నరసాపురంలో ఏ పార్టీ గెలిచినా… అంతా ఫ్యామలీ మెంబర్సే

Date:14/07/2018
ఏలూరు ముచ్చట్లు:
ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు వేర్వేరు పార్టీల నుంచి పోటీచేయ‌డం గురించి విన్నాం. మేన‌ల్లుడు-మేన‌మామ‌, బాబాయ్‌-అబ్బాయ్ ఇలా చాలా మందినే చూశాం. కానీ ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు.. నాలుగు వేర్వేరు పార్టీల నుంచి పోటీపడతార‌నే వార్త‌లు వినిపించ‌డం హుశా ఇదే తొలిసారేమో! ప్ర‌స్తుతం పశ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం ఎంపీ సీటు కోసం ఒకే కుటుంబంలో విచిత్ర‌మైన పోటీ నెల‌కొంది. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల నుంచి బ‌రిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్న నేత‌లు.. దగ్గర బంధువులే అవ‌డం ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. కాంగ్రెస్ నుంచి ఎవ‌రైనా పోటీచేస్తారా లేదా అనే విష‌యం ప్ర‌స్తుతానికి తేల‌క‌పోయినా.. ముగ్గురు మాత్రం క‌చ్చితంగా క‌త్తులు దూసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.ఇక్క‌డ క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానిదే ఆధిప‌త్యం కావ‌డం, అందులోనూ బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం ఒక్క‌టే ఉండ‌టంతో అంతా ఆ కుటుంబానికి చెంది వారికే టికెట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చిత్రంగా ఉంటాయ‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. న‌ర్సాపురం నియోజ‌క‌వర్గంలో క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే అభ్య‌ర్థులుగా పోటీచేస్తారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు పోటీచేశారు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. బీజేపీ నుంచి కనుమూరి బాపిరాజు బావ గోకరాజు గంగరాజు పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ బ‌హుముఖంగా ఉండ‌బోతోంది. టీడీపీ-బీజేపీ క‌టీఫ్ అయిపోవ‌డంతో ఇద్ద‌రూ చెరో అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపుతాయి. వీటితో పాటు వైసీపీ, కాంగ్రెస్ కూడా చెరో అభ్య‌ర్థిని నిల‌బెడ‌తాయి. అయితే ఈసారి బావా-బావ మరుదుల మధ్యే గాక‌, బాబాయి- అబ్బాయి, మామ-అల్లుళ్ల మధ్య కూడా రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఉండగా, బీజేపీ నుంచి గోకరాజు గంగరాజు సిట్టింగ్ ఎంపీ. తెలుగుదేశం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు కు టికెట్ ఖరారు అయినట్టు ప్రచారం ఉంది. ఆయన కనుమూరి బాపిరాజుకు స్వయానా అన్న కొడుకు.ప్రస్తుత బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు స్వయానా మేనల్లుడు. ప్రధాన ప్రార్టీలకు ఇప్పటికే ఈ ముగ్గురూ ఒకే కుటుంబం నుంచి బరిలో ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు జీవీకే రంగరాజును బరిలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రంగరాజు.. కనుమూరి బాపిరాజుకు మేనల్లుడు కాగా, టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కు బావమరిది. తండ్రి బీజేపీ ఎంపీగా ఉండగా, ఆయనకు పోటీగా తనయుడు రంగరాజు పోటీ చేస్తాడా? అనే సందేహం వ్యక్తమైనప్పటికీ, ఈసారి మారనున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంగరాజు అవసరమైతే పోటీ నుంచి తప్పుకుని కొడుక్కి అవకాశం కల్పించాలని చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు మాత్రం రంగ‌రాజును వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీ సీటు నుంచి ఎవ‌రెవ‌రు ఏయే పార్టీల త‌ర‌పున ఫైన‌ల్ అవుతారో ? చూడాలి.
 నరసాపురంలో ఏ పార్టీ గెలిచినా… అంతా ఫ్యామలీ మెంబర్సే https://www.telugumuchatlu.com/any-party-won-in-narasapuram/
Tags:Any party won in Narasapuram …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *