా బయటపడాలో చంద్రబాబు క్లాసులు పీకి పంపుతున్నారు. ఇలా జేసీ చెప్పినట్లు 40 శాతం మంది ఎమ్మెల్యేలను తొలగించే అవకాశమే లేదని, మరి రిజల్ట్ ఎలా ఉంటాయోనన్నది తెలుగుదేశం పార్గీ వర్గాలు ఆందోళనగా ఉన్నాయి.
Tags:Will JC Diwakar Reddy’s prophecy come true?

అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి

Date: 28/02/2019
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌తో పాటు రబీలోనూ వర్షాభావ పరిస్థితులు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. పంటలు దెబ్బ తినడంతో జిల్లా అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఖరీఫ్‌లో మొదటి విడత 37 మండలాలు, రెండో విడతగా మరో 13 మండలాలను కరువు జాబితాలో చేర్చారు. ఇక రబీలో మొత్తం 53 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు జాబితా ప్రకారం ప్రభుత్వం పరిహారం పంపిణీ, కరువుపై ఇంత వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలో రబీ సాధారణ సాగు 3,33,698 హెక్టార్లు.. 2,55,875 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో 149.6 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 35.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు కావడంతో బోర్ల కింద తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రబీ పంటలు ఎండిపోయాయి. సుమరుగా 2 లక్షల హెక్టార్లలో పంటలు చేతికందకుండా పోయాయి. ముఖ్యంగా కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆస్పరి, నందికొట్కూరు, ఆదోని, ఆలూరు మండలాల్లో మిరప, పత్తి, టమోటా, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి. దాదాపు రూ.639 కోట్లను రైతులు పెట్టుబడి కింద నష్టపోయారు. తీవ్ర వర్షాభావం మూలంగా రబీలోనూ రైతులకు నిరాశ తప్పలేదు. రబీలో సాగు చేసిన అన్ని పంటలు దెబ్బ తిన్నాయని, 53 మండలాల్లో పంటలు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు newspప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
  ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్‌ సీజన్‌లో 4,02,505 హెక్లార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో నష్టపోయిన 4,75,458 మంది రైతులకు రూ.616 కోట్ల పరిహారం మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. రబీ సీజన్‌ 2018 అక్టోబర్‌ నుంచి మొదలైంది. వర్షం కురవక పోవడంతో పూర్తిస్థాయిలో పంటలు వేయలేదు. శనగ 1,42,131 హెక్టార్లలో వేశారు. జొన్న, మొక్కజొన్న, ధనియాలు ఎక్కువగా సాగు చేశారు. ఈసారి శనగ కూడా రైతులను ముంచింది. కేవలం శనగకే రూ.355 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మిగతా అన్ని పంటలకు కలిపి ఎకరాకు రూ.25 వేల చొప్పున వేసి జిల్లావ్యాప్తంగా రూ.639 కోట్లు రైతులు నష్టపోయినట్లు అంచనా వేయడంతో పాటు 53 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలు పంపారు. రబీలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 1.50 లక్షల మంది రైతులు ఫసల్‌ బీమాకు ప్రీమియం చెల్లించారు. వచ్చిన నష్టం బీమా తీర్చుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.కరువుతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే పరిహారం అందించి ఆదుకుంటామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో ఎంతో జాప్యం చేస్తోంది. ఫలితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తక్షణ సహాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి చెబుతున్నా అమలులో మాత్రం ఎక్కడా కదలిక లేదు. రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.
Tags:Anantapur district is in severe drought conditions

 అధికారుల అలసత్వం వలన ముందుకు సాగని చదువులు

 Date:15/02/2019

అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలోని ఆదర్శ పాఠశాలల  అమలులో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. ఓ వైపు ఉపాధ్యాయుల కొరత వెక్కిరిస్తుంటే, మరోవైపు ఉన్న సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ‘మోడల్‌’ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. వసతితో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకునే అవకాశం రావడంతో గ్రామీణ విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటి ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆశయం బాగుంది కానీ,. చాలా స్కూళ్లలో  రాజకీయ జోక్యం అధికమవుతోంది. దీంతో పర్యవేక్షించాల్సిన అధికారులు కఠినత్వం ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగులు ఆడిందే ఆడ పాడిందే పాట చందంగా వ్యవహరిస్తున్నారు. ఉన్న ఉపాధ్యాయులైనా విద్యార్థుల బోధనపై దృష్టి సారిస్తున్నారంటే అదీలేదు. చాలా స్కూళ్లలో ఆధిపత్యపోరుతో విద్యార్ధుల చదువును గాలికొదిలేశారు.
కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, విడపనకల్లు, యాడికి, పుట్లూరు తదితర స్కూళ్లలో రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎంతసేపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం తప్ప చదువు గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలు ‘ఎవరికివారు యమునా తీరే’ చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కింద నియామకమైన వార్డెన్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి పూట ఉండి విద్యార్థులతో చదివించాల్సి ఉంది. చాలాచోట్ల వార్డెన్లు రాత్రిపూట ఉండడం లేదు. ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీలు కూడా స్కూల్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాల్సి ఉన్నా.. చాలామంది జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల నుంచి రోజూ వెళ్లి వస్తున్నారు.మోడల్‌ స్కూళ్లలో హాస్టల్‌ వసతి ఉంటుందని ప్రారంభంలో ప్రకటించడంతో  విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. విపరీతమైన డిమాండ్‌ నెలకొనడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం 9 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తున్నారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత, ఉన్న ఉపాధ్యాయుల్లో సమన్వయం లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్‌ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14వేల మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 10468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం.
Tags:Unhealthy studies of the officers

బిరబిరా కృష్ణమ్మ

Date:06/02/2019
అనంతపురం ముచ్చట్లు :
               జిల్లాలో అన్నివైపులా కృష్ణా జలాలు పరుగులు పెడుతుండగా.. తాజాగా మరింత కృష్ణమ్మను తక్కువ సమయంలో ఎక్కువగా తీసుకునే అవకాశం కలగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. తద్వారా జిల్లాలో మూడు నియోజకవర్గాలకు మేలు జరగడమే కాకుండా, చిత్తూరు జిల్లాకు సైతం మరింతగా ప్రయోజనం కలగనుంది.
జిల్లాలోని హంద్రీనీవా మొదటి దశ జీడిపల్లి జలాశయం వద్ద 216.3వ కి.మీ వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. ఈ రెండో దశ మన జిల్లాలోని తలుపుల మండలంలోని చిత్తూరు జిల్లా సరిహద్దులోని ప్రధాన కాల్వలో 490వ కి.మీ. వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో 554 కి.మీ. వరకు ప్రధాన కాల్వ ఉంది.
అయితే మొదటి, రెండో దశల్లో కృష్ణమ్మ అనంతపురం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోని మండలాలు దాటి వెళ్లడం, ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాల నేపథ్యంలో.. చివరకు నీరు వెళ్లడం కష్టమవుతోంది. మన జిల్లాలోని కదిరి, చెర్లోపల్లి జలాశయం వరకు నీరు చేరడానికి చాలా సమయం పడుతోంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు అన్నిచోట్లా నీటి కోసం ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది. దీంతో ప్రభుత్వం కడప జిల్లాలోని గండికోట జలాశయం ద్వారా చిత్రావతి జలాశయం ద్వారా వచ్చే నీటిని తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా జిల్లాలో 11 నియోజకవర్గాలకు మేలు కలుగుతోంది. అటు హంద్రీనీవా మొదటి దశవైపు నుంచి వచ్చే నీరే కాకుండా, కడప జిల్లాలోని గండికోట జలాశయం నుంచి వచ్చే కృష్ణా జలాలను కూడా హంద్రీనీవా కాల్వలోకి తీసుకొచ్చేలా కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జలవనరుల శాఖ ఇంజినీర్లు పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.1,796.99 కోట్ల మేర పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ మంగళవారం ఉత్తర్వు సంఖ్య 78 జారీ చేసింది. వెరసి ఇంజినీర్లు ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆరంభించేందుకు సిద్ధమవుతున్నారు.
కడప జిల్లాలోని గండికోట జలాశయానికి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న వరద కాల్వ ద్వారా నీరు చేరుతుంది. అక్కడి నుంచి ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రావతి జలాశయానికి నీరు వస్తోంది. రెండేళ్లుగా ఈ నీటిని తీసుకొస్తున్నారు. చిత్రావతి జలాశయ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీల మేర ఉంది. ఈ జలాశయం నుంచి తాజాగా నీటిని తరలించేందుకు ప్రతిపాదన చేశారు.చిత్రావతి వెనుక జలాల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి నీటిని ఎత్తిపోస్తారు. ముదిగుబ్బ మండలం చిన్నొకోట్ల, ఎర్రగుంటపల్లి ప్రాంతం నుంచి కాల్వ మొదలై బుదనంపల్లి, బండ్లపల్లి, దొరిగల్లు మీదగా యోగివేమన జలాశయం వరకు 25 కి.మీ.
మేర కాల్వ నిర్మిస్తారు. చిత్రావతి వెనుక జలాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకమే కాకుండా యోగివేమన వరకు మరో మూడో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. ఇలా వచ్చిన నీటితో 0.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న యోగివేమన జలాశయం నిండుతుంది. మళ్లీ యోగివేమన జలాశయం నుంచి నీటిని తరలించేందుకు మరో 4.5 కి.మీ. మేర కాల్వ నిర్మించి, మధ్యలో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. ఇలా వెళ్లిన నీరు నాగారెడ్డిపల్లె సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాల్వలో 386.9వ కి.మీ. వద్ద కలుస్తుంది. ఇందులో మొత్తంగా 29.5 కి.మీ. మేర కాల్వ, ఆరు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు.
ఈ పనులు చేసేందుకు రూ.1,827.57 కోట్ల మేర వ్యయం అవుతుందని అనంతపురం జలవనరుల శాఖ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు రూ.1,796.99 కోట్ల మేర పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే చిత్రావతిలో నీటి లభ్యత మేరకు రోజుకు 2 వేల క్యూసెక్కులు చొప్పున ఈ కొత్త కాల్వ ద్వారా హంద్రీనీవా కాల్వలోకి తీసుకెళ్లేలా అవకాశం కల్పించారు.
Tags:Birbira Krishnamma