నేపాల్ కు భారత్ వార్నింగ్ 

Date:21/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నేపాల్ చర్యపై భారత్ దీటుగా స్పందించింది. భారత్‌లోని భూభాగాలుగా చూపుతూ నేపాల్ విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. భారత్‌ -నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి మార్పులను అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. అలాంటి చర్యలను భారత్ ఎంతమాత్రం ఉపేక్షించబోదని విదేశాంగ శాఖ పేర్కొంది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.భారత్‌లోని లిపులేక్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్‌ను ఆ దేశ మంత్రిమండలి ఆమోదించింది. నేపాల్ ప్రభుత్వం ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భారత్ స్పందించింది.నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

 

 

‘భారత్‌ స్థానంపై నేపాల్‌కు పూర్తి అవగాహన ఉంది. భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించి.. న్యాయ విరుద్ధమైన కార్టో గ్రాఫిక్‌ ప్రకటనను ఉపసంహరించుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు నేపాల్ దేశ నాయకత్వం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’ అని అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.1816లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌ ఆధారంగా ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ ప్రాంతం తమదేనని నేపాల్ వాదిస్తోంది. అయితే.. 1962లో చైనాతో జరిగిన యుద్ధం అనంతరం లింపియాధురా, కాలాపానీ ప్రాంతంలో భారత్‌ సరిహద్దు భద్రతను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ చర్యలు విస్మయం కలిగిస్తున్నాయి.సరిహద్దు భద్రతా దృష్ట్యా కాలాపానీ ప్రాంతం భారత్‌కు అత్యంత కీలకమైంది.

 

 

 

ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండటం చాలా ముఖ్యం. 35 చదరపు కి.మీ. వైశాల్యం ఉన్న నిర్మానుష్యమైన కాలాపానీ ప్రాంతంలో 3,500 మీటర్ల నుంచి 6,000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. దీనికి సమీపంలో చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్‌ సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతం నేపాల్‌కు వెళితే.. చైనా దళాలు తేలిగ్గా ఉత్తరాఖండ్‌లోకి చొరబడే ప్రమాదం ఉంది.భారత్‌పై అక్కసు ప్రదర్శించడానికి నేపాల్‌ను చైనా పావుగా వాడుకుంటోంది. నేపాల్‌లో 2019 అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే భారత్‌ – నేపాల్‌ మధ్య కాలాపానీ వివాదం భగ్గుమంది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి.

 

 

 

తాజాగా మే 8న టిబెట్‌లోని మానససరోవర్‌ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేక్‌ పాస్‌ వరకు భారత్‌ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించడంపై నేపాల్‌ అభ్యంతరాలు లేవనెత్తడంతో వివాదం ముదిరింది.తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి భారతే కారణమంటూ నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ బుధవారం ఆరోపించారు. చైనా కంటే భారత్ వైరస్ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ‘నేపాల్‌ మరెవరి కోసమో సమస్యలు సృష్టిస్తోంది’ అని భారత సైనికాధిపతి జనరల్‌ నరవణే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

 

ఏపీ లో ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారికి మరో అవకాశం

Tags: Another chance for people to apply in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *