పండ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్ 

AP Top in Fruit Production

AP Top in Fruit Production

Date:26/11/2018
ఏలూరు ముచ్చట్లు:
పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్ట్రను వెనక్కునెట్టి మన రాష్ట్రం ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పంటల వాటాయే మూడింట రెండొంతులుగా ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు సూక్ష్మ సేద్య సాగు పెరుగుతుండటం కూడా ఉత్పత్తి పెంపుదలకు దోహదపడుతోంది. ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్‌, దానిమ్మ, తైవాన్‌ జామ, పుచ్చ, కర్బూజనే కాకుండా.. విశాఖపట్నంలో యాపిల్‌, రాయలసీమలో ఖర్జూర సాగుపైనా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే పండ్లలో రాష్ట్ర వాటా అయిదేళ్ల కిందట 10.54 శాతం మాత్రమే ఉండేది. గడచిన రెండేళ్లలో ఇది 15 శాతానికి చేరుకోవడం గమనార్హం. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చాలని ఆ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది.
దీనితో పాటు కోస్తా జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగు విస్తరిస్తోంది. 2016-17లో ఉద్యాన పంటల సాగు 39.81 లక్షల ఎకరాల్లో ఉంటే.. 2017-18 నాటికి 41.61 లక్షల ఎకరాలకు చేరింది.అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ సాగు చేసే పండ్ల తోటల్లో అరటి, మామిడి ఎక్కువగా ఉన్నాయి. మామిడికి చిత్తూరు, అరటికి అనంతపురం కీలకంగా మారాయి. ఇక్కడ సాగు క్రమంగా పెరుగుతుండటంతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అధిక ఉత్పత్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి మామిడి నేరుగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన వైపు ఔత్సాహిక రైతులు కూడా దృష్టి సారిస్తున్నారు. అనంతపురం నుంచి 3,613 టన్నుల అరటి ఎగుమతి చేసినట్లు ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి తెలిపారు. నింజా కార్ట్‌ ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. మహారాష్ట్రకు చెందిన దేశాయ్‌ ఫ్రూట్స్‌ సంస్థ కూడా ఏటా 30 వేల టన్నుల అరటి ఎగుమతికి ముందుకొచ్చిందని వివరించారు.
Tags:AP Top in Fruit Production

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *