మారుతున్న వైసీపీ వ్యూహాకర్త..పీకే

Date:20/03/2018
విజయవాడ  ముచ్చట్లు:
వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తానని చెప్పి వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ అలకబూనారా? నెలరోజుల నుంచి జగన్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలందించం లేదా? ఆయన తన టీంలోని ముఖ్యుడికి ఈ బాధ్యతలు అప్పగించారా? అవుననే అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ నెల రోజుల నుంచి వైసీపీ వ్యూహకర్తగా సేవలందించడం లేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ తాను ఇచ్చిన సలహాలు, సూచనలు జగన్ అమలుపర్చకుండా కొందరు అడ్డుకుంటున్నారని అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.ఇండియన్ పొలిటికల్ అనాలిసిస్ ఛైర్మన్ గా ప్రశాంత్ కిషోర్ దేశంలోని అనేక పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతో ప్రశాంత్ కిషోర్ కు రాజకీయపార్టీల్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది. 2019 ఎన్నికలకు బీజేపీకి కూడా ఆయన వ్యూహకర్తగా నియమితులయ్యారని చెబుతున్నారు. అంతకు ముందే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమితులయ్యారు. పార్టీ ప్లీనరీలోనూ జగన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడమే కాకుండా పీకేను పరిచయం కూడా చేశారు.అయితే పీకే టీం గత కొద్దినెలలుగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో రెండుసార్లు సర్వేలు నిర్వహించి నివేదికలను కూడా సమర్పించింది. అక్కడి వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో జగన్ ముందుంచింది. అయితే నెల రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉంటున్నట్లు వస్తున్న వార్తలు ఆ పార్టీలోనే కలకలం రేపుతున్నాయి. వైసీసీ సోషల్ మీడియా వ్యవహారాలను పర్యవేక్షించే జగన్ బంధువు ఒకరు, పార్లమెంటు సభ్యుడు కుమారుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జోక్యంతోనే ప్రశాంత్ కిషోర్ కలత చెందినట్లు సమాచారం. పీకే టీం చేస్తున్న సూచనలను పాటించాలని జగన్ ఆదేశిస్తున్నా వీరు మాత్రం అడ్డుపుల్ల వేస్తుండటమే పీకే అలకకు కారణంగా చెబుతున్నారు.ఈ ముగ్గురు జోక్యం భరించలేక ప్రశాంత్ కిషోర్ టీంలోని సభ్యుడొకరు రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తోంది. పీకే టీం మొత్తాన్ని విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తుండటమే ఇందుకు కారణమని వైసీపీలో చర్చ జరుగుతోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ తన ప్రధాన సహచరుడైన రిషికి బాధ్యతలను అప్పగించి వెళ్లిపోయారని చెబుతున్నారు. వీరి జోక్యం కారణంగా తాము అనుకున్నట్లు ఐడియాలను అమలు చేయలేకపోతున్నామని పీకే టీం సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు పీకే వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇవన్నీ అవాస్తవాలేనని, ప్రశాంత్ కిషోర్ త్వరలోనే వచ్చి వ్యూహకర్తగా సేవలందిస్తారని వైసీప ముఖ్యనేత ఒకరు చెబుతుండటం కొసమెరుపు.
Tags:Changing VCP strategist Pike

 అమరావతిని తలదన్నేలా డోలేరా

Date:20/03/2018
గాంధీనగర్  ముచ్చట్లు:
భూములు ఎందుకు అన్నారు కదా అమరావతిని ! నరేంద్రమోడీ గుజరాత్ లో 75 వేల ఎకరాల్లో కళ్లు చెదిరే నగరం కడతానంటూ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. గుజరాత్ లో కొత్త మహానగరం డోలేరా ! మోడీ ప్రతిష్టాత్మకంగా కడుతున్నాడు. 2015-16 బడ్జెట్ లో 3 వేల కోట్లు ఇచ్చాడు. 2018లో 1100 కోట్లు కేటాయించాడు. అంటే నాలుగేళ్లలో అమరావతికి, ఏపీకి ఇచ్చిన దానికంటే ఎక్కువ ! గ్రీన్ ఫీల్డ్ ఏర్ పోర్ట్ కోసం 3500 కోట్లు ఇస్తోంది కేంద్రం. ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. డోలేరా – గాంధీనగర్ – అహ్మదాబాద్ లను కలుపుతూ మెట్రో రైల్ కి కూడా రంగం సిద్ధం అయ్యింది. జపాన్ కోఆపరేటివ్ బ్యాంక్ జైకా సహాయం కేంద్రమే ఇప్పిస్తోంది.అమరావతి కోసం జైకాకు ఓ మాట చెప్పమని మూడేళ్ల నాడే అడిగాడు చంద్రబాబు. కేంద్రం ససేమిరా అని తేల్చేసింది. గుజరాత్ కి మాత్రం తనదే బాధ్యత అని రంగంలోకి దిగింది. డోలేరాలో ఎక్స్ ప్రెస్ వే వేసేందుకు క్లియరెన్స్ వచ్చేసింది. అండర్ సీ బుల్లెట్ ట్రైన్ కూడా రెడీ ప్లానింగ్ లో ఉంది. అంటే అన్ని రకాల రవాణా సౌకర్యాలూ ఉన్న అత్యాధునిక నగరం అనమాట. మోడీ మొదటి బడ్జెట్ లోనే అంటే 2014లోనే డొలేరా రైల్వే కనెక్టివిటీ కోసం 40 వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే పనులు జరుగుతున్నాయ్. అంటే ఇవన్నీ లెక్కేయండి ఎన్ని లక్షల కోట్లు కేటాయించాడో అర్థమైపోతుంది సులభంగానే ! పైగా ఇదేం చిన్నాచితక నగరం కాదు. 75 వేల ఎకరాలు.ఇక డోలేరా కాకుండా… గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ – GIFT – గిఫ్ట్ అని మరో నగరం కడుతున్నాడు మోడీ. బడ్జెట్ 70 వేల కోట్లు. రెప్పపాటు కూడా కరెంటు పోదు. డెవలప్ మెంట్ కి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలతో స్మార్ట్ గా రూపు దిద్దుకుంటోంది ఇది. ఈ సిటీ నిర్మాణాన్ని కూడా మోడీనే చూస్తున్నారు ప్రత్యేకంగా ! అమరావతికి పన్ను మినహాయింపులు ఇవ్వండి అంటే మోడీ కుదరదని తేల్చేశాడు కదా, ఈ గిఫ్ట్ సిటీలో మాత్రం ఫుల్లుగా మినహాయింపులు ఉంటాయ్. అంటే నీళ్ల మధ్యలో గొయ్యి తవ్వి నిలకట్టినట్టు… గుజరాత్ లో ఇలాంటి నగరం కట్టి… దేశంలోకి రావాలనుకున్న పెట్టుబడులు అన్నింటినీ అటువైపే ఆకర్షించడం అసలు ఉద్దేశం.గుజరాత్ కోసమే ఇప్పుడు పన్ను మినహాయింపులు మనకి ఇవ్వడం లేదు అనేది స్పష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. అంటే సొంత రాష్ట్రం కోసం లక్షల కోట్లు కేటాయిస్తాడు కానీ ఏపీ కోసం… కొత్తగా కట్టుకుంటున్న రాజధాని కోసం మాత్రం పైసా కూడా విదల్చడన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే గుజరాత్ కోసమే అమరావతిని ఎండగడుతున్నాడు అనేది నిజం. వాస్తవం.
Tags:Dolaara to take up Amravati

.ఆ అధికారం స్పీకర్ కు లేదు : మంత్రి యనమల

Date:20/03/2018
అమరావతి ముచ్చట్లు:
సభలో అవిశ్వాసంపై నోటీసు వస్తే తిరస్కరించే అధికారం స్పీకర్ కు లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… అవిశ్వాసం నుంచి తప్పించుకోవడమంటే.. రాజకీయ ఆత్మహత్య వంటిదన్నారు. సభ సజావుగా లేదని తిరస్కరించడం స్పీకర్ కు తగదన్నారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వెల్ లో ఆందోళన చేసే అన్నాడీఎంకే బీజేపీ మిత్రపక్షమే కదా మంత్రి ప్రశ్నించారు. అవిశ్వాసం చర్చకు చేపట్టకపోతే అది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం,గత చరిత్రకు భిన్నమని అన్నారు. అవిశ్వాసం నుంచి తప్పించుకునేందుకే మిత్రపక్షాలతో ఆందోళన చేయిస్తోంది. అవిశ్వాసం నుంచి కేంద్రం పారిపోతోంది అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
Tags:That authority is not to speak to the speaker: Minister Yanamala

.భద్రత నియమాలను పాటిధ్దాం … ప్రమాదాలను అరికడదాం 

 : Date:20/03/2018
జిల్లా ఎస్పీ
హెల్మెట్ ధారణపై  అవగాహన ర్యాలీ.
కర్నూలు  ముచ్చట్లు:
మార్చి 20 వ తేది ప్రపంచ తల గాయాల ప్రమాదాల అవగాహన దినోత్సవము సంధర్బంగా కర్నూలు మై క్యూర్ హాస్పిటల్, నగర పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా బైక్ హెల్మెట్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి  ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని ఆర్టిసి బస్టాండ్ సమీపంలోని  మైక్యూర్ హాస్పిటల్  నుండి రాజ్ విహార్ కూడలి వరకు సాగింది.  అనంతరం రాజ్ విహార్ సెంటర్ లో హెల్మెట్ లు, సీట్ బెల్టులు ధరించాలని  భద్రత పై ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు.  హెల్మెట్ ధరించి వెళ్తున్న ద్విచక్రవాహనదారులకు జిల్లా ఎస్పీ  ప్రోత్సాహక బహుమతులు, హెల్త్ కూపన్లు అందజేశారు.    హెల్మెట్ ధరించడం వ్యక్తిగత భద్రతకు  సంబంధించినదని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి అన్నారు.. జిల్లా అంతటా హైల్మెట్ ధారణ పై ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకురావడానికే ఈ అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.  వాహనదారులు హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించడం వలన ప్రమాదాలు జరిగినప్పడు సురక్షితంగా  భయట పడవచ్చన్నారు.  ప్రమాదాలలో ఎక్కువ శాతం తలకు గాయాలై ఒక కుటుంబ యజమానిని కోల్పోతే ఆ ఇంటి పరిస్ధితి చాలా భారంగా ఉంటుందన్నారు.
Tags:Please follow the rules of safety … to avoid the dangers

 మొక్కుబడి తంతే… 

Date:20/03/2018
విజయనగరం ముచ్చట్లు:
జిల్లాలోని దాదాపు 50 శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో బరువు నమోదు మొక్కుబడి తంతుగా మారింది.  కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, కిశోర్‌ బాలికల బరువును తూసి నమోదు చేయడానికి ఆరేళ్ల క్రితం యంత్రాలిచ్చారు.  వీటిలో చాలా వరకు  మరమ్మతులకు గురయ్యాయి. వీటి స్థానంలో కొత్తవి అందించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.  యంత్రాల్లేని కేంద్రాల్లో ప్రతి నెలా కార్యకర్తలు బరువు నమోదుకు కాకిలెక్కలనే చూపుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ యంత్రాలను వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
జిల్లాలోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,729 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.వీటి ద్వారా గర్భిణులు 17,149, బాలింతలు 16,373 మంది, చీపురుపల్లి మేజరు పంచాయతీలోని వంగపల్లిపేట అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు, గర్భిణులకు బరువు తూసేందుకు వేర్వేరుగా రెండు త్రాలిచ్చారు.ఇందులో చిన్నారుల బరువు తూసే యంత్రం మాత్రమే పనిచేస్తోంది. గర్భిణుల బరువు తూకానికి ప్రతి నెలా ఇతర కేంద్రాల యంత్రాలపైనా సిబ్బంది ఆధారపడుతున్నారు. పలుచోట్ల గర్భిణులు, బాలింతలకు బరువు తూయకుండానే అంచనాతో కాకిలెక్కలు చూపుతున్నారు. గత నెల కంటే అదనంగా కొంత బరువును పెంచి నమోదు చేసేస్తున్నారు.కార్యకర్తలు ఇచ్చిన లెక్కలనే ఐసీడీఎస్‌ నమోదు చేసి పంపుతుంది. దీంతో తప్పుడు లెక్కలు చోటుచేసుకుని బరువు నమోదులో వాస్తవికత లోపిస్తోంది. దీని ప్రభావం చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారంపై చూపుతుంది.ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 1,25,949 పౌష్టికాహారం లబ్ధి పొందుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని ఎనిమిది మండలాల్లో గిరిగోరు ముద్దలు పథకం ద్వారా ప్రత్యేక పోషకాహారం అందిస్తున్నారు. ఇప్పుడు గిరి చంద్రన్న దీవెన ద్వారా పౌష్టికాహార బుట్టను ప్రతినెలా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గర్భిణుల పోషకాహారం కోసం అన్న అమృత హస్తం పథకం అమలు చేస్తున్నారు. ఈ విధంగా వివిధ పథకాల ద్వారా అందిస్తున్న పోషకాహారంతో లబ్థిదారుల ఆరోగ్యం ఏమేరకు మెరుగుపడుతుందన్నది అంచనా వేయడానికి బరువు నమోదే కీలకం.ప్రతినెలా వారి బరువును నమోదు చేసి తక్కువ బరువు ఉంటే తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు లేకపోయినా, గర్భిణులు తగినంత బరువు లేకున్నా వారికి అదనపు పోషకాహారం అందించడానికి సూచిస్తారు. ఇంతటి కీలకమైన బరువు తూకం వేసే యంత్రాలు చాలా కేంద్రాల్లో కొరవడ్డాయి. చిన్నారులకు బరువు తూయడానికి ఊయలతో అనుబంధంగా పనిచేసే యంత్రాలిచ్చారు. ఇవి కొంత వరకు పనిచేస్తున్నా గర్భిణులు, బాలింతలు, కిశోర్‌ బాలికల బరువును నమోదు చేయడానికి ఇచ్చిన యంత్రాలు చాలా చోట్ల పనిచేయడం లేదు. దీంతో కేంద్రాల్లో బరువు నమోదు సవ్యంగా సాగడం లేదు.తుప్పుపట్టి పోయి వినియోగానికి పనికి రాని ఈ యంత్రం శృంగవరపుకోట పట్టణంలోని వేమలివీధి కేంద్రంలో కనిపించింది. దీని స్థానంలో కొత్తది అందించాలని కోరినా ఇంత వరకు ఇవ్వలేదు. ఇక్కడ ప్రతినెలా చిన్నారులు, గర్భిణుల బరువు తూచేందుకు పక్క కేంద్రాల నుంచి యంత్రంను అరువుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సిబ్బందికి ఏర్పడుతోంది. గుర్ల మండలం మీసాలపేట అంగన్‌వాడీ కేంద్రంలో పాడైపోయిన యంత్రమిది. ఇక్కడ చిన్నారులకు బరువు తూసే యంత్రం పనిచేస్తున్నా, గర్భిణులు, బాలింతలు, కిశోర్‌బాలికలకు బరువు తూసే యంత్రం పనిచేయడం లేదు.దీంతో బరువు తూకం వేయడానికి ఇతర కేంద్రాల యంత్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.
Tags:It’s up to you …

 నిధులు వచ్చేనా..? 

Date:20/03/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
ప్రత్యేక అభివృద్ధి నిధుల కోసం కేంద్రం వైపు జిల్లా ఆశగా ఎదురుచూస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు రావాల్సిన నాలుగోవిడత నిధులు ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలకు రావాల్సిన రూ. 350 కోట్ల ప్రత్యేక నిధులకు సంబంధించి కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసి మళ్లీ వెనక్కి తీసుకోవడంతో అసలు విడుదల చేస్తుందో లేదోనన్న సంశయం తలెత్తుతోంది. ఈ నిధులను నమ్ముకుని పక్కా ప్రణాళికతో జిల్లాలో ఇప్పటికే రూ. 21 కోట్ల వరకు ఖర్చుచేసిన అధికారులకు ఇది సహజంగానే ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంపై కేంద్రం అవలంబిస్తున్న ధోరణి నేపథ్యంలో ఈ పర్యాయం నిధులపై రోజురోజుకు నమ్మకం సడలిపోతోంది.
రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు సమకూర్చాలని విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఒక్కో జిల్లాకు కేంద్రం రూ. 50 కోట్ల చొప్పున విడుదల చేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2015-16, 2016-17 సంవత్సరాలకు ఏటా రూ. 50 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ వచ్చింది. ఆ నిధులను ఖజానాలో జిల్లా ప్రణాళిక అధికారి వ్యక్తిగత ధరవాత్తు ఖాతా (పీడీ అకౌంట్‌)లో జమ చేస్తోంది. ఖజానాలో జమ చేసిన నిధులను ఇతరత్రా వడ్డీ ఇచ్చే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్టు చేసేందుకు వీలుండదు. ఆ నిధుల వ్యయానికి ఒక ప్రత్యేక ఖాతా (హెడ్‌ ఆఫ్‌ అక్కౌంటు) ఉంటుంది.
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధుల్ని వెచ్చించేందుకూ కేంద్రం పక్కా నిబంధనలు పెట్టింది. జిల్లా కలెక్టర్‌ జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాలి. ముఖ్యప్రణాళిక అధికారి కన్వీనర్‌. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, జలవనరులు, పరిశ్రమలు, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, సంక్షేమ శాఖల జిల్లాస్థాయి అధికారులు సభ్యులు. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేటాయించిన నిధులతో చేపట్టే పనులను ఈ కమిటీ ఎంపిక చేయాలి. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్రం సూచించింది. కరవును, తుపాన్లను అధిగమించేదిగా ప్రణాళిక ఉండాలని నిర్దేశించింది. వ్యవసాయం, ఉద్యానవనం, సూక్ష్మ నీటిపారుదల, సెరికల్చర్‌, కరవు నివారణ, తుపాను తీవ్రత తగ్గింపు చర్యలు, నైపుణ్యాభివృద్ధి, మహిళలు, పిల్లల సంక్షేమం, మార్కెట్‌ మద్దతు, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రణాళికలు రూపొందించడంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిర్దిష్టంగా పేర్కొంది. పనులు నిర్వహించిన ఏజెన్సీకి జిల్లా కలెక్టర్‌ అనుమతితోనే నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఖర్చుచేసిన ప్రతి రూపాయికి ప్రత్యేక ఆడిట్‌ చేయించాలి. ఎప్పటికప్పుడు ఖర్చు చేసి యూసీ సమర్పించాలి. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ నెలకు కనీసం ఒక్కసారైనా విధిగా సమావేశమై సమీక్షించుకోవాలి. ఈ ప్యాకేజీ కింద చేపట్టిన పనులను ఉన్నతస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి.
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులకు సంబంధించి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు యూసీలను సమర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రూ. 150 కోట్లకు సంబంధించి రూ. 135 కోట్ల వరకు యూసీలను కేంద్రానికి సమర్పించింది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది విడుదలవుతాయన్న నిధులకూ ముందుగానే ప్రణాళికలు వేసింది. 1,334 పనులకు మంజూరులు ఇచ్చేసింది. వాటిలో ఇప్పటికే 68 పనులు పూర్తయ్యాయి. మరో 731 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చేసిన.. చేస్తున్న పనులకు సంబంధించి వాటి పర్యవేక్షక ఏజెన్సీలకు రూ. 21.20 కోట్ల నిధులను జమ చేసేసింది. జనవరి, ఫిబ్రవరిల్లోనే నిధులను విడుదల చేస్తోంది. ఈ ఏడాది మార్చి రెండో వారం ముగుస్తున్నా.. ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం.. పైగా కేంద్ర వ్యవహారం శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది.
Tags:Will the funds come?

చీటింగ్ సీజన్ 

Date:20/03/2018
నెల్లూరు ముచ్చట్లు:
జిల్లాలో నిత్యం ఏదొక చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. భక్తి పేరుతో, ఉద్యోగాలు ఇప్పిస్తామని, పదోన్నతులు కల్పిస్తామని, డబ్బులు రెట్టింపు చేస్తామని ఆశ చూపి కుచ్చు టోపీ పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి మోసాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. నిత్యం వీటి గురించి పత్రికల్లో, టీవీల్లో వస్తున్నా.. ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ నమ్మబలికి నట్టేట ముంచేస్తున్నారు. కొత్త తరహా కార్యక్రమాలకు తెర లేపుతున్నారు. మీడియాలో పనిచేస్తున్నామంటూ చెబుతూ మధ్యతరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇంకా ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. సీహెచ్‌ రామకృష్ణ అనే వ్యక్తి బారిన పడిన బాధితులు ఇంకా పలువురు ఉన్నారని తెలిసింది. స్థానిక స్టేషన్లలోకెళితే న్యాయం జరగడం లేదు. దాంతో చేసేదేమీలేక బాధితులందరూ జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తున్నారు.
పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుండగా మోసాలు సైతం అదేస్థాయిలో ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ ప్లాంట్లు, సెజ్‌లు, పారిశ్రామిక వాడలు, ప్రైవేటు కంపెనీలు జిల్లాకు రావడంతో వాటిలో ఉద్యోగాలకు డిమాండు పెరిగింది. దీన్నే ఆసరాగా చేసుకుని పలువురు ఉద్యోగాల వ్యాపారం చేస్తున్నారు. రూ.లక్షలు వసూళ్లు చేసి పరారవుతున్నారు. ఇలాంటి బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నా.. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాస్తంతా పలుకుబడి, రాజకీయ నాయకులతో పరిచయాలు చూపిస్తూ తెర వెనక చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలను బూచిగా చూపించి నిరుద్యోగులకు వల వేస్తున్నారు. చేసేదేమి లేకుండా యువకులు వీరి మాటల మాయలో పడి అప్పోసొప్పో చేసి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. తపాలా శాఖలో కేవలం పదో తరగతి అర్హతతోనే పోస్టుమెన్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ పడటంతో వీరికి ఇదే ఆసరాగా మారింది. పోటీ భారీగా ఉండటం, తనకు పరిచయాలు ఉన్నాయంటూ బురిడి మాటలు చెబుతూ పదుల సంఖ్య వ్యక్తుల దగ్గర నుంచి వసూళ్లు చేసి మాయమవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలాంటి మోసాలు ఎక్కువుతున్నా.. పోలీసు స్టేషన్లలో మాత్రం న్యాయం జరగడం లేదు. తాము మోసపోయామని స్థానిక పోలీసులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తున్నారు. స్థానిక నాయకులు, వీరందరూ కలిసి కుమ్మక్కై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఉద్యోగం కోసం రూ.లక్షలు ఇచ్చానని ఫిర్యాదు చేస్తే ఆధారాలు కావాలంటూ ప్రశ్నిస్తున్నారని బాధితులు గ్రీవెన్స్‌లో వాపోయారు. లేనిపోని కొర్రీలు పెడుతున్నారని, తమపైనే కేసులు నమోదు చేసేలా చూస్తున్నారని పేర్కొంటున్నారు.
అక్రమ మార్గంతో డబ్బు సంపాదించాలనే యావతో పలువురు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. మధ్యతరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో కలిసి ఉండేలా ఫొటోలు చూపించడం, ఫోన్లలో మాట్లాడటం లాంటివి చేస్తారు. స్థానిక పోలీసు స్టేషన్లలో పోలీసులతో కలిసి ఉండటం, వారితో సరదాగా ఉండటంతో బాధితులు నమ్మేలా నటిస్తారు. దరఖాస్తులకు ఆధార్‌ కార్డులు, ధ్రువపత్రాలు, ఇతర పత్రాలు తీసుకుని ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మబలుకుతారు. కొన్ని రోజులు ఆగి పోటీ ఎక్కువగా ఉందని, ఇంకా డబ్బులు కావాలంటూ తీసుకుంటారు. ఇలా ఒక్కో ఉద్యోగం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ధర పలుకుతోంది. అడ్వాన్సుగా సగం తీసుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా ఇవ్వాలని షరతు విధిస్తారు. దాంతో నిరుద్యోగులు పూర్తిగా నమ్ముతారు. ఒక్కో ప్రాంతంలో పది మంది వద్ద వసూళ్లు చేసి ఫోన్లు ఆఫ్‌ చేస్తున్నారు.
Tags:Cheating season

సాగునీటి కష్టాలకు చెక్ 

 Date:20/03/2018
కర్నూలు ముచ్చట్లు:
ఏన్నో ఏళ్లుగా ఆశగా నిరీక్షిస్తున్న కర్షకుల కల ఫలించింది. సాగునీటి కోసం అవస్థలు పడుతూ..తమ కష్టాలు తీర్చాలని పలుసార్లు.. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ఎట్టకేలకు కర్నూలు జిల్లాలో సాగునీటి కష్టాలకు చెక్‌ పడనుంది. జిల్లాలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుని.. ప్రాముఖ్యత గల ప్రాజెక్టుగా గుర్తింపు పొంది.. ఏళ్లతరబడి ప్రభుత్వ అనుమతికి నోచుకోని.. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సోమవారం ఆమోద ముద్ర వేసి.. సర్కారు తన మాట నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ‘వేదవతి’, పశ్చిమప్రాంతంలోని 68 చెరువులకు కృష్ణా  జలాలు నింపేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.
కర్నూలు జిల్లాలో గుండ్రేవుల జలాశయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ప్రభుత్వానికి డీపీఆర్‌ పంపి.. ఏడాదికిపైగా అయినా.. మోక్షం లభించలేదు. 15-20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని.. కేసీ కాల్వ కింద రెండు పంటలు పండించేందుకు అవకాశముంటుంది. దిగువ కాల్వకు నీరు సరఫరా అవుతుంది. 2014లో  ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,400 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు మరింత పెరిగి ఉంటుందని చెబుతున్నారు. కర్నూలు జిల్లాకు ఏ కొత్త ప్రాజెక్టు అవసరం లేదని, ఒక్క గుండ్రేవుల జలాశయం నిర్మిస్తే.. చాలునని రైతులు, నిపుణులు చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎంతో పట్టుదలతో పశ్చిమప్రాంతంలోని 106 చెరువులకు హంద్రీనీవా నీటిని నింపేందుకు రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. 106 చెరువులను కుదించి..68 చెరువులకు నీటిని నింపేందుకయ్యే వ్యయం రూ.223 కోట్లకు ప్రభుత్వం అంగీకరించినట్లయింది. 68 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును ప్రాధాన్యం కల్పించింది. దీంతో కరవు ప్రాంతమైన ఆదోని డివిజన్‌లోని పలు గ్రామాలకు సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గూళ్యం సమీపంలోని వేదవతిపై జలాశయం నిర్మించడం వల్ల.. 1 టీఎంసీ నీటితో తాగు, సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి నివేదిక కూడా సిద్ధ్దం కాలేదు. ఇంతవరకు ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలియచేయడంతో.. సర్వే, పరిశోధన పనులు మొదలవుతాయి. ఈమేరకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.
Tags:Check for irrigation difficulties