వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు 1800 కోట్లు

Date:30/05/2018
కడప ముచ్చట్లు:
కడప జిల్లాలో ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటితోపాటు ఇంటింటికీ కొలాయి కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా రూ.1800కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. ఇందుకోసం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఇప్పటికే సర్వే మొదలుపెట్టారు.ప్రతి ఏడాది వేసవిలో తాగునీటి కోసం జనం విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వేసవిలో వాటర్ ట్యాంక్‌ల ద్వారా వందల గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు.  ఏఏ ప్రాంతాల్లో తాగునీటి సమస్య జఠిలంగా ఉంటుంది. వారికి ఏప్రాంతాల నుంచి సులభంగా నీటి సరఫరా చేయవచ్చు అనే విషయంపై సర్వే మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గంలో మంచినీటి పథకాలు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు దృష్టిసారించారు. జిల్లాలో ఉన్న 11 ప్రాజెక్టుల ద్వారా 2.82 టీఎంసీల నీటితో అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గ్రౌండ్ లెవెల్ సర్వే సాగుతోంది. సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి నిధులు మంజూరు చేసేవిధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్న పలుప్రాజెక్టుల నుండి నీటిని సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. బ్రహ్మంసాగర్ నుంచి 75గ్రామాలకు నీటిని ఇచ్చేందుకు రూ.5కోట్లతో ప్రణాళిక రూపొందించారు. అలాగే ఎస్‌ఆర్-2 నుంచి ఖాజీపేట మండలంలోని 84గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు రూ.37కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. మునిపాక స్కీమ్ నుంచి 106గ్రామాలకు రూ.7కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టనున్నారు. బ్రహ్మంసాగర్ నుంచి బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు, కాశినాయన, పోరుమామిళ్ల, కలసపాడు పరిధిలోని 206గ్రామాలకు నీటిని అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించనున్నారు. పెన్నానది నుంచి అట్లూరు, బద్వేలు, గోపవరం గ్రామాలకు నీరు అందించేందుకు రూ.49కోట్లు ఖర్చుచేయనున్నారు. రాయచోటి పరిధిలోని 118 గ్రామాలకు నీరు అందించేందుకు రూ.28కోట్లతో ప్రణాళిక రూపొందించారు. చెయ్యేరు నది నుంచి రాయచోటి, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి, సంబేపల్లి, చిన్నమండెం మండలాల్లో రూ.589 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.104 కోట్లు నిధులు అవసరమని భావిస్తున్నారు. చెయ్యేరు రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లోని గాలివీడు, ఎల్‌ఆర్‌పల్లి, వీరబల్లి, రామాపురం మండలాల్లోని 677గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.128 కోట్లు నిధులు అవసరమని నిర్థారించారు. పెన్నానది నుంచి కమలాపురం నియోజకవర్గంలోని 91గ్రామాలకు రూ.20కోట్లతో తాగునీటి పథకాన్ని అందించాలని నిర్ణయించారు. కడప, కమలాపురం నియోజకవర్గంలోని 298 గ్రామాలకు రూ.140కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు నిర్ణయించారు. వల్లూరు మండలంలోని 69గ్రామాలకు రూ.20కోట్లతో తాగునీటి పథకాలు చేపట్టనున్నారు. సోమశిల బ్యాక్‌వాటర్‌నుంచి రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లోని 534గ్రామాలకు తాగునీరు అందించేందుకు మరో రూ.190కోట్లు అవసరమని నిర్ణయించారు. వచ్చేనెల 15 నాటికి ఈసర్వే పూర్తికానుంది. ఇందుకుసంబంధించి ఆయాశాఖల అధికారులు పూర్తిస్థాయిలో సర్వే సేకరణలో నిమగ్నమయ్యారు.
Tags: 1800 crores for water grid projects

ఆళ్లకు బిగిస్తున్న ఉచ్చు

Date:30/05/2018
గుంటూరు ముచ్చట్లు:
అవినీతి పోలీస్‌ డీఎస్పీ హరిప్రసాద్‌ ఇంట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల పత్రాలు దొరకడానికి సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెండో సారి కూడా డుమ్మా కొట్టారు.. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆళ్ల, ఈసారి కూడా తన బదులు, ఏసీబీ ఎదుటకు, ఆళ్ల తరపు లాయర్లనే హాజరుపరిచారు. శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే ఆర్కే హాజరుకాలేకపోయారని ఏసీబీకి లాయర్లు వివరణ ఇచ్చారు. పోయిన మంగళవారం మొదటి సారి విచారణకు హాజరు కావాల్సి ఉంది.. అయితే, ఆళ్ల మంగళవారం గైర్హాజరయ్యారు. ‘మా క్లయింట్‌కు ఆరోగ్యం బాగలేదు.. ఆయన తరపున మేం వచ్చాం.. రెండు వారాలు గడువు కావాలి’ అని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీని కోరారు.‘రెండు వారాలు సాధ్యం కాదు.. ఒక వారం ఇస్తాం.. 29న తప్పనిసరిగా హాజరవ్వాలి’ అని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు కూడా లాయర్లు వచ్చి, మా క్లయింట్‌కు ఆరోగ్యం ఇంకా కుదుట పాడలేదు అని చెప్పారు. రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది.ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు. ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని ఈ సంఘటనలు చూస్తే తెలుస్తుంది. క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురంజిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి.
Tags: Trap

మోడీ, బాబు భేటీపై అనుమానాలు

Date:30/05/2018
విజయవాడ ముచ్చట్లు:
జూన్ 16న, ప్రధాని మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుస్తారా ? చంద్రబాబు వెళ్తారో లేదో కాని, మోడీ మాత్రం అందరి ముఖ్యమంత్రులను జూన్ 16న, కలుద్దాం రండి అంటున్నారు. ఆర్థిక అంశాల పై వివిధ రాష్ట్రాల నుంచి తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో వచ్చే నెల 16వ తేదీన ఢిల్లీలో నీతి అయోగ్ కీలక సమావేశం ఏర్పాటు కానుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఇటీవల సన్నగిల్లుతున్న సత్సం బంధాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తర, తూర్పు రాష్ట్రాలు కేంద్రం పై విరుచుకుపడుతున్నాయి. సహకార సమాఖ్య విధానానికి కేంద్రం తూట్లు పొడుస్తోందన్న ఆందోళన ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. కేవలం కొన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్న కేంద్రం మిగిలిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదనే అసంతృప్తిని రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి పై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు సహకార సమాఖ్య విధానం పైనే ఎక్కువగా స్పందించడం, దీని పైనే కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజెపికి ఎదురుదెబ్బ తగలడం, ఇతర రాష్ట్రాల్లో కూడా అసంతృప్తి పెరుగుతుండడంతో కేంద్రం దిగి వస్తున్నట్లు కనిపిస్తోందిఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశ అజెండా అంశాలను కూడా రాష్ట్రాలకు పంపించారు. ఈ ఆహ్వానంలో ప్రధానంగా సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా స్పందించడం విశేషం. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. 2022 సంవత్సరం వరకు అభివృద్ధి అనే అంశం పై కొన్ని రంగాల పై చర్చించనున్నారు.మూడో విడత నీతి ఆయోగ్ సమావేశాల్లో చర్చించిన అంశాల పై తీసుకున్న చర్యలపై ముందుగా ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం వ్యవసాయ రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చిస్తారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడం పైనా చర్చ ఉంటుంది. ఇ-నామ్, భూసార ఆరోగ్య పరీక్షలు, గ్రామీణ వ్యవసాయ పరిస్థితి, జాతీయ ఉపాధి హామీ పథకం, జల సంరక్షణపై ఉపాధి హామీ ప్రభావం పైనా చర్చిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వాస్య సురక్ష మిషన్ గురించి అజెండాలో పొందుపరిచారు. కీలక అవసరాలున్న జిల్లాలకు అందించాల్సిన ప్రత్యేక సాయం, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్ర ధనుష్ సహా మహాత్మాగాంధీ 150 జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల సలహాలు తీసుకోనున్నారు.నాలుగో నీతి అయోగ్ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రం సహకార సమాఖ్య విధానానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్రాలకు రాసిన ఆహ్వాన లేఖలో పేర్కొనడం విశేషం.
Tags: Modi and Babu are suspicious of the meeting

యాప్ ద్వారా విత్తనాల సరఫరా

Date:30/05/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో విత్తన వేరుశెనగ కాయల కొరత రానీకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.  బయోమెట్రిక్ ద్వారానే విత్తన కాయలు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి యాప్ సిద్ధంగా ఉంది. రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తెచ్చుకోవాల్సి ఉంటుంది. 430 బయోమెట్రిక్ మిషన్స్‌ను వినియోగించనున్నారు. గత ఏడాది 430 వినియోగించగా, వాటిలో 130 మాత్రమే బాగా పని చేస్తున్నాయి. మిగతా 300 మిషన్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటి స్థానంలో కొత్తవాటిని తెప్పిస్తున్నారు. వీటికి నెట్ కనెక్షన్ నిమిత్తం బీఎస్‌ఎన్‌ఎల్‌కు వ్యవసాయ శాఖ డబ్బు చెల్లించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నందున వారికి ట్యాబ్స్ ఇస్తున్నారు.గతేడాది నాణ్యతలేని విత్తన కాయలను సరఫరా సంస్థలు కొన్ని పంపించడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ఈసారి నాణ్యమైన విత్తనాన్ని అందించాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 6.40 లక్షల హెక్టార్లలో మెట్ట ప్రాంతంలో వేరుశెనగ పంట సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. గతేడాది వేరుశెనగ సాగును తగ్గించాలని రైతుల్లో అవగాహన కల్పిస్తూ, 6.05 లక్ష్ల హెక్టార్లకు మించి సాగు కానీకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 3.34 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది హంద్రీ నీవా, హెచ్చెల్సీ నుంచి నీటిని తరలించి చెరువులు నింపారు. దీంతో ఈసారి గత ఏడాది కన్నా 6వేల హెక్టార్లు అదనంగా సాగయ్యే అవకాశం ఉందని భావించి, 5 లక్షల క్వింటాళ్ల మేరకు విత్తన వేరుశనగ అవసరమవుతుందని ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయ శాఖ నివేదిక పంపింది. ప్రస్తుతం 3.40 లక్షల క్వింటాళ్లకు గానూ 1.83 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు ప్రాసెసింగ్ పూర్తయింది. దశలవారీగా 51 మండల కేంద్రాలకు విత్తన కాయల్ని అక్కడి గోడౌన్లకు చేర్చారు. రాయదుర్గం మండలానికి 5,816 క్వింటాళ్లు, గోరంట్ల-3,172, పామిడి-2,772, ఆత్మకూరు-2,595, గుంతకల్లు-2,267 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేశారు. సేకరణ ధర కిలో రూ.61, క్వింటా 6,100 కాగా, ఇందులో 40శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ మేరకు రూ. 2,440 సబ్సిడీ పోనూ, రైతులు రూ.3,660 చెల్లించాల్సి ఉంది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 30 కేజీల విత్తన కాయల బ్యాగులు 4 వరకు ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సీడ్స్ 23 మండలాల్లో 33,398 క్వింటాళ్లు పంపిణీ చేయనుంది. ఇంకా 6,682 క్వింటాళ్ల బఫర్ స్టాక్ ఉంది. ఆయిల్‌ఫెడ్ 25 మండలాల్లో 25,545 క్వింటాళ్ల పంపిణీ చేయనుంది. వాసన్ కంపెనీ 3 మండలాల్లో పూర్తిగా 11,556 క్వింటాళ్లు పంపిణీ బాధ్యతలు తీసుకోగా, సుమారు 28 మండలాల్లో పాక్షికంగా విత్తన పంపిణీలో భాగస్వామ్యం వహించనుంది. ఈ కంపెనీ పంపిణీ చేసే విత్తన కాయల ధర క్వింటా రూ.5,920 కాగా, రూ.3,552 నాన్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవైపు విత్తన పంపిణీ ప్రారంభం కాగానే, మరోవైపు ఇంకా 1.56 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు ప్రాసిసెంగ్ కొనసాగుతూ ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా కడప, కర్నూలులో మరో లక్ష క్వింటాళ్ల విత్తన కాయల సేకరణ పూర్తి చేసి సిద్ధంగా ఉంచామన్నారు. కాగా 58 మండలాల్లో వ్యవసాయ శాఖకు చెందిన గోడన్లలో విత్తన కాయలు పంపిణీకి సిద్ధం చేశారు. మిగతా చోట్ల కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్లలో కేంద్రాల ఏర్పాటుకు డీఈఓ, కళాశాలల యాజమాన్యాల అనుమతికి లేఖలు పంపింది. జిల్లావ్యాప్తంగా అన్ని పంపిణీ కేంద్రాలను రెండు, మూడు రోజుల్లో నోటిఫై చేయనున్నారు. అలాగే విత్తన పంపిణీ తేదీలను కలెక్టర్ ఆదేశాల మేరకు నేడో, రేపో ఖరారు చేయడానికి వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విత్తన కాయలతో పాటు పంపిణీ చేసేందుకు విత్తనశుద్ధి మందు ట్రైకో డెర్మావిరిడీ 2,450 క్వింటాళ్లు తెప్పించనున్నారు. ఇప్పటికే 2,232 క్వింటాళ్లు సిద్ధంగా ఉంది. నవధాన్యాలు 2 లక్షల కిట్స్,వీటితో పాటు అదనంగా 5వేల క్వింటాళ్ల కంది విత్తనాలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ ప్రారంభం నాటికి 2 లక్షల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచనున్నారు.
Tags: Supply of seed by app

వహ్వా సబ్జా!

Date:30/05/2018
కరీంనగర్ ముచ్చట్లు:
వేసవికాలంలో మే చివరి వారం అంటే అందరికీ హడలే. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. ఉష్ణతాపాన్ని జయించేందుకు ప్రజలు ఎక్కువగా మంచినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు సేవిస్తుండాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయినప్పటికీ వేడెక్కిపోతున్న వాతావరణం ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటోంది. ఇదిలాఉంటే.. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సబ్జాలతో చేసిన పానియాలు మంచివని పలువురు అంటున్నారు. చౌకగానే లభించే ఈ గింజలు అద్భుతమైన శక్తిని ఉత్తేజాన్ని నింపుతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సబ్జాలు దాహార్తిని తీర్చగలవు. డీ హైడ్రేషన్‌ తగ్గించగలవు. శరీర ఉష్ణోగ్రతలు, వాంతులు, విరోచనాలు శ్వాస కోస వ్యాధులు, అజీర్తి, మధుమేహాన్ని సైతం అదుపులో ఉంచగలవు. అంతేకాక హానికరమైన విషక్రిములు కడుపులో చేరకుండ నివారించగలవు. కడుపులో మంట, ఆస్థమా, గొంతునొప్పి దరిచేయనీయవని నిపుణులు అంటున్నారు. అందుకే సబ్జా గింజలను ఏదైనా పండ్ల రసాలతో కలసి తాగాలని సూచిస్తున్నారు. ఇక సబ్జా గింజలు మహిళలకు ఆరోగ్యప్రదాయనే అని అంటున్నారు ఆహార నిపుణులు. అధిక బరువుతో బాధపడేవారికి సబ్జా నీరు తాగితే మంచి ఫలితముంటుందని చెప్తున్నారు. సబ్జా పానీయం బరువును తగ్గించడమేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుందట. శరీర జీవక్రియలను మరింత మెరుగుపరుస్తుందట. సబ్జాలో ఫైబర్ ఎక్కువ. ఇదిలాఉంటే సబ్జాలను అల్లం, తేనెతో కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులనూ నివారిస్తాయట. ఈ నల్లటి సీడ్స్ లో చర్మాన్ని అందంగా ఉంచి విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది. సబ్జా గింజల ఉపయోగాలపై ఇటీవలిగా ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది. దీంతో వీటి వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి అప్పుడప్పుడు తయారు చేసే శీతలపానీయాల్లో వాడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ప్రతి పానీయంలోనూ సబ్జాలను చేర్చుకుంటున్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరూ సబ్జాలను ఆహారంలో భాగంగా చేర్చుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Tags: VAVA SUBJA!

వంతెన వెతలు..

Date:30/05/2018
చిత్తూరు ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం ఉన్న రామసేతు వంతెన 95 ఏళ్లనాటి చరిత్రకు సాక్ష్యమని స్థానికులు అంటుంటారు. ఈ అరుదైన వంతెన రాజా పానుగంటి వంశ పట్టుదలకు, పరాక్రమానికి, ప్రతిష్టకు నిదర్శనమని చెప్తుంటారు. శతజయంతి ఉత్సవాల వైపు పరుగులు పెడుతున్న ఈ వంతెన పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని అంతా అంటున్నారు. ప్రజల రాకపోకలకు వారధిగా నిలిచిన రామసేతు వంతెన శిథిలావస్థకు చేరుకుందని వాపోతున్నారు. దశాబ్దాల తరబడి ప్రజారవాణాలో కీలకంగా ఉన్న ఈ వారధిని ప్రస్తుతం వినియోగించడం లేదు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల వంతెన పునరుద్ధరణకు పెద్ద ఎత్తున తీసుకున్న చర్యలే లేవని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. రాజా పానుగంటి రామరాయనింగర్‌ 1923 మార్చి 31వ తేదీనాటికి వంతెన కట్టి తీరుతానని ఓ సందర్భంలో బ్రిటీష్ వారితో శపథం చేశారట. ఆయన ఈ శపథం చేసిన రోజు 1922 మార్చి 31. చెప్పినట్టే ఆయన ఏడాదిలో ఈ వంతెన కట్టించారని స్థానికులు చెప్తారు. ఆయన పట్టుదలతో వారధి నిర్మించి అనుకున్న తేదీకే ప్రారంభించారు. అప్పట్లో రూ.3.58 లక్షల వ్యయంతో ఈ వంతెనను పూర్తి చేయడం గమనార్హం. స్థానికంగా రవాణా కష్టాలు తొలగించేందుకే ఆయన నాటి కాలంలో ఇంత పెద్ద మొత్తం వెచ్చించారు. మూడున్నర లక్షల రూపాయలంటే ఇప్పట్లో చిన్నమొత్తమే అయినా 1920ల్లో అంటే అది రూ.కోట్లతోనే సమానం.1923లో ప్రారంభమైన  రామసేతు వంతెన దాదాపు 90 యేళ్లపాటు ప్రజావసరాలు తీర్చింది. పటిష్టమైన పిల్లర్లు, నాణ్యమైన ఉక్కుతో ఆంగ్లేయులు నిర్మించిన ఈ వారధి స్థానిక రవాణాలో కీలకంగా వ్యవహరించింది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి రాజగోపురం లాగా రామసేతు వంతెన కూడా తలమానికంగా నిలిచింది. రాజు నిర్మించినా రామసేతు వంతెనగా నామకరణం చేయడంతో రామవారధిగా ప్రజలు దీన్ని భావించేవారు. గౌరవించేవారు. అయితే రాను రాను ఈ వంతెన నిర్లక్ష్యానికి గురైంది. పాలక ప్రభుత్వాలు దీని ఆలనా..పాలనా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఉదాసీనత వల్ల వంతెన పాడైపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని చోట్ల వంతెన బలహీన పడింది. దీంతో భారీ వాహనాలను అనుమతించడంలేదు. మరోవైపు కొత్త వంతెనను నిర్మించారు. ఫలితంగా రామసేతుపై పూర్తిగా వాహనాల రాకపోకలను నిషేధించారు. ద్విచక్రవాహనాలు‌, పాదచారులను మాత్రమే అనుమతిస్తున్నారు. నాటి రాజుల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రామసేతు వంతెన నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. పునరుద్ధరణ చర్యలు తీసుకుంటే ఈ వారధి పటిష్టంగానే ఉంటుంది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి పురాతన ఆస్తి అయిన రామసేతు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Get the bridge ..

కష్టాల ఎదురీ’గీ’త

Date:30/05/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం జిల్లాలో కల్లుగీతపై ఆధారపడ్డ కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గుర్తింపు కార్డులు ఉన్నవారు 15వేల మంది ఉన్నారు. వాస్తవానికి కల్లుగీత ఓటర్లు 8 లక్షల 50వేల మంది ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయసహకారాలు పూర్తి స్థాయిలో అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 2,200 సొసైటీలు ఉన్నాయి. 2500లు పిఎఫ్‌టిలు ఉన్నాయి. గీత వృత్తినే నమ్ముకొని ఐదు లక్షల కుటుంబాలు జీవనాధారంగా జీవిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వారికి 350 జిఒ ప్రకారం ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలి. కానీ అరకొరగా మంజూరు చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అనాధిగా కులవృత్తినే నమ్ముకున్నతమ బతుకులు దినదినగండంగా మారిందని  కల్లుగీత కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేసవి కాలంలో మాత్రమే ఉపాధి లభించే కల్లు గీతతో కుటుంబపోషణ పెనుభారంగా మారిందని అంటున్నారు. ఏడాది అంతటా పూట గడవక పస్తులు ఉండాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తంగా జిల్లాలో కల్లుగీత కార్మికులు అభివృద్ధికి దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది.వేసవి కాలంలో 3, 4 నెలలు కల్లు లభించే సమయంలోనే గీత కార్మికులకు ఎంతోకొంత దక్కుతుంది. మిగిలిన కాలమంతా వారికి కష్టాలే. కల్లు వ్యాపారంలో భార్యాభర్తలిద్దరూ రోజంతా కష్టపడితే రూ.300 మాత్రమే వస్తోంది. దీంతో కుటుంబాలు నెట్టుకురావడం భారంగా మారిందని కార్మికులు అంటున్నారు. రైతుల పొలాల్లోని తాటి చెట్లను గీత కార్మికులు ఏడాదికి గీతకు లీజుకు తీసుకుంటారు. చెట్టుకు రూ.300 వరకు లీజు చెల్లిస్తారు. ఈ చెట్టు నుంచి తీసిన కల్లును విక్రయించుకోవాలంటే ఎక్సైజ్‌శాఖకు శిస్తు చెల్లించాలి. ఎంతో కాలంగా శిస్తు రద్దు చేయాలని గీత కార్మికులు కోరుతున్నా ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదని కార్మికులు చెప్తున్నారు. ఇలా లీజులు, శిస్తులు చెల్లించగా చేతిలో మిగులుతున్నది కొద్ది మొత్తమే అని వాపోతున్నారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజు గడవడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. వృత్తినే నమ్ముకుంటే పొట్ట కూటి కోసం కష్టాలు తప్పడం లేదని అందుకే కూలీ పనులకు వెళ్తున్నామని పలువురు చెప్తున్నారు. మరోవైపు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కిందపడి గాయపడితే వైద్యసాయం పొందేందుకూ కార్మికులు నానాపాట్లు పడుతున్నారు. అధికారులు అనేక షరతులు పెడుతుండడం వల్లే ఈ సమస్య అని అంటున్నారు. ఇక ప్రాణాలు పోతే దిక్కేలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి గీత కార్మికుల జీవితాలు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags: Troubleshooting’Get

  తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఒంటరి పోరే

Date:30/05/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏపీలోనూ, తెలంగాణలోనూ ఎవరితో పొత్తులతో చంద్రబాబు వెళతారా? అన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. మహానాడులో ఎక్కడ నలుగురు కలిసినా దీని గురించే చర్చించుకోవటం విన్పించింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నెగ్గుకు రాగలదా? అన్న సందేహం కూడా తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా తెలంగాణ, ఏపీకి చెందిన ముఖ్య నేతలు కలుసుకున్నప్పుడు ఇదే చర్చించుకుంటూ కన్పించారు.ఆంధ్రప్రదేశ్ లో ఈసారి తెలుగుదేశం పార్టీది విచిత్రమైన పరిస్థితి. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆ ఛాన్స్ లేదు. బీజేపీతో ఇటీవలే కటీఫ్ చెప్పేయడంతో ఆ పార్టీనే ప్రధాన శత్రువుగా పరిగణిస్తోంది. కాంగ్రెస్ తో తొలి నుంచి కొంత సఖ్యతగా ఉన్నా రాష్ట్ర విభజన చేసిన పార్టీతో పెట్టుకుంటే అది తెలుగుదేశం పార్టీకి దెబ్బేనన్నది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ పైన ఏపీ ప్రజలుకోపంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లే ఛాన్స్ లేదు. జనసేన కూడా తనకు మద్దతు తెలపదని తేలిపోయింది.జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీనే తన టార్గెట్ గా పెట్టుకున్నారు. సో…జనసేనపై ఆ ఆశలు లేవు. ఇక మిగిలింది కమ్యునిస్టులే.కమ్యునిస్టులు ఇప్పటి వరకూ ఎటూ తేల్చకపోయినా… వారు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు తో కలసి వెళ్లినందున తమకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని కామ్రేడ్లు భావిస్తున్నారు. అందువల్ల ఏపీలో ఖచ్చితంగా ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. చంద్రబాబు కూడా మానసికంగా అందుకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. తెలంగాణలోనూ చంద్రబాబు పార్టీది అదే పరిస్థితి. తెలంగాణలో టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నా చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పార్టీపై పడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే పార్టీతో జత కడితే తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా భావిస్తున్నారు. ఇక బీజేపీతో కూడా తెలంగాణలో రాంరాం చెప్పేశారు. ఇక మిగిలింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే. అయితే కేసీఆర్ కు కొంత సానుకూలత వాతావరణం కన్పిస్తోంది. చంద్రబాబు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయినా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశంలో బలమైన నేతలు కారు పార్టీలోకి వచ్చేశారు. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాపార్టీతో పొత్తుపెట్టుకున్నారన్న అపప్రథను తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ కూడా పొత్తు విషయమై ఆలోచించి అడుగులేస్తుందంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
TAgs:TDP is alone in Telugu states