కాక మీదన్న తెలుగు రాజకీయాలు

Apart from Tamil politics

Apart from Tamil politics

Date:19/03/2018
తెలుగు ముచట్లు :
నిన్న మొన్నటి వరకు తిరుగులేని నాయకుడిగా దేశంలో ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నరేంద్ర మోదీ వెన్ను లో వణుకు పుట్టించే స్థాయిలో తెలుగు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దాదాపు వారం పది రోజుల నుంచి జరుగుతున్న మార్పులు హస్తినాపురిలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంతో చాలా సఖ్యతగా ఉండే వారు. రాష్ట్రపతి ఎన్నికలు, పెద్దనోట్ల రద్దు లాంటి కీలక పరిణామాలన్నింటిలో పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. కొన్ని కొన్ని విషయాలలో నరేంద్రమోదీ సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్న సందర్భాలలోనూ వీళ్లిద్దరూ అండగా నిలిచారు. కానీ అలాంటిది దాదాపు ఒకే సమయంలో ఇద్ద రూ తిరగబడ్డారు. ఒకరు ఏకంగా కేంద్రంలోని తన మంత్రు లతో రాజీనామా చేయించి ఎన్డీయే నుంచి బయటికొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు వెళ్లడమే కాకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తెరవెనుక పావులు కదుపుతుంటే, మరొకరు థర్డ్ ఫ్రంట్.. కాదుకాదు ఫస్ట్ ఫ్రంట్ పెట్టి అంతు తేలుస్తానంటూ రంకెలేస్తున్నారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలన్నీ చల్లబడినా రాజకీయ వాతావరణం మాత్రం సముద్రంలో అల్పపీడనంలా అల్లకల్లోలంగా మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, అవసరమైతే ఇక్కడి నుంచే జాతీయ రాజకీయాలు చేస్తానని ప్రకటించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ మీదే తిరగబడ్డారు.తెలుగు రాష్ట్రాల్లో విభజన హామీలను నిర్లక్ష్యం చేసిందని, అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం అతి కొద్దిమంది కలిసి ఇన్ని కోట్ల మంది విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంటని, రిజర్వేషన్ల లాంటి వ్యవ హారాలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని, సమాఖ్య వ్యవస్థకు కొత్త అర్థం చెబుతానని ఆయన అంటున్నారు. నిజంగానే అమెరికా లాంటి దేశాలలో చూసుకుంటే దాని పేరే ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’. అంటే కేవలం కొన్ని రాష్ట్రాల సమూహమే తప్ప విడిగా దేశం కాద న్న మాట. మొత్తమ్మీద అమెరికా అనే అంటున్నా, ఎక్కడి కక్కడ న్యాయవ్యవస్థ, చట్టం వేర్వేరుగా ఉంటాయి. పూర్తి స్థాయి సమాఖ్య వ్యవస్థ అక్కడ కనపడుతుంది. ఆ తరహా పరిపాలన ఇక్కడ కూడా రావాలన్నది కేసీఆర్ ఆకాంక్షలా కనిపిస్తోంది. కొంతవరకు పర్వాలేదు గానీ, అలా ఉంటే అసలే ఇప్పటికే జలాల పంపిణీ విషయంలో కత్తులు దూసు కుంటున్న రాష్ట్రాల మధ్య ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అనుమానమే. ఆ మాట అలా ఉండగానే ఉన్నట్టుండి తెలంగాణ అసెంబ్లీ రణరంగంగా మారింది. చినికి చినికి గాలివానగా మారినట్లు అది కాస్తా ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేసేవరకు వెళ్లిపోయింది. ఇప్పటివరకు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి మహా అయితే ఆయన చేతుల్లోని కాగితాలు లాక్కునే వరకు చూశామే గానీ ఏకంగా గవర్నర్ మీదే మైకులు, హెడ్‌సెట్లు విసిరేయడాన్ని చూడలేదు. అది మండలి చైర్మన్‌కు తగిలి కంటికి గాయం కావడం మరింత దురదష్టకరం. అదే నిజంగా గవర్నర్‌కు తగిలి ఉంటే.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేది. చర్యలు కూడా మరింత కఠినంగా ఉండేవేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమ య్యాయి. ఈ గొడవను సమర్ధించుకోడానికి కాంగ్రెస్ ఎంతలా ప్రయత్నించినా, 48 గంటల నిరాహార దీక్ష చేసినా ఫలితం మాత్రం లభించలేదు. వాళ్లకు రావాల్సిన మైలేజి రాలేదు సరికదా, చిన్నపిల్లల్లాగ అలా బెంచీలు ఎక్కడం, మైకులు విసిరేయడం ఏంటన్న వ్యాఖ్యలు కూడా విన వచ్చాయి.
ఏపీలో విచిత్ర రాజకీయ చదరంగంతెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే.. దానికి దాయాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు సరిగ్గా చెప్పాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చినప్పటి పరిస్థితిలాగే ఉన్నాయి. అక్కడ ఎటు చూసినా తీవ్ర గందరగోళం, అల్ల కల్లోలమే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఇంతకుముందు అసెంబ్లీలో చూసుకుంటే ఒకరే ప్రత్యర్థి. కేవలం అక్కడ రెండు పార్టీల రాజకీయం మాత్రమే ఉందనిపించేది. ఒక అధికార పక్షం, ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ. రెండూ బలంగా ఉండటంతో కొదమసింహాల్లా ఢీకొనేవి. రెండింటి మధ్య ఓట్ల తేడా కూడా రెండు శాతం మాత్రమే కావడంతో ఎవరికి వారు బలోపేతం కావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిం చేవారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి పరి స్థితులు మారిపోయాయి. ఇప్పుడక్కడ బహుముఖ రాజకీయం నడుస్తోంది. ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక వైఎస్‌ఆర్ సీపీ, ఒక జనసేన.. ఇంకా వీటన్నింటికీ తోడు ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు. వీటిలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు మొత్తంమీద సొంతంగా ఉన్న ఓటు బ్యాంకు శాతం తక్కువే అయినా.. అవి కూడా ఎంతో కొంత ప్రభావం చూపించగల స్థాయిలోనే ఉన్నాయి. సొంతంగా గెలిచేంత పరిస్థితి మాట ఎలా ఉన్నా, అవతలి వాళ్ల జయా పజయాలను నిర్ణయించడంలో తమ వంతు పాత్ర పోషించ గలవు. ఇక ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, జనసేన.. ఈ మూడింటి మధ్య బీజేపీతో కలుపుకొని అక్కడ చిత్రమైన రాజకీయ చదరంగం నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు బీజేపీతో మైత్రి నెరపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నట్టుండి బంధాన్ని తెంచుకోవడమే కాక.. ఏకంగా కత్తులు దూస్తోంది కూడా. మోదీ మీద జగన్ అవిశ్వాసం పెడితే ఆయన ప్రభు త్వం ఏమైనా పడిపోతుందా అని ప్రశ్నించిన చంద్రబాబు.. స్వయంగా తన పార్టీ వాళ్లతో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇప్పించడం ఆయనలో వచ్చిన పెద్ద మార్పును సూచిస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే, ముందురోజు అసెంబ్లీలో స్వయం గా తానే ప్రకటన చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు మద్దతిస్తారని చెప్పి, మర్నాడు ఉన్నట్టుండి తమ ఎంపీ తోట నరసింహంతో స్వయంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇప్పించడం మరో ఎత్తు. అనుక్షణం మారే చంద్ర బాబు రాజకీయ ఎత్తుగడలను ఈ మార్పు సూచిస్తుంది. తీర్మానం ఎవరు పెడితేనేం.. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన గొంతు అక్కడ వినిపించడమే కదా అని ఈ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ కొంత రాజీపడినట్లు కనిపిస్తోంది. ఆ మాటకొస్తే జగన్ ముందునుంచి ఒకమాట చెబుతున్నా రు. ‘మేము అవిశ్వాసం పెడతాం, చంద్రబాబును మద్దతి వ్వమని చెప్పండి.. లేదా ఆయన్నే పెట్టమనండి.. మేం మద్దతిస్తాం’ అంటున్నారు. దానికి తగ్గట్లే జరిగింది. కానీ ఈ ఎపిసోడ్ మొత్తానికి తాను సూత్రధారిగా వ్యవహరిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ మాత్రం ఎంపీలను కూడగట్టే ప్రయత్నంలో ఎక్కడా కనిపించలేదు. గుంటూరు జిల్లాలో ప్రబలిన అతిసార వ్యాధి బాధితులను పరామర్శించడం, ఎన్నారైలతో సమావేశాలు పెట్టి వాళ్లను మోటివేట్ చేయడం లాంటి కార్యక్రమాలలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా.. నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారన్న మాటతో జాతీయ స్థాయిలో మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా అవిశ్వాసానికి మద్దతి స్తా మంటూ ముందుకొచ్చాయి. స్వయంగా కాంగ్రెస్ పార్టీ సైతం ఇందులో చేతులు కలపడం అతి పెద్ద విశేషం. ఈ ఐక్యత రేపు ఎన్నికల వరకు ఉంటుందా అంటే అనుమానమే గానీ, ప్రస్తుతానికైనా వీళ్లంతా మనకోసం ఒక్కటిగా నిలవడం మాత్రం కాస్త సంతోషించాల్సిన విషయమే అని చెప్పు కోవాలి. అలాగని రేపు చంద్రబాబు లేదా చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌లోకి వీళ్లు వస్తారా?.. వస్తే ప్రధాని అభ్యర్థి ఎవరవుతారు అన్నంతవరకు చర్చలు వెళ్లేలా లేవు. కేసీఆర్‌కు అభయం ఇచ్చారని చెప్పిన మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ లాంటి వాళ్లు ఆ తర్వాత కాంగ్రెస్ పంచన చేరేలా కనిపించడమే అందుకు కారణం. మాజీ కాంగ్రెస్ నాయకులే అయిన శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్లంతా మళ్లీ మాతసంస్థతో కొంతవరకు కలిసి దేశ రాజ కీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తే, అప్పుడు ఈ ఫ్రంట్‌లు ఏమీ ఏర్పడే అవకాశం లేదు, ఒకవేళ ఏర్పాటైనా పెద్దగా ప్రభావం చూపించే చాన్స్ ఉండదు.మరోవైపు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారి పోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎవరి మనిషి అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్‌లో గట్టిగానే నడుస్తోంది. జనసేన పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు చాలాకాలం క్రితమే ప్రకటించిన పవన్.. తాజాగా పార్టీ ఆవిర్భావ సభ అంటూ ఓ భారీ కార్య క్రమాన్ని ఏర్పాటుచేశారు. దానికి ఇసుకేస్తే రాలనంత జనం కూడా వచ్చారు. ఆ సభలో పవన్ నూటికి నూరుశాతం రాజకీయాలు మాత్రమే మాట్లాడారు. ఏపీలో లెక్కలేనంత అవినీతి ఉందని, నియోజకవర్గానికి 25 కోట్లు సిద్ధం చేసి పంపేస్తున్నారని, లోకేష్ ఎన్నికల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని, ఎమ్మెల్యేల అరాచకాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని, ఫాతిమా కాలేజి విద్యార్థుల సమస్య ను గాలికి వదిలేశారని, పోలవరం ప్రాజెక్టును ప్రైవేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, అమరావతికి అన్ని వేల ఎకరాల భూములెందుకని.. ఇలా చాలా విషయాలు ప్రస్తావించారు. దాంతో ఆయన స్క్రిప్టు ఎవరిదన్న చర్చ అక్కడ గట్టిగానే నడిచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కాకుండా ఉండటానికి చంద్రబాబే పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించి, వ్యతిరేక ఓటును చీలుస్తున్నారన్నది వైఎస్‌ఆర్‌సీపీ వాదన.  రేపు ప్రత్యేక హోదా పోరులో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ హోదా ప్రకటిస్తే, ఎటూ హోదా ఇచ్చేవాళ్లకు తన మద్దతు ఉంటుందని జగన్ ఇంతకుముందే చెప్పారు కాబట్టి ఆ దిశగా ఏపీ రాజకీయాలు నడుస్తాయా అని కూడా అంటున్నారు. ఒకవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, కాబోయే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మరోవైపు పవన్ కల్యాణ్ దాదాపు ఒకేలాంటి ఆరోపణలు చేశారు. రెండూ టీడీపీ ప్రభుత్వంలో అవినీతి గురించి చెప్పినవే. త్వరలోనే జాతీయ స్థాయి మీడియా చానల్ ఒక దాంట్లో ఏపీ అవినీతి గురించిన సంచలన కథనం రాబోతోందని కూడా తెలుస్తోంది.ఇవన్నీ చూస్తుంటే ఏపీలో ప్రతిపక్షం మొత్తం కన్సాలిడేట్ అయ్యి, అంతా కలిసి చంద్రబాబు మీద పోరాటం చేసే అవకాశం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో మోదీ మీద ఇలా ప్రతిపక్షాన్ని ఏకం చేసి పోరాడా లనుకున్న చంద్రబాబుకు.. సొంత రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏకమైతే కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం మంచి కాకమీద ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడితే తప్ప ఇక్కడి రాజకీయ ముఖచిత్రంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.
Tags:Apart from Tamil politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *