Natyam ad

ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు : ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి

తిరుపతి ముచ్చట్లు:

ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి, సమాజంలో నైతిక విలువలను పునరుద్ధరించేందుకు అన్నమయ్య కీర్తనలు ఎంతగానో దోహదపడినట్లు ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కట్టమంచి మహాలక్ష్మి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న సాహితీ సదస్సులు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి.

 

 

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి ”అన్నమయ్య – నైతికత ” అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక ప‌రిస్థితుల్లో అన్ని వృత్తుల వారు స‌మాన‌మేన‌ని, రాజు – పేద తేడాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ శ్రీ‌హ‌రే అంత‌రాత్మ అని అన్నమయ్య శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని చెప్పారు. ఆశ్ర‌మ‌ధ‌ర్మాల్లో గృహ‌స్తాశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని సంకీర్త‌న ద్వారా తెలియ‌జేశార‌న్నారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారన్నారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవజీవనాన్ని చవిచూశారని వివరించారు.

 

విజయవాడకు చెందిన డా|| డి.రామకృష్ణ ”అన్న‌మ‌య్య సంస్కృత కీర్తనలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్న‌మ‌య్య అలతి అల‌తి ప‌దాల‌తో దాదాపు 90 సంకీర్త‌న‌ల‌ను సంస్కృతంలో ర‌చించిన‌ట్టు తెలిపారు. సంస్కృత క‌వుల‌కు తెలుగు భాష రాక‌పోయినా ప‌ర‌వాలేద‌ని, తెలుగు క‌వుల‌కు మాత్రం త‌ప్ప‌కుండా సంస్కృతం తెలిసి ఉండాల‌న్నారు. అన్న‌మ‌య్య ప‌ద ప్ర‌యోగ నిపుణ‌త అనిత‌ర సాధ్య‌మ‌న్నారు. స‌ర‌ళ‌మైన సంస్కృతంలో తెలుగు వారికి సైతం అర్థమ‌య్యేలా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ర‌చించార‌ని తెలిపారు.

 

 

 

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రచయిత  జి.బసవ శంకరరావు ”అన్నమయ్య – నవ్య కీర్తనలు ” అనే అంశంపై ఉపన్యసిస్తూ 500 ఏళ్ల క్రితం నాటి అన్నమయ్య సాహిత్యంలో నాటి వైభవాన్ని, సామాజిక జీవనాన్ని అద్భుతంగా వర్ణించారని ఆయన తెలిపారు. అన్నయ్య నవ్య సంకీర్తనలను సేకరించి “తాళ్ళపాక సంకీర్తనలు- పరిశోధనలు – కొత్తగా వెలుగు చూస్తున్న తాళ్ళపాక కవుల పద సాహిత్యం” ను గ్రంథంగా రూపొందించినట్లు చెప్పారు. ఈయన కీర్తనల్లో భాష, సాహిత్యం, కళలు తదితర అన్ని అంశాల్లో ఉన్నతస్థాయి కనిపిస్తుందన్నారు. భక్తజనానికి వీనులవిందుగా శ్రీ వేంకటేశ్వరుని నామంతో కీర్తనలు రచించి అన్నమయ్య ప్రాచుర్యంలోకి వచ్చారని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనల్లో సాహిత్యంతో పాటు సంగీతానికి విశేష ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.

 

 

అనంతరం సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ మధుసూదనరావు బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 గంటలకు శ్రీమతి మునిలక్ష్మి బృందం హరికథ పారాయణం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా||విభీష‌ణ శ‌ర్మ‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

 

Tags:Annamayya Kirtans for Spiritual Integration : Acharya Kattamanchi Mahalakshmi