మరో గడువు.. 

Another deadline ..

Another deadline ..

Date:16/08/2018
వనపర్తి ముచ్చట్లు:
ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న ధ్యేయంతో తెలంగాణ సర్కార్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది. ప్రభుత్వ ఆశయం ఎలా ఉన్నా కొన్ని జిల్లాల్లో మిషన్‌ భగీరథ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత టైమ్ పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వనపర్తి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ప్రధానంగా పైప్‌లైన్ పనులు ఆలస్యమవుతున్నాయని అందుకే స్థానికంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని చెప్తున్నారు.
వనపర్తిలో ప్రధాన పైపులైను (మెయిన్‌ గ్రిడ్‌) పనులన్నీ దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. కానీ అంతర్గత పనులు మిగిలిపోయాయి. అంతేకాక జలాశయాల నుంచి గ్రామాలకు అనుసంధానం చేసే ప్రధాన పైపులైను పనులు చేపట్టాలి. ఇక గ్రామాల్లో ఇళ్ల మధ్యలో వేసే అంతర్గత పైపులైను పనులు, ట్యాంకుల నిర్మాణాలూ చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆగస్టు 14 నాటికే ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉన్నా లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్ట్ పనులు అనేకం జరగాల్సి ఉంది. దీంతో గడువు మరోసారి పెరిగింది.
నపర్తిలోనే కాక ఉమ్మడి మహబూబ్‌నగర్ లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు జిల్లా వాసులు అంటున్నారు.ఉమ్మడి జిల్లాలోని 2,660 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నది టార్గెట్. సదాశయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో మొదలు పెట్టిన ఈ పథకం ఆలస్యమవుతుండడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో వ్యక్తికి రోజుకు వంద లీటర్ల చొప్పున, కార్పోరేషన్లలో 135 లీటర్ల చొప్పున తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.5,953 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో ప్రధాన గ్రిడ్‌ నుంచి పైపులైన్లు, గ్రామాల్లో అంతర్గత పనులు చేస్తున్నారు.
తాగునీటి అవసరాల కోసం భారీ ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్స్, ఇన్‌టేక్‌ వెల్స్, సంపులు, పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు, వీటికి అనుసంధానం చేసే పైపులైన్ల నిర్మాణపనులను2015 నవంబరులోనే ప్రారంభించారు. జలాశయాల నుంచి నేరుగా సరఫరా చేసేందుకు అవసరమైన 119 ప్రధాన ట్యాంకుల్లో 106 మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన 13 ట్యాంకుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక నిర్మాణాలు వేగవంతంగా సాగాల్సి ఉంది. సంపులు, పంప్‌హౌజ్‌లు, పైప్‌లైన్ పనులు యుద్ధప్రాతిపదికన సాగితేనే.. ప్రాజెక్ట్ త్వరితగతిన అందుబాటులోకి వస్తుందని అంతా అంటున్నారు. ఇంటింటికీ నల్లానీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్తున్నారు.
Tags:Another deadline ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *