బ్యాడ్‌న్యూస్‌ : ఐఫోన్‌ ఎక్స్‌ నిలిపివేత?

Apple iPhone X

Apple iPhone X

సాక్షి

Date :22/01/2018

ఐఫోన్‌ పదో వార్షికోత్సవంగా టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఖరీదైన ఐఫోన్‌ ఎక్స్‌ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కొత్త డిజైన్‌లో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చినప్పటికీ, ఆపిల్‌ బెస్ట్‌-సెల్లింగ్‌ ఐఫోన్లలో ఒకటిగా ఇది నిలువలేకపోతుంది. ప్రారంభం నుంచి విక్రయాల్లో తన సత్తా చాట లేకపోతున్న ఈ ఫోన్‌ ఆఖరికి నిలిపివేత దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది. నిరాశజనకమైన ఐఫోన్‌ ఎక్స్‌ విక్రయాలు, ఈ ఫోన్‌ను పూర్తిగా నిలిపివేసేందుకు దారితీయవచ్చని కేజీఐ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు మింగ్‌-చి క్యూ చెప్పారు. అంతకముందు 2018 తొలి క్వార్టర్‌లో ఆపిల్‌ ఈ ఐఫోన్‌ను 20-30 మిలియన్‌ యూనిట్లలో విక్రయిస్తుందని అంచనావేసిన కేజీఐ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు మింగ్‌-చి, ప్రస్తుతం ఈ అంచనాలను మరింత తక్కువ చేశారు. కేవలం ఈ క్వార్టర్‌లో 18 మిలియన్‌ యూనిట్లనే విక్రయించవచ్చని పేర్కొన్నారు.

ఈ ఫోన్‌కు చైనీస్‌ కస్టమర్ల నుంచి అంత మంచి ఫలితాలేమీ రావడం లేదని, దీంతో ఐఫోన్‌ ఎక్స్‌ను ఈ ఏడాది మధ్యలో నిలిపివేసి, అతిపెద్ద రీప్లేస్‌మెంట్‌ సైకిల్‌ను చేపట్టవచ్చని పేర్కొన్నారు. దీంతో ఐఫోన్‌ ఎక్స్‌ భవిష్యత్తు అనిశ్చితంగా మారబోతున్నట్టు వెల్లడవుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం 62 మిలియన్‌ యూనిట్ల ఐఫోన్‌ ఎక్స్‌ విక్రయాలు మాత్రమే జరిగాయి. కానీ ఆపిల్‌ 80 మిలియన్‌ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌, చైనా లాంటి దేశాల్లో ఈ ఫోన్‌కు సరియైన స్పందన రావడం లేదు. ధర ఎక్కువగా ఉండటంతో దీని కొనడానికి ఐఫోన్‌ అభిమానులు ఆసక్తి చూపకపోవడం మరో కారణంగా నిలుస్తోంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధరనే 89వేల రూపాయల వరకు ఉంది. హై వేరియంట్‌ ధర లక్ష రూపాయలకు పైమాటే. దీంతో ఐఫోన్‌ ఎక్స్‌నే తక్కువ ధరలో, పెద్ద స్క్రీన్‌ప్లేతో ప్రవేశపెట్టాలని ఆపిల్‌ యోచిస్తోంది. ఈ కొత్త మోడల్స్‌ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాక, ఐఫోన్‌ ఎక్స్‌ అమ్మకాలను నిలిపివేయొచ్చని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *