అనుకొన్నదక్కటి…అయినదొక్కటి…

-జంప్ జిలానీలకు కొత్త టెన్షన్
Date:24/04/2018
విజయవాడ ముచ్చట్లు:
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి…అంటూ హమ్ చేస్తున్నారు…జంప్ జిలానీలు.. ఇప్పుడు రాజకీయాల్లో జంపింగ్‌లు కామ‌న్ అయిపోయాయి. ఇక పార్టీ మారిన చాలా మంది ఎమెల్యేలు ఇప్పుడు ఎందుకు మారామా ? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. జ‌మ్మల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డి, ఆళ్లగ‌డ్డలో మంత్రి అఖిల వ‌ర్సెస్ ఏవి.సుబ్బారెడ్డి, బొబ్బిలిలో మంత్రి సుజ‌య్ వ‌ర్సెస్ తెంటు జ‌య‌ప్రకాష్‌, అద్దంకిలో గొట్టిపాటి వ‌ర్సెస్ క‌ర‌ణం, కందుకూరులో పోతుల రామారావు వ‌ర్సెస్ దివి శివ‌రాం ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు చివ‌ర‌కు మంత్రులు అయినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్కబెట్టుకోవాల‌ని అనుకున్నట్టుగా రాజ‌కీయ నేత‌లు కూడా త‌మ‌ను ప్రజ‌లు గెలిపించి చంక‌నెత్తుకున్నప్పుడే ఏదైనా పోగేసుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విప‌క్ష పార్టీలో గెలుపొందినా.. వెంట‌నే అధికార పార్టీ అభివృద్ధిని మెచ్చుకుంటూ.. ఆ పార్టీ జెండాను క‌ప్పుకొని అజెండా అమ‌లు చేస్తున్నారు. ఇప్పటికి ఇలా 23 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు.ఈ క్రమంలోనే టీడీపీని బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేయాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతుంటే కొంత మంది పార్టీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆయ‌న అంటున్నారు. త‌న‌ నియోజకవర్గం ఎస్సీ అయినప్పటికీ అగ్రవర్ణాల పెత్తనం ఏమిటని ఆయన సొంత పార్టీ మాజీ నేత‌ల‌పైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే ఉండగానే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త వ్యక్తులను ఎందుకు తీసుకువస్తున్నారని, ఇలా చేయడం వల్ల నేను పార్టీలో చురుకుగా ఎలా పాల్గొనాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి టీడీపీ నాయకులు సైతం కులవివక్ష చూపుతూ ఎస్సీలను అణగదొక్కు తున్నారన్నారు. వీరంద‌రికీ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతోందా? అధికార పార్టీలో గౌర‌వం ద‌క్కుతోందా? అంటే మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగానే ఉంది. కొంద‌రు బ‌య‌ట‌ప‌డుతున్నారు.. మ‌రికొంద‌రు మౌనంగా భ‌రిస్తున్నారు. జంప్ చేసి టీడీపీలోకి వ‌చ్చిన వారికి ఆ పార్టీ సీనియ‌ర్ల నుంచి గౌర‌వం ల‌భించ‌క‌పోగా.. అడుగడుగునా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి.ఇప్పుడు ఇలాంటి వారిలో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చకు వ‌చ్చిన బ‌ద్వేలు ఎమ్మెల్యే.. జ‌య‌రాములు అంశం. ఈయ‌న 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. అయితే, బాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న సైకిలెక్కారు. ఇది ఈజీగానే జ‌రిగిపోయిం ది. అయితే, స్థానిక టీడీపీ నేత‌ల‌తో స‌మ‌న్వయం చేసుకోవ‌డమే ఇప్పుడు ఈయ‌న‌కు స‌ముద్రాన్ని ఈదినంత క‌ష్టంగా మారింది. టీడీపీ సీనియ‌ర్లే ఈయ‌న‌కు శ‌త్రువులుగా మారిపోయారు. ఈయ‌న‌కు తెలియ‌కుండానే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసేస్తున్నారు. దీంతో గ‌త కొన్నాళ్లుగా వాళ్ల వైఖ‌రిపై రాములు తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో చేరినప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు ఇంటింటికీ తెలుగుదేశం, దళితతేజం, ధర్మదీక్ష వంటి కార్యక్రమాలను ఎంతో విజయవంతం చేశానని ఆయ‌న అంటున్నారు.అదిష్టానం పిలుపు మేరకు బద్వేలులో ధర్మదీక్ష చేపట్టడం జరిగిందని, అయితే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పోటీగా మరో శిబిరం ఏర్పాటుచేసి దీక్షలు చేపట్టడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో అడ్డుతగులు తూ అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డబ్బున్న నాయకులు, పార్టీ బలోపేతానికి కృషి చేయాలే తప్ప, పార్టీ నాశనానికి కృషి చేయకూడదని ఆయన అన్నారు. ఎవరు లంచాలు తీసుకునేది, ఈ ప్రాంత ప్రజలకు తెలుసన్నారు.ప్రణాళికా బద్దంగా పార్టీ నాశనం చేయాలన్న లక్ష్యంతో కొంత మంది కంక‌ణం కట్టుకున్నారని ఆగ్రహించారు. అధిష్టానం దృష్టిసారించి తగున్యాయం చేయకపోతే, ఇలాగే అగ్రవర్ణాల పెత్తనం సాగిస్తూ, నన్ను అణగతొక్కాలని చూస్తే రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడే ప్రసక్తేలేదన్నారు. ఇక జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్ లాంటి వాళ్లు కూడా విజ‌య‌మ్మకే స‌పోర్ట్ చేస్తుండ‌డంతో జ‌య‌రాములు మ‌రీ డ‌మ్మీగా మారిపోయారు. ఈ రెండు వ‌ర్గాల‌కు తోడుగా ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన విజ‌య‌జ్యోతి మ‌రో వ‌ర్గంగా ఉన్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే… జ‌య‌రాములును సొంత టీడీపీ నేత‌లే ఎంత భ్రష్టు ప‌ట్టించారో అర్ధమ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు ఎలా చెక్ పెడ‌తారో చూడాలి.
Tags: Ayinadokkati anukonnadakkati … …

కాపు సామాజిక వర్గం కోసం జే టీవీ

Date:24/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పవన్ కు మద్దతుగా నిలిచేందుకు ఓ టీవీ చానల్ పెట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన వాణి బలంగా వినిపించేందుకు దాన్నిఉపయోగించుకోనున్నారు. ఇందుకు తమదైన చానల్ ఉంటే మంచిదని ఆలోచించారు. అందుకే నెంబర్ వన్ టీవీలో పని చేసిన చాలా మంది కొత్తగా పెట్టిన టీవీ చానల్ లో సభ్యులుగా ఉన్నారట. దానిపై దృష్టి సారించారు పవన్. మాజీ ముఖ్యమంత్రి ఒకరి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినా ఇంకా బాలరిష్టాలను ఎదుర్కోంటోంది ఆ చానల్. ఎక్కడా ఆ టీవీ చానల్ ప్రసారం కావడం లేదు. బీజేపీకి చెందిన నేత దీనికి ఛైర్మన్ గా ఉన్నారు. ఈ చానల్ లో కాపు సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ఆ చానల్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. కొత్తగా చానల్ పెట్టడం కంటే ఇప్పుడున్న చానల్స్ లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపారని తెలుస్తోంది.సొంత మీడియాను ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ తో వ్యవహరించిన పవన్ కళ్యాణ్… ప్రస్తుతం ఉన్న టాప్ మీడియా సంస్థలన్నీ తనకు వ్యతిరేకమే అనే భావనను ప్రజల్లో కలిగించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పుడే రంగంలోకి వస్తున్న చానల్ వైపు ఆయన ఆసక్తి చూపడం వెనుక రాజకీయ కారణముందంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. కోట్ల రూపాయాలను ఆ చానల్ లో పెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు అంగీకార పత్రాలపై సంతకాలు చేసుకునేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని మీడియా ఛానల్స్ ను బహిష్కరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దాని వెనుక కొత్త చానల్ తనకు అండగా ఉంటుందనే ఆలోచనే ఇందుకు కారణమంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా మాట్లాడాడు. మీడియా వారు ఎవరూ ఆ విషయంలో వారిని సమర్థించలేదు. పవన్ కల్యాణ్ కే మద్దతుగా నిలిచారు. వర్మ విషయంలో గతంలో ఎన్నడూ పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్… ఈ సారి అతిగా స్పందించడం వెనుక పెద్ద కారణముంది. వర్మ సాకుతో ఆయన మీడియాను తిట్టడం ప్రారంభించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తిట్లు సాధారణం. అవన్నీ భరిస్తేనే రాజకీయం చేయగలుగుతారు. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు.  ఇందుకు కొత్తగా ప్రారంభించే చానల్ వారు ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారట.
ప్రస్తుతం రన్నింగ్ లోనే ఉన్న ఒక ఛానల్ ను కొనుగోలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్నారు. దాని పేరు మార్చి జనసేన అనే అర్థం వచ్చేలా జేటీవీ అనే పేరును కూడా పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని పలువురు పవన్ సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు. సొంత ఛానల్ ప్రమోషన్ కోసమే పవన్ కళ్యాణ్ ముందస్తు డ్రామాలు మొదలుపెట్టారేమో అనే వాదన లేకపోలేదు. సొంత మీడియా ఉన్నవారంతా… ఆ మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే విషయాన్ని పవన్ గ్రహించలేకపోతున్నారు. గతంలో స్టూడియో-ఎన్ యాజమాన్య హక్కులను తీసుకున్న టీడీపీ ఆ తర్వాత వెనక్కు తగ్గింది. మిగతా చానల్స్ పెద్దగా తమకు ప్రచారం కల్పించక పోవడమే వారి వైఖరి మార్పుకు కారణమైంది. విషయం ఏదైనా త్వరలోనే జనసేన చానల్ రంగంలోకి రాబోతుందనేది వాస్తవం.
Tags: Jay TV for social community

మహిళా రైతు బజార్ కు ఆదరణ

Date:24/04/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
గాజువాకలో 2012లో మహిళా రైతుల కోసం రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళా రైతుబజారు ఏర్పాటు చేశారు. దీనికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దీన్ని 2000 సంవత్సరంలో 90 సెంట్లు విస్తీర్ణంలో ఏర్పాటు చేసినా మామూలు బజారుగానే కొనసాగింది. తరువాత కాలంలో ప్రభుత్వం దీన్ని మహిళా రైతు బజారుగా ప్రకటించింది. అప్పటి నుంచి మహిళా రైతులే అమ్మకాలు చేస్తున్నారు. కోటపాడు, నర్సీపట్నం, సబ్బవరం, కశింకోట, పెందుర్తి, సంతపాలెం, కె.కోటపాడుల నుంచి మహిళా రైతులు ఉదయం 5 గంటలకు చేరుకొని రోజంతా అమ్మకాలు సాగిస్తున్నారు. మొత్తం 43 మంది రైతులు ఇలా జీవనోపాధి పొందుతున్నారు.  బజారులో అమ్మకందారులంతా మహిళలే. ఉదయం కూరగాయల సరుకు తెచ్చుకున్నది మొదలు రాత్రి వరకూ వారే దుకాణాల్లో అన్ని పనులూ చేసుకుంటారు. నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకే విక్రయిస్తారు. అందుకే పారిశ్రామిక ప్రాంత వాసులకు ఆ మార్కెట్‌ అంటే రోజురోజుకూ మరింత ఇష్టం ఏర్పడుతోంది.  రైతు బజారుకు మమూలు రోజుల్లో 1100 మంది కాయగూరలు కొనుగోలు చేయడానికి వస్తారు. పండగలు, సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య 2 వేలకు పైచిలుకు చేరుతుంది. రోజుకు 70 క్వింటాల కాయగూరలు అమ్మకాలు చేస్తారు. నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తుండటంతో పలువురు మన్ననలు ఈ బజారుకు దక్కుతున్నాయి.
ప్రభుత్వం వీరి దగ్గర నుంచి అమ్మకానికి సంబంధించి ఎలాంటి రుసుమూ వసూలు చేయడం లేదు. అందుకే బయట ప్రాంతాలకన్నా కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ రైతు బజారులో అన్ని రకాల కాయగూరలు లభిస్తాయన్నది అందరి నమ్మకం. అందుకే ఏ చిన్న ఫంక్షన్‌ జరిగినా చటుక్కున ఇక్కడకు వచ్చి ముందుగానే కొంతమంది ఆర్డర్లు ఇచ్చేస్తుంటారు. కొత్త గాజువాక, పాత గాజువాక చినగంట్యాడ, శ్రీనగర్‌, పంతులుగారి మేడ, జోగవానిపాలెం, ఇందిరాకాలనీ, సమతానగర్‌, సనత్‌నగర్‌, అజిమాబాద్‌ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉండడం వల్ల ఈ బజారుకు తాకిడి ఎక్కువుగా ఉంటుంది.
Tags: Women’s Peasant Bazaar

వెయ్యికు గాను 670 పంచాయితీల్లో తాగు నీటి సమస్య

Date:24/04/2018
అనంతపురం ముచ్చట్లు:
అనంత’ భయంకరమైన కరువుతో అల్లాడిపోతోంది.జిల్లాలో 1,003 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 678 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇందులో 357గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటి సమస్య మరింత జఠిలమైంది. ప్రస్తుతం 26 మీటర్లకు భూగర్భజల నీటిమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఈ స్థాయిలో నీటిమట్టం మరే జిల్లాలో పడిపోలేదు. జిల్లాలో 2.11లక్షల వ్యవసాయబోర్లు ఉన్నాయి. ఇందులో 87,574బోర్లు ఎండిపోయాయి. విధిలేని పరిస్థితుల్లో రైతులు పొలాల్లోని మోటర్లను ఇంటికి చేర్చారు. నీళ్లు లేక 10వేల హెక్టార్లలో మల్బరీ, 5వేల హెక్టార్లలో చీనీ, బొప్పాయి, అరటి లాంటి పండ్లతోటలు ఎండిపోయాయి. గ్రామాల్లో పశువులకూ తాగేందుకు నీరు కరువవుతోంది. పశువుల దప్పిక తీర్చేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని రైతులంతా ఏకమై ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి దప్పిక తీరుస్తున్నారు. జిల్లాలో 40.57లక్షల జనాభా ఉంది. ఇందులో 7.72లక్షల మేర జాబ్‌కార్డులు ఉండగా, 40 శాతం మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు  డ్వామా అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబానికి 150రోజులు పని కల్పిస్తామంటున్నారు. అయితే జిల్లాలో 150రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు వందకు మించి లేవు. కుటుంబంలో నలుగురు ఉంటే 25 రోజుల్లో వీరికి కేటాయించిన ‘పని’ పూర్తి అయిపోతుంది. ఆపై ఉపాధి లభ్యం కాక వలసలు వెళ్లాల్సి వస్తోంది.  ప్రస్తుతం 4.87లక్షల మంది వలసెళ్లినట్లు ఓ స్వచ్ఛందసంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉపాధి లేక రైతుకూలీలతో పాటు రైతులు కూడా వలసెళ్లుతున్నారు. కేరళలో కొందరు రైతులు భిక్షాటన చేస్తున్నారు. వాస్తవ పరిస్థితిని పక్కదారి పట్టిస్తూ అధిక డబ్బుల కోసం వలసెళుతున్నారంటూ మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా మంత్రులు వ్యాఖ్యానించారంటే ‘అనంత’ రైతులపై వీరికి ఎంత మేర బాధ్యత ఉందో ఇట్టే  అర్థమైపోతోంది.ఎంతలా అంటే గత 19 ఏళ్లలో కనీవినీ ఎరుగుని రీతిలో కరువు కమ్మేసింది. వర్షపుచుక్కలేదు…పచ్చటి గడ్డిలేదు.. బోరులో నీటి చెమ్మలేదు…బతికేందుకు కూలిపని లేదు…మొత్తం మీద జిల్లాలో రైతులు…రైతు కూలీలు తినేందుకు ముద్ద లేదు. దీంతో పొట్టనింపుకునేందుకు లక్షలాదిమంది వలసబాట పట్టారు. ఇదిలాగే కొనసాగితే అనంత….ఆకలిచావులకు నిలయంగా మారే ప్రమాదం ఉంది.ఈ ఏడాది జిల్లాలో 15.15లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 3–4లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. వేరుశనగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తక్కిన పంటల్లో కూడా కంది, పత్తితో పాటు  దాదాపు అన్ని పంటలదీ అదే పరిస్థితి. వరుసగా మూడేళ్లుగా పంట నష్టాలు చోటు చేసుకోవడంతో అన్నదాతలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ ఏడాది పరిస్థితి మరీ భయంకరంగా మారడంతో ‘వ్యవసాయం’ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. పంట కోసం చేసిన అప్పులు తీర్చడం తలకు మించిన భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకునేవాళ్లు, పిల్లల చదువుల ఫీజులు కట్టలేక మధ్యలోనే కళాశాలలు మాన్పించిన వారు. దీర్ఘకాలిక జబ్బులకు చికిత్స కూడా చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వెరసి ఈ సమస్యలను అధిగమించలేక, అవమాన భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు తెగుస్తున్నారు.
Tags: Drinking water problem in 670 panchayats per thousand

దళారుల మధ్య నలిగిపోతున్న రైతులు

Date:24/04/2018
కాకినాడ ముచ్చట్లు:
అనావృష్టిని అధిగమించి.. ఆరుగాలం శ్రమించి.. డెల్టా రైతులు రబీ వరి సాగు చేశారు. మంచి ధరకు అమ్ముకుంటే లాభాలు కళ్లజూడవచ్చనుకున్నారు. ఏలేరు పరిధిలో నీటి ఎద్దడి వల్ల పోయిన పంట పోగా దక్కిన నాలుగు గింజలతో కనీసం పెట్టుబడులైనా పొందాలని ఆశించారు. కానీ వారి ఆశలను అటు ప్రభుత్వం.. ఇటు దళారులు, ధాన్యం వ్యాపారులు వమ్ము చేశారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470 కాగా, 75 కేజీల బస్తా రూ.1,102 చొప్పున, గ్రేడ్‌-ఎ రకం బస్తా రూ.1,132 చేసి కొనుగోలు చేయాలి. కానీ ఏలేరు, డెల్టాల్లోని పలుచోట్ల సాధారణ రకం బస్తా ధాన్యాన్ని వ్యాపారులు కేవలం రూ.900 నుంచి రూ.950 చేసి మాత్రమే కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.250 చొప్పున ఎకరాకు రూ.9 వేల వరకూ నష్టపోయే దుస్థితి నెలకొంది. దీంతో కొంతమంది రైతులు అమ్మకాలు నిలిపి కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచేశారు. ధాన్యం వ్యాపారులు, దళారుల వద్ద ముందస్తు అప్పులు చేసిన రైతులు మాత్రం.. వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. యంత్రాల ద్వారా కోత కారణంగా ధాన్యంలో తేమ (నెమ్ము) 25 శాతం పైబడి ఉందని వంక పెడుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు.కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో.. లాభాల మాట దేవుడెరుగు.. రైతులు నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది.జిల్లాలో సుమారు 4.75 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది. ఇందులో గోదావరి డెల్టా పరిధిలో 4 లక్షల ఎకరాలు కాగా, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. రెండుచోట్లా కలిపి సుమారు 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ఏలేరులో నీటి ఎద్దడి వల్ల సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రైతులు రూ.17 కోట్ల మేర నష్టపోయారు. డెల్టాలో ఎకరాకు సగటున 48 బస్తాల దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 55 నుంచి 60 బస్తాల దిగుబడి కూడా రావడంతో లాభాలు పొందవచ్చని రైతులు ఆశించారు. కానీ ధాన్యం అమ్మకాల వద్దకు వచ్చేసరికి వారు నిలువునా మోసపోతున్నారు.జిల్లాలో 285 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ మూడో వంతు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు. పైగా 17 శాతం తేమ వంటి నిబంధనల కారణంగా తెరిచిన ఆ కొద్దిపాటి కేంద్రాలవైపు రైతులు కన్నెత్తి కూడా చూడడం లేదు.
Tags: Farmers cracked between the Dalits

తిరుమలలో రెచ్చి పొతున్న ఇంటి దొంగలు

-అందిన కాడికి దోచేయ్
Date:24/04/2018
తిరుమల ముచ్చట్లు:
తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడరు. అక్రమ వాటాల శ్రీవారి లడ్డూ అక్రమ విక్రయాల్లో ఇంటి దొంగలదే హవా. కౌంటర్‌ సిబ్బంది నుంచి ట్రే లిఫ్టర్ల వరకు ఎక్కువ మంది ఈ అక్రమాల్లో వాటాదారులే. కొందరు నేరుగా భక్తులకు లడ్డూలు విక్రయిస్తుంటారు. మరికొందరు దళారులతో ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. .టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఇంటిదొంగల విషయంలో చోద్యం చూస్తోందిఆలయ సమీప ప్రాంతాల్లో సుమారు 200మందికిపైగా లడ్డూ దళారులు అక్రమ విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం. దీనికి కారకులైన ఇంటిదొంగల్ని ఏరివేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. టీటీడీ ఈవో సింఘాల్, జేఈవో కేఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాలతో కొన్నాళ్లు తగ్గినా మళ్లీ లడ్డూల అక్రమ దందా పుంజుకుంది. ఈ వేసవి రద్దీలో కాసులు దండుకోవాలని ఇంటిదొంగలు, దళారులు నిమగ్నమైనట్లు సమాచారం.భక్తుల అవసరాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. లడ్డూ దళారులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్‌ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, లడ్డూ ట్రే లిఫ్టర్లు.. ఇలా సామూహికంగా కలసిపోయి అక్రమ దందాను నడిపిస్తున్నారు. భక్తులకు అందాల్సిన లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తున్నారు.
కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లకు ఒక లడ్డూ ఉచితంగా పొందవచ్చు. అలాంటి టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు అందజేస్తుంటారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్‌ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పద్ధతి ప్రకారం స్కానింగ్‌ చేస్తారు. వాటిని వెలుపల ట్రేలిఫ్టర్లు దళారులకు అందజేస్తారు. కాలిబాట భక్తులకు రూ.20 రెండు లడ్డూల సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్ధతి ప్రకారమే వెలుపల దళారులకు అందజేస్తారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు.రోజూ 72 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీరికోసం టీటీడీ రోజూ 3 లక్షల లడ్డూలు తయారుచేసి విక్రయిస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఒక్కొక్కరికి 4 (రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), కాలిబాట భక్తులకు ఒకరికి 5 (ఒకటి ఉచితం, రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), రూ.300 టికెట్ల భక్తులకు ఒకరికి 2, వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల భక్తులకు ఒకరికి 2, వివిధ దర్శన టికెట్లతోపాటు అదనపు లడ్డూల కోసం రూ.25 నగదు చెల్లించిన వారికి 2 నుంచి 6 లడ్డూలు పొందవచ్చు. టీటీడీ తయారు చేసే లడ్డూలు భక్తులకు చాలడం లేదు. భక్తులు బయటవ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.ఓ లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.35 దాకా ఖర్చవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తోంది. కాలిబాటతోపాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. కాలిబాటలో వచ్చిన భక్తులకు ఒకరికి ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో దాదాపు 20 శాతం వరకు దొడ్డిదారిలో తరలివెళుతున్నట్టు విమర్శలున్నాయి.
Tags: House robbers

అధికారులకు అభినందించిన మంత్రి కాలవ

Date:23/04/2018
అనంతపురం ముచ్చట్లు:
రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలంలో జరిగిన “మీకోసం ఫిర్యాదుల దినోత్సవం” లో మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ రోజు జిల్లాకు మంచి రోజు..అత్యంత మారుమూల ప్రాంతమైన కనేకల్ కు తరలివచ్చి ప్రజల నుండి సమస్యలను స్వీకరిస్తున్న అధికారులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జరగడం చరిత్రలో మొదటి సారి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం గ్రౌండింగ్ చేసి, ఓడిఎఫ్ గా ప్రకటించుకోవడం సంతోషమని అన్నారు. 5,58,286 ఇళ్లకు గాను, వాటిలో 1,42,132 ఇల్లు మరుగుదొడ్లు కలిగి ఉన్నాయి. మిగిలిన 4,16,154 ఇళ్లకు మరుగుదొడ్లను  నిర్మించుకున్నామని అన్నారు. నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు. ప్రతి అధికారి కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి అధికార గణాన్ని అభినందించారు.
Tags:Cabinet Minister congratulating the authorities

అభిశంసన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య కు లేదు

   –  ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్
Date:23/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించడంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటీసు సరిగా ఉందో లేదో చూడడమే నాయుడు పని అని, నోటీసును తిరస్కరించే అధికారం ఆయనకు లేదని అన్నారు.64 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చిన అభిశంసన నోటీసులో సంతకం చేసిన ఎంపీలకు కచ్చితత్వం లేదంటూ వెంకయ్యనాయుడు సోమవారంనాడు ఆ నోటీసును తిరస్కరించారు. రాజ్యంగ న్యాయనిపుణులతో చర్చించే నిర్ణయం తీసుకున్నట్టు కూడా పేర్కొన్నారు. దీనిపై ప్రశాంత్ భూషణ్ ఓ ట్వీట్‌లో స్పందించారు. నోటీసులో 50 మంది కంటే ఎక్కువ మంది ఎంపీలు సంతకాలు చేశారా లేదా అనేది చూడాలి. ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు. ఆ అధికారం ఆయనకు ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులో కోరారు. అంతేకానీ అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించడం సరైన నిర్ణయం కాదు అని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.కాగా ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి చర్చపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ నేత పీఎల్ పునియా తెలిపారు. నిజంగా ఇది చాలా కీలక అంశం. ఏ కారణంతో నోటీసు తిరస్కరించారో తెలియదు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు న్యాయనిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాయి అని ఆయన చెప్పారు
Tags:Venkiah does not have the authority to reject the notice of the accusation