భక్తులకు శరణాగతి నేర్పిన అన్నమయ్య : ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి
తిరుపతి ముచ్చట్లు:
భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని భక్తులకు అన్నమయ్య తెలియజేశారని ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కట్టమంచి మహాలక్ష్మి ”అన్నమయ్య సంకీర్తనలు – నైతికతత్వం ” అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య సంకీర్తనల్లో అహింస, సచ్ఛీలత, భక్తి, శరణాగతి, నామసంకీర్తనం ప్రధానంగా ఉన్నాయన్నారు. అన్ని వర్గాల వారు నైతిక విలువలతో ఎలా జీవించాలి అనే విషయమై అన్నమయ్య తన సంకీర్తనలలో వివరించినట్లు తెలిపారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివరించారు.
తుడా కార్యదర్శి లక్ష్మి ‘అన్నమయ్య సంకీర్తనలు-నేటి యువత’ అనే అంశంపై మాట్లాడారు. సామాన్యప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్నమయ్య కీర్తనలను రచించినట్టు తెలిపారు. తన 32వేల సంకీర్తనల్లో వాడుక భాషలోని సామెతలు, పలుకుబడులను ఉపయోగించి చదువుకోని వారికి సైతం అర్థమయ్యేలా రచనలు చేశారని కొనియాడారు. నేటి యువతకు అన్నమయ్య సంకీర్తనలను చేరువజేయాలని ఆమె వివరించారు.జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ ‘అన్నమయ్య సంకీర్తనలు – ఆళ్వార్లు’ అనే అంశంపై మాట్లాడారు . అన్నమయ్య ఆళ్వార్ల దివ్య ప్రబందాలను, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, వారు ఉపదేశించిన నవవిధ భక్తి మార్గాలతో శ్రీవారిని సేవించి, వేలాది సంకీర్తనలు రచించారన్నారు. ఆళ్వార్లు, ఆచార్యులు, గురువుల అభిమతాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో అవిష్కరించినట్లు వివరించారు.సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశాఖపట్నం కు చెందిన చైతన్య బ్రదర్స్ బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వందన బృందం గాత్ర సంగీతం జరుగుతుంది. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ ఉమా ముద్దు బాల బృందం భరతనాట్యం కార్యక్రమాలు జరుగనున్నాయి.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణ శర్మ , టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ప్రముఖ శతావధాని ఆముదాల మురళి పాల్గొన్నారు.
Tags: Annamayya taught surrender to devotees: Acharya Kattamanchi Mahalakshmi
