ఏసీల ఏర్పాటుకు ఆమోదం

Date:13/07/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
సింగరేణి కార్మికుల క్వార్టర్లకు ఏసీల సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సింగరేణి యాజమాన్యం నిధులు సమకూర్చుతోంది. ఏసీల ఏర్పాటుకు రూ.60కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సింగరేణి బోర్డు ఈ మేరకు ఆమోదాన్ని కూడా తెలిపింది. ఏసీల ఏర్పాటు పనులను వేగవంతం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచీ ఆదేశాలు రావడంతో.. ఆ పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకూ కేటాయించిన మొత్తంలో కొంత సొమ్ముతో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, వైరింగ్‌, స్విచ్‌బోర్డులను కొనుగోలు చేయనున్నారు. నివాస గృహాలకు ఏసీల ఏర్పాటులో భాగంగా మొదట 20శాతం సింగరేణి క్వార్టర్లకు ఈ సదుపాయాన్ని కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. వాస్తవానికి సింగరేణి వ్యాప్తంగా 51వేల క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో 8 నుంచి 10వేల వరకు మొదటిదశలో ఏసీలను ఏర్పాటు చేయనున్నారు. మరికొన్ని ఏరియాల్లో పనులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్లను ఏసీలకు అనుగుణంగా మారుస్తున్నారు. సింగరేణి క్వార్టర్లకు వీటిని బిగించాలంటే ప్రస్తుతం ఉన్న విద్యుత్తు లైన్లుగాని క్వార్టర్లుగాని అనుకూలంగా లేవు. దీంతో లైన్లను మార్చుతున్నారు. శీతలీకరణ సౌకర్యం కల్పించాలంటే కాలనీలకు త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేయాలి. దీనికి తగ్గట్లుగానే మార్పులు చేస్తున్నారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీని కూడా పెంచాలి. కాలనీల్లో పోల్‌మౌంటెడ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా అవసరపడతాయని అధికారులు అంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా 15వేలకు పైగా పోల్‌మౌంటెడ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమవుతాయని అంచనా. అన్ని క్వార్టర్లకు ఏసీల సదుపాయాన్ని అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రపోజల్ అంచనా వ్యయం రూ.150కోట్లుగా తేలింది. దీంతో ఇంత మొత్తాన్ని కేటాయించడంపై ఆలోచనలోపడ్డ యాజమాన్యం ఆ తర్వాత అంచనా వ్యయాన్ని తగించింది. ఈ క్రమంలోనేరూ.60కోట్లు విడుదల చేయాలని ఆమోదించింది. సింగరేణి అంతటా 51,378 క్వార్టర్లు ఉన్నాయి. వీటికి త్వరలోనే ఏసీ సదుపాయం రానుంది. కార్మికుల ఇళ్లకు ఏసీలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చడంతో అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఏసీల ఏర్పాటుకు ఆమోదం
Tags:Approval for the formation of ACs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *