కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ షాక్

Date:12/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఇటీవల ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలాపడ్డ కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మేల్యేలు టీఆర్‌ఎస్ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో చేవెళ్ల చెల్లెమ్మ.. మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెతోపాటు ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సురేందర్, వీరయ్య, కాంతారావు, ఉపేందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరితోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మేల్యేలు కూడా కారెక్కడానికి సిద్దపడినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించనున్నట్లు తెలిసింది.
ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఇచ్చే ఆలోచనలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు గులాబీ పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధికి వీలుగా టీఆర్‌ఎస్‌లో చేరితే ఎలా ఉంటుందని సుధీర్‌రెడ్డి తన సన్నిహిత నేతలు, కార్యకర్తలతో ఇప్పటికే సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఒక వేళ అదేగానిక జరిగితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు కానుంది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె.సురేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని.. ఇప్పటికే ఆయన చేరిక లాంఛనమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ అన్నట్లుగా టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మేల్యేల సంఖ్య సెంచరీ దిశగా పయనిస్తోంది.
Tags:Another big shock for the Congress party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *