ఆంధ్ర యూనివర్శిటీ  యదేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన

Andhra University is in violation of the restrictions

Andhra University is in violation of the restrictions

Date:11/10/2018
విశాఖపట్టణం  ముచ్చట్లు:
ఆంధ్ర విశ్వవిద్యాలయం లో అక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది…కొంతమంది అధికారులు తమ అధికార దర్పం తో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ తమ ఫాలోవర్స్ కి రెడ్ కార్పెట్ పరచడం తో ఈ చదువుల నిలయానికి మచ్చ ఏర్పడుతుంది. దీంతో ఎంతో ప్రతిష్ట కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ నేడు మసక బారుతుంది….దీనికి నిదర్శనం గతంలో ఈ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సిలర్ గా విధులు నిర్వహించిన  జి.ఎస్‌.ఎన్‌.రాజు పై వెల్లువెత్టిన చిట్టా..ఇది విశాఖ  ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతోమంది ఈ చదువుల తల్లి ఒడిలో విద్య ను అభ్యసించి ఉన్నత శిఖరాలు అందిపుచ్చు కున్నారు. అలాంటి ఈ విద్యాలయంలో అక్రమాల మాట వెలుగు చూడడంతో విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే, ఆంధ్రా యూనివర్సిటీ లో ఆచార్య జి.ఎస్‌.ఎన్‌.రాజు ఉప కులపతిగా ఉన్నపుడు పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు సి.బి.ఎస్‌.వెంకటరమణ కమిటీ తేల్చి చెప్పడంతో పలువురి భవితవ్యం గందరగోళంగా మారింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన సిఫార్సులను 90 రోజుల్లో అమలు చేయాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన చేసింది. దీంతో నాడు అక్రమ పద్ధతుల్లో నియామకాలు, పీహెచ్‌డీ సీట్లు పొందిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ఇక  ఆచార్య జి.ఎస్‌.ఎన్‌.రాజు హయాంలో ఉద్యోగ నియామకాల్లో అనుసరించిన విధానంపై గతంలో ఆరోపణలొచ్చాయి.
వర్సిటీలో సిబ్బంది కొరత ఉంటే.. నిబంధనల ప్రకారం చేయొచ్చని, కానీ.. ఆయన మాత్రం తనకు తెలిసినవారందరికీ అవకాశం ఇవ్వటంతో అర్హులకు అన్యాయం జరిగినట్లయింది. ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేపట్టినపుడు కచ్చితంగా రోస్టర్‌ విధానం పాటించాలన్న ప్రాథమిక సూత్రాన్ని సైతం విస్మరించడం తీవ్రమైన తప్పిదంగా ప్రచారం జరుగుతోంది.దరఖాస్తు చేయకుండానే…ఆచార్య రాజు హయాంలో జరిగిన ప్రధానమైన అక్రమాల్లో అడ్డగోలుగా ఎగ్జిక్యూటివ్‌ కోటా పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు ఒకటి. కనీసం దరఖాస్తు కూడా చేయకుండానే 85 మందికి సీట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ కోటా సీట్లు కేటాయించాలంటే అభ్యర్థులకు నిర్ణీత అర్హతలుండాలి. వాటితో సంబంధం లేకుండానే ఆయా సీట్లను భర్తీ చేశారు.
ఇక  వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో 65 బోధనేతర పోస్టులను భర్తీ చేశారు. అందులో 33 పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమైంది. దీంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది. అప్పటికే నియామకాలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేయడంతో వాటిని ‘అబేయన్స్‌’లో పెట్టారు. మరోపక్క విశ్వవిద్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన 195 మందిని నియమించారు. వీరిలో నెలకు రూ. 3 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనం పొందుతున్నవారున్నారు.ఇక  వర్సిటీ ప్రాంగణ కళాశాలల్లో సిబ్బంది కొరతను అధిగమించడానికి ఎవరెవర్ని ఏఏ పోస్టులకు తీసుకుంటున్నారో పేర్కొంటూ వర్సిటీ ప్రాంగణ కళాశాలల ప్రధానాచార్యులు పంపిన లేఖలకు నాటి వీసీ ఆచార్య రాజు ఆమోద ముద్ర వేసేశారు.
పలు నియామకాలకు సంబంధించి ఎలాంటి దస్త్రాలు, నోట్‌ ఫైల్స్‌ వీసీ కార్యాలయంలోగానీ, వర్సిటీ ప్రాంగణ కళాశాలల ప్రధానాచార్యుల వద్దగానీ లేకపోవడం గమనార్హం. ఇంజినీరింగ్‌ కళాశాల, మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నియామకాలకు సంబంధించిన అక్రమాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. వర్సిటీలో భర్తీ చేసిన చాలా పోస్టులకు ఎలాంటి బహిరంగ ప్రకటనలు ఇవ్వలేదు. ప్రకటన ఇచ్చిఉంటే అర్హులు దరఖాస్తు చేసుకునేవారు. ప్రతిభావంతులైనవారికి అవకాశం దక్కేది. వేతనాలు ఇవ్వడంలోనూ వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తొలుత నియమితులైనవారికంటే తరువాత వచ్చిన తాత్కాలిక ఉద్యోగులు అధిక వేతనాలు పొందారు. దీనిపై బాధితులు కమిటీకి ఫిర్యాదు కూడా చేశారు.
ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా ఉందని, సంస్థ అవసరాలకు తగ్గట్లుగా నియామకాలు చేసుకోవాల్సి వచ్చిందని ఇంజినీరింగ్‌ కళాశాల ప్రతినిధులు విచారణ కమిటీకి వివరించారు. అటానమస్‌ హోదా ఉన్నంత మాత్రాన నిబంధనలను ఉల్లంఘించకూడదని కమిటీ తేల్చి చెప్పింది.ఇక  నిబంధనల ఉల్లంఘన, అక్రమాలపై కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో వర్సిటీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వాటిని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వర్సిటీ ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. న్యాయనిపుణుల సలహా తీసుకుని వివాదాలకు తావులేకుండా సిఫార్సుల్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
జీవో అందినట్టు వీసీ నాగేశ్వరరావుకు రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. పరిణామాలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. మళ్లీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలా? ప్రభుత్వం ఆదేశాలనుబట్టి నేరుగా సిఫార్సులు అమలు చేయాలా? అన్నదానిపై చర్చిస్తున్నారు. ఇక దీనిపై ఆంధ్రా యూనివర్సిటీ జి.ఎస్‌.ఎన్‌.రాజు మాత్రం తనది ఏ తప్పు లేదు అంటున్నారు కావాలని కొంతమంది నాకు లేని మచ్చను అంతకడుతున్నారు అంటున్నారు…మరి ఈయన పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags:Andhra University is in violation of the restrictions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *