దూసుకు వస్తున్న మరో వైరస్ ‘మార్‌బ‌ర్గ్’

హైదరాబాదు  ముచ్చట్లు:


ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ ఏ రూపంలో విజృంభిస్తోందోన‌ని భ‌య‌ప‌డిపోతున్న జ‌నాల‌ను కొత్త కొత్త వైర‌స్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. ఎబోలా, మంకీపాక్స్ అంటూ వ‌స్తున్న వైర‌స్‌ల‌కు తోడుగా ఇప్పుడు మార్‌బ‌ర్గ్ అనే మ‌రో వైర‌స్ వ‌చ్చి చేరింది. ఘ‌నాలో బ‌య‌ట‌ప‌డిన ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( డ‌బ్ల్యూహెచ్‌వో ).. ఈ వైర‌స్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారిలా ప్ర‌పంచ‌మంతా విస్త‌రించ‌క‌ముందే నియంత్రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. మార్‌బ‌ర్గ్‌తో మ‌ర‌ణించిన వారిని కాంటాక్ట్ అయిన దాదాపు 98 మందిని ఐసోలేష‌న్‌కు త‌ర‌లించి వారిని ప‌రీక్షిస్తోంది. ఈ క్ర‌మంలో మార్‌బ‌ర్గ్ వైర‌స్ అంటే ఏంటి? ఈ వైర‌స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? దీని ల‌క్ష‌ణాలేంటి ? వంటి విష‌యాలు తెలుసుకుందాం..

 

 

మార్‌బ‌ర్గ్ వైర‌స్ అంటే..
మార్‌బ‌ర్గ్ వైర‌స్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక ర‌క‌మైన హెమ‌రేజిక్ ఫీవ‌ర్ వైర‌స్‌నే. అడ‌వుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గ‌బ్బిలాలలో ఈ వైర‌స్ ఎక్కువ‌గా ఆవాసం ఉంటుంది. ఈ వైర‌స్ మ‌నుషుల్లో క‌నిపించ‌డం ఇది తొలిసారేమీ కాదు. ఉగాండాలోని ఆఫ్రిక‌న్ గ్రీన్ మంకీస్ ద్వారా ఈ వైర‌స్ మ‌నుషుల్లోకి సంక్ర‌మించింద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. 1967లో మొద‌టిసారి జ‌ర్మ‌నీలోని మార్‌బ‌ర్గ్ సిటీలో ఈ వైర‌స్‌ను గుర్తించారు. అందుకే ఈ వైర‌స్‌కు మార్‌బ‌ర్గ్ అని పేరు పెట్టారు. ఈ వైర‌స్ సోకిన వారిలో మ‌ర‌ణాల రేటు 24 నుంచి 88 శాతంగా ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.

 

వైర‌స్ ల‌క్ష‌ణాలు
వ్యాధి సోకిన రోగుల రక్తాన్ని, స్రవాలను తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైర‌స్ మ‌నిషి శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత 2 నుంచి రోజుల వ‌ర‌కు స‌జీవంగా ఉంటుంది. ఈ వైర‌స్ సోకిన వారిలో అధిక జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి, తిమ్మిర్లు, వాంతులు, విరోచ‌నాల వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 5 నుంచి 7 రోజుల మ‌ధ్య‌లో ముక్కు, చిగుళ్లతో పాటు వాంతులు, మ‌లం ద్వారా ఎక్కువ‌గా ర‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంది. ఇలా అధికంగా ర‌క్తాన్ని కోల్పోవ‌డం వ‌ల్ల 8 నుంచి 9 రోజుల్లోనే చ‌నిపోయే ప్ర‌మాదం కూడా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

 

 

మ‌హ‌మ్మారిగా మారే అవ‌కాశం ఉందా?
మ‌ర్బ‌ర్గ్ వైర‌స్ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే.. అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే చేయి దాటిపోయే ప్ర‌మాదం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. ఈ వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. ఎందుకంటే ప్ర‌స్తుతానికి ఈ వైర‌స్‌కు ఎటువంటి చికిత్స గానీ.. వ్యాక్సిన్ గానీ లేదు. ఫ్లూయిడ్స్ ద్వారా హైడ్రేట్‌గా ఉంచ‌డంతో పాటు, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా చూసుకోవ‌డం ద్వారా రోగి జీవించే అవ‌కాశాలు మెరుగుప‌ర‌చ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఈ వైర‌స్ సోకకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తుంది.

 

Tags: Another emerging virus is ‘Marburg’

Leave A Reply

Your email address will not be published.