రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమల  ముచ్చట్లు:


తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనున్నది. సాధారణంగా ప్రతి ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను మార్చి-ఏప్రిల్‌ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆణివార ఆస్థానం కార‌ణంగా ఆదివారం నాడు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

 

 

ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనున్నది. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. వరలక్ష్మీ వ్రతం కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, బ్రేక్ ద‌ర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ వ్రతం టికెట్లను త్వర‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కేటాయించనున్నారు.

 

Tags: Anivara Asthanam at Tirumala Srivari Temple tomorrow

Leave A Reply

Your email address will not be published.