ఎనీ టైమ్ ‘నో మనీ’ కేంద్రాలు

Date:14/04/2018
విజయవాడ ముచ్చట్లు:
రాజధాని విజయవాడ నగరంలో మళ్లీ నగదు కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజధాని నగరం కావచ్చు.. జిల్లా, మండల కేంద్రం కావచ్చు! అన్నిచోట్లా ఒకే పరిస్థితి. ఖాతాదారుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక, అడిగినంత నగదు ఇవ్వలేమని చెప్పలేక కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. ‘నగదు లేదు. ఖాతాదారులు సహకరించగలరు’ అంటూ బోర్డును ఏర్పాటు చేశారు.. ఇక కొన్ని ఏటీఎం కేంద్రాల్లో అయితే ‘ఔటాఫ్‌ సర్వీసు’ బోర్డులు తగిలిస్తున్నారు. చిన్న చిన్న నగదు చెల్లింపులకూ రేపు, ఎల్లుండి అంటూ తిప్పుతున్నారు. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులతో ఖాతాదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. ‘మా డబ్బు కోసం మేం ఇబ్బందులు పడాల్సి వస్తోంద’ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బు లేక ఇతర బ్యాంక్‌ల ఏటీఎంలను ఆశ్రయించాల్సి వస్తే రూ.25ల కోత విధిస్తున్నారు.ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లోని ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో ప్రజలు ఏదో ఒక ఏటీఎంలో డబ్బు దొరక్కపోతుందా అన్న ఆశతో అన్ని ప్రాంతాల్లో కాళ్లరిగేలా తిరిగారు. వాస్తవానికి ఈ కష్టాలు నేడు కొత్తగా వచ్చినవి కావు. దాదాపు నెల రోజులుగా అనేక ఏటీఎంలలో డబ్బు లేక షట్టర్లు మూసివేసి ఉండటంతో ప్రజలు నరకం చూస్తున్నారు. బ్యాంకుల్లోనూ నగదు నిల్వల కొరత ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు 20, 30 శాతం మించి నగదు లభ్యత లేదు. దీనికితోడు, మూడు నెలలుగా రిజర్వ్‌ బ్యాంకు నుంచి నగదు రావట్లేదు. ఇటీవల ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్యాంకుల్లోని డిపాజిట్లను వివిధ వర్గాలు పెద్ద ఎత్తున ఉపసంహరిస్తున్నారు. ప్రతి బ్రాంచి నుంచి డిపాజిట్లు తీసేస్తున్న వినియోగదారులు ఆ నగదును మళ్లీ చెలామణిలోకి తేవట్లేదు. ఇక, వ్యవసాయ సీజన్‌ కావడంతో రైతులకు చెల్లింపులు చేయడానికి వ్యాపారులు ముందుగానే పెద్దఎత్తున డబ్బులు డ్రా చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రమే కాకుండా ఏడాదిగా విత్‌డ్రాయల్స్‌ తప్ప బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటన్నిటికీతోడు, నెలవారీ పింఛన్ల చెల్లింపుల సమయం కావడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు తగ్గిపోయాయి. రోజుకు రూ.4 లక్షలు ఇస్తేగానీ వ్యాపారికి నడవదు. రైతుకు డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకుకు వచ్చే వ్యాపారులకు లక్షకు మించి ఇవ్వడం లేదు. ఒకవేళ, లక్ష ఇచ్చినా అవి కూడా 10, 20 నోట్లు ఇస్తున్నారు. దాంతో, వాటిని లెక్కించడమే ఓ పనిగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కో ఖాతాదారునికి రూ.40 వేలు మించి ఇవ్వడం లేదు..ఒక్క విజయవాడలోనే కాదు రాష్టమ్రంతటా ఇదే పరిస్థితి ఉంది. అనేక ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు నిత్యం దర్శనమిస్తున్నాయి. బ్యాంక్‌లో చెక్ ఇచ్చి డ్రా చేసుకుందామంటే పలు బ్రాంచిలలో ప్రస్తుతం తమ వద్ద నగదులేదంటూ చేతులెత్తేస్తున్నారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఏది ఏమైనా ఏటీఎంలు ఎనీ టైమ్ ‘నో మనీ’ కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరవాసులు మాత్రం కరెన్సీ కరవుతో అల్లాడుతున్నారు.
Tags:Any Time ‘No Money’ centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *